పుంగనూరు: ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకోకపోతే రాయలసీమకు నీరులేక ఎడారిగా మారిపోతుందని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం పుంగనూరు సమీపంలోని కృష్ణాపురంలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని కోరారు.
హంద్రీ-నీవా కాలువను వెంటనే పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. శ్రీశైలం, కృష్ణా జలాల నీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు సీఎంలు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. చిత్తూరు జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం స్పందించి పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు.
జన్మభూమి-మా ఊరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మారిపోయిందని దుయ్యబట్టారు. పింఛన్ రూ.వెయ్యి ఇస్తున్నట్లు చెప్పి వేలాది మందికి రద్దు చేయడం బాధాకరమన్నారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పథకాలను కొనసాగించాలని డిమాండు చేశారు. త్వరలోనే టీడీపీ ప్రభుత్వం నిజ స్వరూపం బయటపడుతుందని, ప్రజలే గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్లు నాగరాజారెడ్డి, అమరనాథరెడ్డి తది తరులు పాల్గొన్నారు.
రాయలసీమ ఎడారిగాక తప్పదు
Published Mon, Oct 27 2014 3:44 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement