peddireddi ramacandrareddi
-
రాయలసీమ ఎడారిగాక తప్పదు
పుంగనూరు: ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకోకపోతే రాయలసీమకు నీరులేక ఎడారిగా మారిపోతుందని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం పుంగనూరు సమీపంలోని కృష్ణాపురంలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని కోరారు. హంద్రీ-నీవా కాలువను వెంటనే పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. శ్రీశైలం, కృష్ణా జలాల నీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు సీఎంలు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. చిత్తూరు జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం స్పందించి పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. జన్మభూమి-మా ఊరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మారిపోయిందని దుయ్యబట్టారు. పింఛన్ రూ.వెయ్యి ఇస్తున్నట్లు చెప్పి వేలాది మందికి రద్దు చేయడం బాధాకరమన్నారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పథకాలను కొనసాగించాలని డిమాండు చేశారు. త్వరలోనే టీడీపీ ప్రభుత్వం నిజ స్వరూపం బయటపడుతుందని, ప్రజలే గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్లు నాగరాజారెడ్డి, అమరనాథరెడ్డి తది తరులు పాల్గొన్నారు. -
ఊహల్లో విహరిస్తున్న సీఎం
మొదటి ఐదు సంతకాలకే దిక్కులేదు ఆచరణకు వీలుకాని హామీలతో జనాన్ని మోసం చేశారు విజయవాడ, గుంటూరు మినహా సీఎంకు ఏదీ కనపడడంలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు నమ్మి చంద్రబాబుకు పట్టం కట్టారని, ఇప్పటివరకు ఒక్క హామీనీ నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో ఉండడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. హామీల అమలు గురించి ఆలోచించకుండా ప్రకటనలు, మంత్రివర్గ ఉప సంఘాలు, కమిటీలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక భాగం పెన్షన్లు తీసివేశారని, ఇక కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారో అర్థం కావడం లేదని అన్నారు. పెన్షన్ల కోసం టీడీపీ కార్యకర్తలతో కమిటీలు వేయడం వారి స్వార్థ గుణానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతమిస్తున్న రెండు వందల పెన్షన్ కూడా పేదలకు రాకుండా చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందని దుయ్యబట్టారు. సీఎం ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన ఐదు సంతకాలకు దిక్కులేకుండా పోయిందన్నారు. రుణమాఫీ చేస్తారని రైతులు, వ్యాపారులు, మహిళలు నమ్మి ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా కమిటీలతో కాలయాపన చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంపై ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. బాబు రాగానే జాబు పోవడంతో చాలామంది రోడ్డున పడ్డారని, నిరుద్యోగ భృతి అమలుకు నోచుకోవడంలేదని విమర్శించారు. మాటమీద నిలబడలేని మోసపూరిత వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర పుటల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు మినహా బాబుకు రాష్ట్రంలో ఏదీ కనపడడంలేదన్నారు. తన సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం భూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలన్న ధ్యాస ఈ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు. ప్రత్యేకంగా మైనారిటీల సంక్షేమం కోసం వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని తెలిపారు. ఈ సమావేశంలో పోకల అశోక్‌కుమార్, జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాషా, జయరామచంద్రయ్య, పీలేరు ఎంపీపీ కే.మహితాఆనంద్, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాషా, పార్టీ నాయకులు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బీడీ.నారాయణరెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, ఉదయ్‌కుమార్, రెడ్డిబాషా, భవనం వెంకట్రామిరెడ్డి, కే.ఆనంద్, అమరనాథరెడ్డి, రమేష్ పాల్గొన్నారు. -
జన్మభూమి ఉపయోగంలేని పథకం
సదుం: సీఎం చంద్రబాబునాయుడు అమలు చేయాలనుకుంటున్న జన్మభూమి పథకంతో టీడీపీ కార్యకర్తలకు తప్పా ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించా రు. సదుం మండలం చెరుకువారిపల్లెలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంతో తెలుగు తమ్ముళ్లకే అధిక ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రజలకు మేలు చేకూర్చేదానికన్నా చంద్రబాబు తన కుర్చీని కాపాడుకోవడంతో పాటు తనయుడు లోకేష్‌ను సీఎం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలతో కమిటీలు వేసి పేదలు అందుకునే పింఛన్లను రద్దుచేసి, టీడీపీ కార్యకర్తలకు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించిన వైఎస్సార్ చిరస్మరణీయుడిగా మిగిలారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన జలయజ్ఞం పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు సాగు నీరందేదన్నారు. జలయజ్ఞం ద్వారా తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని సీఎం కేసీఆర్ చెబుతుండగా ఆంధ్ర మంత్రులు దాన్ని తప్పుపట్టడం శోచనీయమన్నారు. దొనకొండలో రాజధాని ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉండేదని, చంద్రబాబు ఏకపక్షంగా విజయవాడను ప్రకటించారని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి అమలు సాధ్యంకాని హామీలు ఇవ్వలేదని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆయన నిర్ణయమే సరైందన్నారు. వంద రోజుల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఐదేళ్ల తర్వాత వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సుబ్రమణ్యం, సర్పంచ్‌లు వెంకటరమణ, నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తిమ్మారెడ్డి, పాపిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల విశ్వాసాన్ని చూరగొందాం
కార్యకర్తలకు అండగా నిలుద్దాం ఎంపీ కార్యాలయ ప్రారంభ సభలో వైఎస్ఆర్సీపీ నేతలు తిరుపతి : ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడి ప్రజల విశ్వాసాన్ని చూరగొందామని వైఎస్ఆర్సీపీ నా యకులు పిలుపునిచ్చారు. స్థానిక కేశవాయనగుంటలో తిరుపతి ఎంపీ వరప్రసాదరావ్ కార్యాలయం బుధవారం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించిన అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 100 రోజుల పాలనపట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేశామా అని పశ్చాత్తాప పడుతున్నారన్నారు. జిల్లాలో ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేని టీడీపీని భవిష్యత్తులో ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మొన్నటి ఎన్నికలలో తిరుపతిలో వైఎస్ఆర్సీపీ పరాజయం చెందడం బాధాకరమని, కరుణాకరరెడ్డి అనునిత్యం ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యల పరిష్కారానికి పలు పోరాటాలు చేశారన్నారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని చంద్రబాబు ఎన్ని అడ్డదార్లు తొక్కాలో అన్నీ తొక్కారన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధించి భయపెట్టాలని చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తామని ఇన్నాళ్లు పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను తమ భుజాలపై మోస్తామని కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. దివంగత నేత వైఎస్ఆర్ లాగా కార్యాలయాన్ని ప్రారంభించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎంపీ వరప్రసాదరావ్ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకరరెడ్డి అభినందించారు. నాయకులు కలసికట్టుగా పనిచేసి పార్టీ ప్రతిష్టను మరింతగా ఇనుమడింప చేద్దామని జిల్లా అధ్యక్షులు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్న అధికారులకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన కోరారు. హామీల అమలుకు కృషి చేస్తా వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎంపీ వరప్రసాదరావ్ అన్నారు. తిరుపతి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మన్నవరం, అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం, గాలేరు-నగరి ప్రాజెక్టు, తిరుపతిలో దశాబ్దాల తరబడి నివాసాలు ఉన్న ఇళ్లకు పట్టాలు తదిదర సమస్యలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశానన్నారు. ప్రజలు తాను కార్యాలయంలో అందుబాటులో లేని సమయాల్లో వినతి పత్రాలను కార్యాలయంలో అందచేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, షఫీ అహమ్మద్ ఖాద్రీ, పుల్లయ్య, చెలికం కుసుమ, టీ.రాజేంద్ర తదితరులు ప్రసంగించారు. మబ్బు చెంగారెడ్డి, పులుగోరు ప్రభాకర్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్, వైఎస్ జగన్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఎప్పుడిస్తారు?
సర్కార్‌ను నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తిరుపతి : రైతుల కరెంట్ కడగండ్లు తీర్చడానికి వ్యవసాయానికి ఎప్పటి నుంచి 9 గంటల కరెంట్ ఇస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ స మస్యలను సోమవారం వారు అసెంబ్లీ లో ప్రస్తావించారు. ప్రస్తుతం వ్యవసాయానికి రోజూ 7 గంటలు కూడా కరెం ట్ ఇవ్వడం లేదని అలాంటిది 9 గంటల కరెంట్ హామీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. హామీకి కట్టుబడి ఉంటే ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని పట్టుబట్టారు. రోజుకు 7 గంటలు కరెంట్ ఇవ్వకున్నా వాడినట్లు లెక్కగడుతున్న అధికారులు బకాయీల కోసం నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 5హెచ్‌పీ మోటార్ వాడితే గంటకు 2.73 యూనిట్లు, నెలకు 783.3 యూ నిట్ల వంతున సంవత్సరానికి 9399.6 యూనిట్లు కాలుతుందని కేటగిరీని బట్టి యూనిట్‌కు 50 పైసల నుంచి రూపా యి వంతున వసూలు చేసినా ప్రభుత్వానికి ప్రతిరైతు 5 వేల నుంచి 10 వేల రూ పాయల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పైగా నెలకు 20 రూపాయలు, ఏడాదికి 240 రూపాయల వంతున 10 సంవత్సరాలకు లెక్కగట్టి 2400 రూపాయలు సర్వీస్ చార్జీలు వసూలు చేయబోతున్నట్లు తెలిసి రైతులు దిగులు చెందుతున్నారన్నారు. బకాయీలు రా బట్టుకునేందుకు పంట బిల్లుకు ఇంటి బిల్లుకు లింకు పెట్టి పంట బిల్లు చెల్లించకపోతే ఇంటి కనెక్షన్ కట్ చేస్తారనే ప్రచా రం జరుగుతోందని ఒక వేళ అదేగనుక జరిగితే రైతులు ఆత్మహత్యలకు పాల్ప డే ప్రమాదం ఉందన్నారు. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ ్చరించారు. రాష్ట్రంలో ఉన్న 9 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లలో లక్షకు పైగా కనెక్షన్లను ప్రభుత్వం తొలగించనున్నట్లు వార్తలు వినవస్తున్నాయని అలాంటి ఆలోచన ఏదైనా ప్రభుత్వానికి ఉందా? అని వారు ప్రశ్నించారు. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తే చంద్రబాబు రైతు వ్యతిరేకి అన్న భావన రైతుల్లో బలపడుతుందన్నారు. అలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి ఉంటే వెంటనే విరమించుకోవాలని కోరారు. అలాంటి నిర్ణయాలు తీసుకోబోమని సంబంధిత మంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు తెలిపారు. -
టీటీడీ ఆస్తులను కాపాడండి
భక్తులు కానుకలుగా సమర్పించిన ఆస్తులు అన్యాక్రాంతం భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి టీటీడీ, ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, చింతల సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవారికి భక్తులు కానుకలుగా సమర్పించిన ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే టీటీడీ, ప్రభుత్వం ఏం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. భక్తితో ఇచ్చిన ఆస్తులను కబ్జాదారులు సొంతం చేసుకుంటే భక్తు ల మనోభావాలు దెబ్బతినవా అని ప్ర శ్నించారు. అన్యాక్రాంతమైన ఆస్తులను తక్షణమే స్వాధీనం చేసుకుని భక్తుల మనోభావాలను కాపాడాలని సూచించారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మొక్కుబడుల రూపంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు భారీ ఎత్తు న కానుకలు సమర్పిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా తిరుమలకు వస్తోన్న భక్తులు తమ ఆస్తులను కూడా కానుకగా శ్రీవారికి ఇస్తున్నారని చెప్పారు. ఇలా ఇచ్చి న వాటిల్లో చెన్నై, కలకత్తా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విలువైన భూ ములు, భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయన్నారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి కి కానుకగా సమర్పించిన ఆస్తుల్లో అనేకం అన్యాక్రాంతమయ్యాయన్నారు. భక్తులు భక్తితో సమర్పిం చిన ఆస్తులను టీటీడీ అధికారులు పరిరక్షించలేకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ అంటే మినీ గవర్నమెంటు వంటి సంస్థ అని.. ఆ సంస్థలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారి, సుమారు 16వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న టీటీడీ భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశా రు. అన్యాక్రాంతమైన టీటీడీ ఆస్తుల వివరాలను నిగ్గుతేల్చేందుకు సభా సంఘాన్ని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే అన్యాక్రాం తమైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో టీటీడీ షాపింగ్ కాంప్లెక్స్‌లను తక్కువ అద్దెకు సొంతం చేసుకున్న బడా వ్యాపారులు.. అద్దెను పెంచకుండా టీటీ డీ ఆదాయానికి గండికొడుతున్నారన్నారు. ఆ బడా వ్యాపారులకు టీటీడీ ఉన్నతాధికారులు కొందరు వంతపాడుతున్నారన్నారు. తక్షణమే లీజులను రద్దు చేసి.. టెండర్ల ద్వారా షాపింగ్ కాంప్లెక్స్‌లను లీజుకు ఇచ్చి టీటీడీకీ అదనపు ఆదాయాన్ని రాబట్టి ఆ ధనా న్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని సూచించా రు. వీరికి దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరా వు సమాధానం ఇస్తూ.. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతమైన మాట వాస్తవమేనని అంగీకరించారు. టీటీడీకి భూములు, షాపింగ్ కాంప్లెక్స్‌ల రూపంలో రూ.9,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయన్నారు. ఆ ఆస్తులను పరిరక్షించడంతోపాటు అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. తక్కువ అద్దె ఇస్తోన్న షాపింగ్ కాంప్లెక్స్‌ల లీజులను రద్దు చేసి.. టెండర్లు నిర్వహించి కొత్తగా లీజుకు ఇస్తామని స్పష్టీకరించారు. -
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతోనే..
పుంగనూరు: అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలుస్తూ.. వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తాను ముందుకు పోతున్నట్టు పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పుంగనూరు మండలం పట్రపల్లెలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రాజకీయరంగ ప్రవేశం చేపట్టిన రోజు నుంచి దశాబ్దాలుగా ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను పరిష్కరించడమే ఆశయం గా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతియేటా రెండుసార్లు నేరుగా ప్రజలను కలుసుకునేందుకు అధికార యం త్రాంగంతో వెళతానన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రెండుసార్లు పర్యటిస్తుండటంతో గ్రామ సమస్యలపై అవగాహన వస్తుందన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు అభివృద్ధికి కొంత మేరకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గ్రామ పర్యటనలు చేపట్టి, ప్రజలతో మమేకం కావాలని కోరారు. ఎన్నికలు వచ్చేంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు మోసాలను జనం గుర్తించారని, వారికి తగిన గుణపాఠం నేర్పుతారని తెలిపారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి మినహా మరేమీ జరగలేదని తెలిపారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు స్వార్థంతో పేద ప్రజలను నట్టేట ముంచేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, జెడ్పీమాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు నాగరాజారెడ్డి, అమరనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్రమణ్యయాదవ్, చంద్రారెడ్డి యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటాం
పుంగనూరు: ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటా మని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం వేర్వేరుగా ప్రకటనలు విడు దల చేశారు. రంజాన్ పండు గ సందర్భంగా జిల్లాలోని ముస్లిం మైనార్టీలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాం క్షలు తెలిపారు. అలాగే ఎంపీ మిధున్‌రెడ్డి రాజం పేట, చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపా రు. ముస్లిం మైనార్టీలు సత్యనిష్టతో ఉపవాసాలు ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడా రు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి ముస్లింలు రంజాన్ పండుగ ను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. -
ప్రజాభిప్రాయం మేరకే రాజధాని ఏర్పాటు చేయాలి
తిరుపతి : రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని పుంగనూరు శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. అస్మదీయులకు ప్రయోజనం చేకూర్చేందుకే చంద్రబాబు విజయవాడ-గుంటూరు మధ ్య రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారన్నారు. రాజధాని ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాలు, ఆలోచన లతో నిమిత్తం లేకుండా ముందుగానే నిర్ణయం తీసుకుని తన అనుయాయుల చేత తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించారన్నారు. నియంతృత్వ పోకడలకు పోతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేదన్నారు. రుణ మాఫీపై చంద్రబాబు దగాకోరు విధానాలను ప్రజలు గ్రహిస్తున్నారని, రైతులు, మహిళలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రుణమాఫీపై చంద్రబాబు చేసిన ప్రకటనతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమన్నారు. లక్షా రెండు వేల కోట్ల రూపాయల రుణాలలో కేవలం 35 వేల కోట్లు మాత్రమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు, ఇది కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదన్నారు. అంతా మేలు చేసేసినట్లు మైండ్‌గేమ్ ఆడి ఎన్నికల హామీల నుంచి తప్పుకుని ప్రజల చూపును మళ్లించే యత్నం చేస్తున్నారని రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు స్పందించేలోపు పుణ్యకాలం దాటిపోయిందని ఖరీఫ్ అదను దాటిపోవడంతో రైతులు రుణాలు మాఫీ కాక, క్రాప్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ వంటివి పొందే వీలు కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నారన్నారు. రుణాల రీషెడ్యూలింగ్‌పై ఆర్బీఐ సైతం ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని బ్యాంకులు రైతులకు, డ్వాక్రా గ్రూపులకు నోటీసులు పంపి రుణ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎన్నికలు ముగిసి ఏదో విధంగా అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. -
బాబు, మంత్రులకు అవగాహన లేదు
మోడిని రాక్షసుడన్న బాబు పదవి కోసమే పొత్తు ముస్లింలకు మోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం పుంగనూరు: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఆయన మంత్రివర్గ సభ్యులకు అవగాహన లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని, మోడి రాక్షసుడని, గుజరాత్ అల్లర్లకు మోడి కారకుడని ఎద్దేవా చేసిన చంద్రబాబు చివరకు పదవి కోసం బీజేపీతో పెట్టుకున్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు ఎవరికైనా పదవులు ఇచ్చారా..? డబ్బు న్న వారికి ఎమ్మెల్సీలుగా గుర్తించి మంత్రులను చేసిన చంద్రబాబుకు ముస్లిం మైనార్టీలు కన్పించలేదా’’ అంటూ పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. శుక్రవారం రాత్రి పుంగనూరు అంజుమన్ షాదిమహాల్‌లో ముస్లిం నేతలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానిం చారు. ముస్లింలను ఉద్దేశించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నిక ల సమయంలో చంద్రబాబు నాయు డు రుణమాఫీ చే స్తామని చెప్పి, పదవి రాగానే మాట మార్చుతూ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రుణమాఫీ ని పక్కన పెట్టి, రుణాలను రీషెడ్యూల్ చేస్తామని, వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదమన్నా రు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తం భించిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కి, మంత్రుల మాటలకు పొంతనలేదన్నారు. మంత్రులు, చంద్రబాబు అవగాహన లేకుండా ఇష్టానుసారం మా ట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎర్రచందనం 5 వేల టన్ను లు ఉందని, దానిని విక్రయిస్తామని ఆ మంత్రి చెబుతుంటే, ముఖ్యమంత్రి 15 వేల టన్నులు ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎంత ఎర్రచందనం సీజ్ చేశారో తెలియని మంత్రివర్గం పరిపాలన ఎలా చేస్తారని నిలదీశారు. రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు ప్రజలను మోసగించారని దుయ్యబ ట్టారు. రెండు మూడు నెలల్లో రుణమాఫీలపై రైతులు, మహిళలు తిరగబడి ఉద్యమం నిర్వహిస్తారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఇప్పటికైనా సమస్యను గుర్తించి, రుణమాఫీ చేసి రైతులను, మహిళలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు చోటు కల్పించకపోవడం వారిని అవమానిం చినట్లేనని అన్నారు. భవిష్యత్తులో ముస్లిం సోదరులు ఇలాంటి విషయాలను గుర్తించుకుని తగిన గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు రెడ్డెప్ప, కొండవీ టి నాగభూషణం, వెంకటరెడ్డి యాద వ్, అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, ఆవుల అమరేంద్ర, క్రిష్ణారెడ్డి, త్యాగరా జు, ఖాదర్‌బాషా, ఇనాయతుల్లా షరీ ఫ్, ఫకృద్ధిన్ షరీఫ్, కెఎస్‌ఏ.ఇఫ్తికార్ అలీఅహమ్మద్, అమ్ము, ఇబ్రహిం తది తరులు పాల్గొన్నారు.