పుంగనూరు: అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలుస్తూ.. వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తాను ముందుకు పోతున్నట్టు పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పుంగనూరు మండలం పట్రపల్లెలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రాజకీయరంగ ప్రవేశం చేపట్టిన రోజు నుంచి దశాబ్దాలుగా ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను పరిష్కరించడమే ఆశయం గా పెట్టుకున్నట్లు తెలిపారు.
ప్రతియేటా రెండుసార్లు నేరుగా ప్రజలను కలుసుకునేందుకు అధికార యం త్రాంగంతో వెళతానన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రెండుసార్లు పర్యటిస్తుండటంతో గ్రామ సమస్యలపై అవగాహన వస్తుందన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు అభివృద్ధికి కొంత మేరకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు.
జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గ్రామ పర్యటనలు చేపట్టి, ప్రజలతో మమేకం కావాలని కోరారు. ఎన్నికలు వచ్చేంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు మోసాలను జనం గుర్తించారని, వారికి తగిన గుణపాఠం నేర్పుతారని తెలిపారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి మినహా మరేమీ జరగలేదని తెలిపారు.
తరువాత వచ్చిన ప్రభుత్వాలు స్వార్థంతో పేద ప్రజలను నట్టేట ముంచేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, జెడ్పీమాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు నాగరాజారెడ్డి, అమరనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సుబ్రమణ్యయాదవ్, చంద్రారెడ్డి యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతోనే..
Published Tue, Aug 5 2014 1:38 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM
Advertisement