- మొదటి ఐదు సంతకాలకే దిక్కులేదు
- ఆచరణకు వీలుకాని హామీలతో జనాన్ని మోసం చేశారు
- విజయవాడ, గుంటూరు మినహా సీఎంకు ఏదీ కనపడడంలేదు
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పీలేరు: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు నమ్మి చంద్రబాబుకు పట్టం కట్టారని, ఇప్పటివరకు ఒక్క హామీనీ నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో ఉండడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. హామీల అమలు గురించి ఆలోచించకుండా ప్రకటనలు, మంత్రివర్గ ఉప సంఘాలు, కమిటీలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఒక భాగం పెన్షన్లు తీసివేశారని, ఇక కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారో అర్థం కావడం లేదని అన్నారు. పెన్షన్ల కోసం టీడీపీ కార్యకర్తలతో కమిటీలు వేయడం వారి స్వార్థ గుణానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతమిస్తున్న రెండు వందల పెన్షన్ కూడా పేదలకు రాకుండా చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందని దుయ్యబట్టారు. సీఎం ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన ఐదు సంతకాలకు దిక్కులేకుండా పోయిందన్నారు. రుణమాఫీ చేస్తారని రైతులు, వ్యాపారులు, మహిళలు నమ్మి ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా కమిటీలతో కాలయాపన చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంపై ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు.
బాబు రాగానే జాబు పోవడంతో చాలామంది రోడ్డున పడ్డారని, నిరుద్యోగ భృతి అమలుకు నోచుకోవడంలేదని విమర్శించారు. మాటమీద నిలబడలేని మోసపూరిత వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర పుటల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు మినహా బాబుకు రాష్ట్రంలో ఏదీ కనపడడంలేదన్నారు. తన సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం భూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలన్న ధ్యాస ఈ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు.
ప్రత్యేకంగా మైనారిటీల సంక్షేమం కోసం వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని తెలిపారు. ఈ సమావేశంలో పోకల అశోక్‌కుమార్, జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాషా, జయరామచంద్రయ్య, పీలేరు ఎంపీపీ కే.మహితాఆనంద్, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాషా, పార్టీ నాయకులు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, బీడీ.నారాయణరెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, ఉదయ్‌కుమార్, రెడ్డిబాషా, భవనం వెంకట్రామిరెడ్డి, కే.ఆనంద్, అమరనాథరెడ్డి, రమేష్ పాల్గొన్నారు.