మేల్కోకుంటే ముప్పు తప్పదు!
♦ ప్రబలుతున్న మలేరియా జ్వరాలు
♦ ప్రతి ఆశ్రమ పాఠశాలల్లోనూ కనిపిస్తున్న బాధితులు
♦ ప్రతి ఆశ్రమంలోనూ వినిపిస్తున్న మూలుగులు
♦ సదుపాయాలు కల్పించడంలో సంక్షేమాధికారులు విఫలం
♦ ఎక్కడ చూసినా తాండవిస్తున్న అపారిశుద్ధ్యమే...
సాలూరురూరల్: మండలంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గిరి జన గురుకుల సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. కొత్తవలస గిరిజన గురుకుల బాలి కల పాఠశాలలో ఐదుగురు, మావుడి గురుకు ల పాఠశాలలో ఐదుగురు, మామిడిపల్లి గురుకుల పాఠశాలలో నలుగురు, తోణాం గురుకు ల పాఠశాలలో తొమ్మిది మంది, కురుకూటి పాఠశాలలో ఇద్దరు, కరాసవలస కేజీబీవీలో ఒకరు ఇలా ఏ విద్యాలయాన్ని పరిశీలించినా విద్యార్థులు జ్వరపీడితులుగానే కన్పిస్తున్నారు.
కనీస సదుపాయాలు కరువు
జ్వరాల బారిన పడిన విద్యార్థులకు వైద్యచికిత్స సంగతి పక్కన పెడితే కనీస సదుపాయాలు కల్పించడంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా మావుడి గురుకుల పాఠశాలలో విద్యార్థుల దుస్థితి మరీ దారుణంగా ఉంది. చలిజ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులు పాఠశాల వరండాలో ఆరుబయట నేలపై పడుకుని ఉన్నారు. వారికి కనీసం మంచాలు కల్పించలేని పరిస్థితిలో అక్కడి అధికారులు ఉన్నారు. పాఠశాలల్లో అపారిశుద్ద్యం పెరిగిపోయి దోమల కారణంగా మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. విద్యార్థులు తిని వదిలేసిన అన్నాలు పాఠశాల ఆవరణలోనే పారబోస్తున్నారు. వాటిపై ఈగలు... దోమలు విస్తరించి రోగాల వ్యాప్తికి కారణాలుగా మారుతున్నాయి.
ఇప్పుడే మేల్కోవాలి
సీజన్ ప్రారంభంలోనే జ్వరాలు ఇలా ప్రబలుతుంటే రా నున్న కాలంలో ఈ తీవ్రత ఎంత హెచ్చుగా ఉంటుందో అంచనా వేయవచ్చు. జిల్లా అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు సరైన చికిత్స, వైద్య సదుపాయాలు అందించి జ్వరాలు మరింతగా ప్రబలకుండా కనీస చర్యలు చేపట్టాలి. లేకపోతే ఈ ఏడాదీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
మలేరియా పాజిటివ్ కేసులు నమోదు
కొత్తవలస, మావుడి, మామిడిపల్లి, కరాసవలస కేజీబీవీ పాఠశాలల్లో స్థానిక వైద్యసిబ్బంది విద్యార్థినీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపూతలు సేకరించి పరీక్షలకు పంపించారు. ఇప్పటికే పలువురికి మలేరియా పాజిటివ్ నివేదికలు వచ్చాయి. వారికి అవసరమైన మందులు అందించారు. కొత్తవలస, కరాసవలస పాఠశాలల్లో ఏసీఎం–5 ద్రావణాన్ని పిచికారి చేశారు. ఇక పాఠశాలలపై నిరంతర నిఘా పెట్టి సమూలంగా వ్యాధులను నయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.