kgvb
-
కేజీబీవీల్లో ఇంటర్ విద్య
బాలికా విద్యకు ప్రాధాన్యమిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెంజల్(బోధన్): కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారాయి. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో ఆరో తరగతినుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్య అందిస్తున్నారు. ఇంటర్ కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి. కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెట్టాలని వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అంగీకారం తెలిపినట్లు డిప్యూటీ సీఎం కడియం ప్రకటించారు. దీంతో పేద విద్యార్థినుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో 25 కేజీబీవీలు.. పేద విద్యార్థినులు చదువు మధ్యలో మానేయకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 25 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్య అందుతోంది. మధ్యలో బడిమానేసిన, అనాథ, నిరుపేద విద్యార్థినులకు ప్రవేశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థినులూ ఇందులో చదువుతున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో 3,855 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అయితే పదో తరగతి వరకే విద్య అందుతుండడం పేద విద్యార్థినులకు శాపంగా మారింది. చదువుకోవాలని ఉన్నా.. వసతితో కూడిన విద్య అందించే కళాశాలలు లేకపోవడంతో చాలామంది పదో తరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ కూడా ఇదే సిఫారసు చేయడంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రయోజనాలు.. కేజీబీవీలలో ఇంటర్ ప్రవేశపెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లు తగ్గుతాయి. పదో తరగతి తర్వాత చదువుకోవడానికి వసతితో కూడిన కళాశాలలు లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు త్వరగా వివాహం జరిపిస్తున్నారు. ఇంటర్ ప్రవేశపెట్టడం వల్ల అలాంటి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బాల్య వివాహాలను నియంత్రించవచ్చు. డ్రాపవుట్లు తగ్గుతాయి.. పదో తరగతి తర్వాత చాలామంది బాలికలు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఫలితంగా డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. కేజీబీవీల్లో ఇంట ర్ వరకు అప్‌గ్రేడ్ చేయడం వల్ల డ్రాపవుట్లు తగ్గుతాయి. కేజీబీవీల్లో పదో తరగతి తర్వాత ఇంటర్ వరకు విద్యనభ్యసించవచ్చు. పై చదువులకు భరోసా ఏర్పడుతుంది. – మమత, ప్రిన్సిపాల్, కేజీబీవీ, రెంజల్ మంచి అవకాశం.. కేజీబీవీల్లో ఇప్పటి వరకు పదో తరగతి వరకే తరగ తులు ఉండేవి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ వరకు కూడా తరగతులు నిర్వహిస్తే మాలాం టి వారికి మంచి అవకాశం లభించినట్లే. బాగా చదువకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తాం. పేదరికం వల్ల మధ్యలో చదువు మానేసిన నాకు కేజీబీవీలో చదువుకునే అవకాశం లభించింది. – సమత, పదో తరగతి విద్యార్థిని ఆర్థికభారం తగ్గుతుంది.. కేజీబీవీల్లో ఇంటి కంటే మంచి వాతావరణం ఉంటుంది. నాణ్యమైన భోజనంతో పాటు ఉన్నతమైన విద్య లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్య ప్రవేశపెట్టాలనే నిర్ణయం మంచిది. మాలాంటి నిరుపేద విద్యార్థులకు చక్కటి అవకాశం. నేను నా చెల్లెలు కస్తూర్బాలో చదువుకుంటు న్నాం. తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. – స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
‘టెన్’షన్..!
కేజీబీవీ బాలికల్లో చాలా మంది గతేడాది వరకు పదోతరగతి పరీక్షలో పదికి పది పాయింట్లు సాధించారు. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారు. భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారు. ఇప్పుడు అదే విద్యాలయ బాలికలు పరీక్షలంటే భయపడుతున్నారు. పదికి పది పాయింట్ల సాధన పక్కన పెడితే పరీక్షలు గట్టెక్కడం ఎలా అని ఆలోచిస్తున్నారు. చదువులో ప్రతిభ చూపే బాలికల్లో సైతం ‘టెన్’షన్ కనిపిస్తోంది. దీనికి ఈ ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమంలో పరీక్షలు రాయాల్సి ఉండడమే కారణం. రామభద్రపురం: కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికల్లో అధికమంది వివిధ కారణాలతో చదువుకు అర్ధంతరంగా దూరమైన వారే. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. వీరిలో విద్యావెలుగులు నింపేం దుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రత్యేకంగా కేజీబీవీలను నెలకొల్పారు. వసతి, భోజన సదుపాయాలతో పాటు ప్రమాణాలతో కూడిన విద్యను బోధించేలా చర్యలు తీసుకున్నారు. తెలుగు మాద్యమంలో తరగతులు నిర్వహించి వారి భవిష్యత్‌కు బాటలు వేశా రు. చాలా మంది బాలికలు పదో తరగతిలో పదికిపది పాయింట్లు సాధించి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారు. అయితే, ఈ ఏడాది అదే విద్యాలయంలో చదువుతు న్న బాలికలు పరీక్షలంటే భయపడుతున్నారు. 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరిగే పదోతరగతి పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో రాసేందుకు కలవరపడుతున్నారు. పునాది బలం లేక... కేజీబీవీల్లో 2015–16 నుంచి ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టారు. తొలి ఏడాది 6, 7, 8 తరగతులకు మాత్రమే వర్తింపజేశారు. అప్పటి 8 వతరగతి విద్యార్థులు తాజాగా ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలను ఆంగ్లంలో రాసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 33 కస్తూర్బా గాంధి బాలికల విద్యాలయాల్లో మొత్తం 6,600 మంది చదువుతున్నారు. వీరిలో ఈ ఏడాది 1200 మంది బాలికలు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. అయితే, ఆంగ్లమాధ్యమం మంచిదే అయినా... మూడేళ్ల నుంచి ఆంగ్లం పరిచయం చేయడంతో పునాది బలం కరువైంది. అప్పటివరకు తెలుగు భాషలో పాఠ్యాంశాలు బోధించే టీచర్లు సైతం ఆంగ్లంలో భోదించేందుకు నానా తంటాలు పడుతున్నారు. పదోతరగతి పరీక్షల్లో భావ వ్యక్తీకరణకు ఆంగ్లభాష ప్రతిబంధకంగా మారిందని, భాషపై పట్టులేకపోవడంతో జవాబులు సరిగా రాయలేకపోతున్నామని బాలికలు వాపోతున్నారు. తెలుగు భాషలో ప్రతిభ చూపే బాలికలు ఆంగ్ల మాధ్యమం సరిగా అర్ధం చేసుకోలేక చదువుపై ఆసక్తి చూపడం లేదు. మళ్లీ మధ్యలో బడులు మానేసి చదువులకు దూరమవుతారేమోనన్న టెన్షన్ తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఒకటో తరగతి నుంచి తెలుగు మాధ్యమంలో చదివి మధ్యలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం వల్లే బాలికలు పరీక్షలంటే భయపడుతున్నట్టు విద్యావేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఉత్తీర్ణత శాతం సాధించకపోతే ఇబ్బందులు పడతామేమోనని కేజీబీవీ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, శిక్షణ ఇవ్వాలని, లేని పక్షంలో సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరిగా ఉంచాలని విద్యావేత్తలు కోరుతున్నారు. -
మేల్కోకుంటే ముప్పు తప్పదు!
♦ ప్రబలుతున్న మలేరియా జ్వరాలు ♦ ప్రతి ఆశ్రమ పాఠశాలల్లోనూ కనిపిస్తున్న బాధితులు ♦ ప్రతి ఆశ్రమంలోనూ వినిపిస్తున్న మూలుగులు ♦ సదుపాయాలు కల్పించడంలో సంక్షేమాధికారులు విఫలం ♦ ఎక్కడ చూసినా తాండవిస్తున్న అపారిశుద్ధ్యమే... సాలూరురూరల్: మండలంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గిరి జన గురుకుల సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. కొత్తవలస గిరిజన గురుకుల బాలి కల పాఠశాలలో ఐదుగురు, మావుడి గురుకు ల పాఠశాలలో ఐదుగురు, మామిడిపల్లి గురుకుల పాఠశాలలో నలుగురు, తోణాం గురుకు ల పాఠశాలలో తొమ్మిది మంది, కురుకూటి పాఠశాలలో ఇద్దరు, కరాసవలస కేజీబీవీలో ఒకరు ఇలా ఏ విద్యాలయాన్ని పరిశీలించినా విద్యార్థులు జ్వరపీడితులుగానే కన్పిస్తున్నారు. కనీస సదుపాయాలు కరువు జ్వరాల బారిన పడిన విద్యార్థులకు వైద్యచికిత్స సంగతి పక్కన పెడితే కనీస సదుపాయాలు కల్పించడంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా మావుడి గురుకుల పాఠశాలలో విద్యార్థుల దుస్థితి మరీ దారుణంగా ఉంది. చలిజ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులు పాఠశాల వరండాలో ఆరుబయట నేలపై పడుకుని ఉన్నారు. వారికి కనీసం మంచాలు కల్పించలేని పరిస్థితిలో అక్కడి అధికారులు ఉన్నారు. పాఠశాలల్లో అపారిశుద్ద్యం పెరిగిపోయి దోమల కారణంగా మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. విద్యార్థులు తిని వదిలేసిన అన్నాలు పాఠశాల ఆవరణలోనే పారబోస్తున్నారు. వాటిపై ఈగలు... దోమలు విస్తరించి రోగాల వ్యాప్తికి కారణాలుగా మారుతున్నాయి. ఇప్పుడే మేల్కోవాలి సీజన్ ప్రారంభంలోనే జ్వరాలు ఇలా ప్రబలుతుంటే రా నున్న కాలంలో ఈ తీవ్రత ఎంత హెచ్చుగా ఉంటుందో అంచనా వేయవచ్చు. జిల్లా అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు సరైన చికిత్స, వైద్య సదుపాయాలు అందించి జ్వరాలు మరింతగా ప్రబలకుండా కనీస చర్యలు చేపట్టాలి. లేకపోతే ఈ ఏడాదీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కొత్తవలస, మావుడి, మామిడిపల్లి, కరాసవలస కేజీబీవీ పాఠశాలల్లో స్థానిక వైద్యసిబ్బంది విద్యార్థినీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపూతలు సేకరించి పరీక్షలకు పంపించారు. ఇప్పటికే పలువురికి మలేరియా పాజిటివ్ నివేదికలు వచ్చాయి. వారికి అవసరమైన మందులు అందించారు. కొత్తవలస, కరాసవలస పాఠశాలల్లో ఏసీఎం–5 ద్రావణాన్ని పిచికారి చేశారు. ఇక పాఠశాలలపై నిరంతర నిఘా పెట్టి సమూలంగా వ్యాధులను నయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పేద విద్యార్థులకు ఉచిత విద్య
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : పదో తరగతి వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నవోదయ, కేజీబీవీ, ఆశ్రమ, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితం వసతులతోపాటు చదువును అందిస్తోంది. దీనికి తోడుగా విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పేది ఇంటర్మీడియెట్ విద్య కూడా కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదోతరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదువు చెప్పించడానికి విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 2014-2015 విద్యాసంవత్సరానికి సంబంధించిన జీవో.ఎంఎస్.సంఖ్య. 235. ఎస్.డ బ్ల్యూ,(ఎడ్యుకేషన్-2), తేదీ: 28-03-2011 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అర్హులైన వారిలో నుంచి 260 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదువుతోపాటు ఎంసెట్ శిక్షణ, వసతి కూడా ఉచితంగా లభిస్తుంది. విద్యార్థుల ఎంపిక, కళాశాలల్లో ప్రవేశం, ఫీజుల చెల్లింపు సౌకర్యాలను ఏర్పర్చడానికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత వ హిస్తారు. హైదరాబాద్‌లోని చైతన్య, నారాయణ, శ్రీగాయత్రి వంటి కార్పొరేట్ కళాశాలల్లో చేరడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలోని విద్యార్థికి నచ్చిన కార్పొరేట్ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. పదో తరగతిలో విద్యార్థి సాధించిన ప్రతిభ ఆధారంగా ఈ నెల 16తేదీన అధికారులు కళాశాలను ఎంపిక చేసి ప్రవేశం కల్పిస్తారు. అర్హులు ప్రభుత్వ సంక్షేమ, ఆశ్రమ, కేజీబీవీ పాఠశాలల్లో చదివిన వారికి 50 శాతం, రెసిడెన్సియల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 20 శాతం, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం, అత్యుత్తమ ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల తలితండ్రుల వార్షికాదాయం రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల వరకు ఉండాలి. పదో త రగతిలో సాధించిన ప్రగతి కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోడానికి ముందు విద్యార్థి కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, ఐఈడీ, రేషన్ కార్డు, పదో తరగతి గ్రేడింగ్, పదో తరగతి హాల్‌టికెట్టు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల చిరునామా వివరాలను సిద్ధం చేసుకోవాలి. వీటి ఆధారాలతో ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోడానికి వీలు క లుగుతుంది.