‘టెన్‌’షన్‌..! | Kgbv School Girls Tention on Tests Written in English Medium | Sakshi
Sakshi News home page

‘టెన్‌’షన్‌..!

Published Mon, Nov 13 2017 9:30 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

Kgbv School Girls Tention on Tests Written in English Medium - Sakshi

కేజీబీవీ బాలికల్లో చాలా మంది గతేడాది వరకు పదోతరగతి పరీక్షలో పదికి పది పాయింట్లు సాధించారు. ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు సాధించారు. భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారు. ఇప్పుడు అదే విద్యాలయ బాలికలు పరీక్షలంటే భయపడుతున్నారు. పదికి పది పాయింట్ల సాధన పక్కన పెడితే పరీక్షలు గట్టెక్కడం ఎలా అని ఆలోచిస్తున్నారు. చదువులో ప్రతిభ చూపే బాలికల్లో సైతం ‘టెన్‌’షన్‌ కనిపిస్తోంది. దీనికి ఈ ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమంలో పరీక్షలు రాయాల్సి ఉండడమే కారణం.

రామభద్రపురం:
కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికల్లో అధికమంది వివిధ కారణాలతో చదువుకు అర్ధంతరంగా దూరమైన వారే. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. వీరిలో విద్యావెలుగులు నింపేం దుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రత్యేకంగా కేజీబీవీలను నెలకొల్పారు. వసతి, భోజన సదుపాయాలతో పాటు ప్రమాణాలతో కూడిన విద్యను బోధించేలా చర్యలు తీసుకున్నారు. తెలుగు మాద్యమంలో తరగతులు నిర్వహించి వారి భవిష్యత్‌కు బాటలు వేశా రు. చాలా మంది బాలికలు పదో తరగతిలో పదికిపది పాయింట్లు సాధించి ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు సాధించారు. అయితే, ఈ ఏడాది అదే విద్యాలయంలో చదువుతు న్న బాలికలు పరీక్షలంటే భయపడుతున్నారు. 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరిగే పదోతరగతి పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో రాసేందుకు కలవరపడుతున్నారు.

పునాది బలం లేక...
కేజీబీవీల్లో 2015–16 నుంచి ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టారు. తొలి ఏడాది 6, 7, 8 తరగతులకు మాత్రమే వర్తింపజేశారు. అప్పటి 8 వతరగతి విద్యార్థులు తాజాగా ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలను ఆంగ్లంలో రాసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 33 కస్తూర్బా గాంధి బాలికల విద్యాలయాల్లో మొత్తం 6,600 మంది చదువుతున్నారు. వీరిలో ఈ ఏడాది 1200 మంది బాలికలు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. అయితే, ఆంగ్లమాధ్యమం మంచిదే అయినా... మూడేళ్ల నుంచి ఆంగ్లం పరిచయం చేయడంతో పునాది బలం కరువైంది. అప్పటివరకు తెలుగు భాషలో పాఠ్యాంశాలు బోధించే టీచర్లు సైతం ఆంగ్లంలో భోదించేందుకు నానా తంటాలు పడుతున్నారు. పదోతరగతి పరీక్షల్లో భావ వ్యక్తీకరణకు ఆంగ్లభాష ప్రతిబంధకంగా మారిందని, భాషపై పట్టులేకపోవడంతో జవాబులు సరిగా రాయలేకపోతున్నామని బాలికలు వాపోతున్నారు.

తెలుగు భాషలో ప్రతిభ చూపే బాలికలు ఆంగ్ల మాధ్యమం సరిగా అర్ధం చేసుకోలేక చదువుపై ఆసక్తి చూపడం లేదు. మళ్లీ మధ్యలో బడులు మానేసి చదువులకు దూరమవుతారేమోనన్న టెన్షన్‌ తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఒకటో తరగతి నుంచి తెలుగు మాధ్యమంలో చదివి మధ్యలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం వల్లే బాలికలు పరీక్షలంటే భయపడుతున్నట్టు విద్యావేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఉత్తీర్ణత శాతం సాధించకపోతే ఇబ్బందులు పడతామేమోనని కేజీబీవీ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, శిక్షణ ఇవ్వాలని, లేని పక్షంలో సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరిగా ఉంచాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement