సాలూరురూరల్ : సాలూరు మండలంలో మలేరియా విజృంభించింది. పలుగ్రామాల్లో ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. మలేరియా కాటుకు శుక్రవారం రాత్రి ఓ చిన్నారి, మహిళ బలయ్యారు. తోణాం పంచాయతీ సిమిడివలస కొత్తూరు గ్రామానికి చెందిన గెమ్మెల సమీర(4), కొత్తవలస పంచాయతీలో గల గదబకరకవలస గ్రామానికి చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు మజ్జి బుచ్చమ్మ(60) అనే మహిళ మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సిమిడివలస గ్రామంలో 20 మంది జ్వరాలతో మంచం పట్టారు. కొర్ర సింహాద్రి, గెమ్మెల చరణ్, గెమ్మెల రాజు,గెమ్మెల కమల, గెమ్మెల నర్సమ్మ,కొర్ర సీతమ్మ, గర్బిణి కొర్ర లక్ష్మి, ఆమె కుమార్తె కొర్ర స్వప్న ఇలా గ్రామంలో ఇంటికి ఒకఇద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో జ్వరాలు ప్రబలినా వైద్య సిబ్బంది గాని, ఆశ వర్కర్లు గాని , ఏఎన్‌ఎంలుగానీ తమ గ్రామానికి రాలేదని గ్రామస్తులు తెలిపారు.
వైద్యం అందకే ...
మృతి చెందిన చిన్నారి సమీర తల్లి మాట్లాడుతూ తన కుమార్తె మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ మృతి చెందిందని భోరున విలపిస్తూ తెలిపింది. తమ గ్రామం నుంచి 20 కిలోమీటర దూరంలో గల మామిడిపిల్లి పీహెచ్‌సీకి వెళ్లలేక, తమ గ్రామంలో వైద్య సేవలందించవలసిన తోణాం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఇక్కడకు రాకపోవడంతో తన పాపకు వైద్యం అందలేదని ఆమె తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం రెండో పాప కడుపులో ఉండగా, మలేరియా జ్వరంతో తన భర్త చనిపోయాడని, ఇప్పుడు పెద్ద కుమార్తెను కూడా జ్వరం పొట్టనపెట్టుకుందని రోదిస్తూ తెలిపింది.
మలేరియాతో మృతి చెందిన బుచ్చమ్మ....మధ్యాహ్న భోజన పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి పనిచేస్తోందని, ఆమె మృతితో కుటుంబం రోడ్డున పడిందని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.వై నాయుడు తెలిపారు. ఆమె కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
వణికిపోతున్న మన్యం
మలేరియా మహామ్మారి విజృంభిస్తుండడంతో మన్యం ప్రజలు వణికిపోతున్నారు. ఏటా వర్షకాలంలో వస్తే చాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బితుకుబితుకుమంటూ గడపవలసి వస్తోంది. ఇప్పటకే జిల్లా 2,115 మందికి పైగా మలేరియాతో బాధపడుతున్నారు. వీరిలో 1900 మంది వ్యాధిగ్రస్తులు గిరిజన ప్రాంతానికి చెందిన వారే. దోమ తెరల పంపిణీ, దోమల నివారణ మందు స్ప్రెయింగ్ తదితర కార్యక్రమాలు వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్నప్పటికి మలేరియాను మాత్రం అదుపుచేయలేకపోతున్నారు.
ఇద్దర్ని మింగేసిన మలేరియా !
Published Sun, Aug 2 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM
Advertisement
Advertisement