పలాసలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి బావిలో దూకేశాడు. అతడిని కాపాడాలని స్థానికులు ప్రయత్నించినా తిరస్కరించి..
పలాసలో బావిలో పడి వ్యక్తి ఆత్మహత్య
అందరూ చూస్తుండగానే అఘాయిత్యం
ఇంకా బావిలోనే మృతదేహం
మృతుడు పురుషోత్తపురంవాసి?
పలాస: పలాసలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి బావిలో దూకేశాడు. అతడిని కాపాడాలని స్థానికులు ప్రయత్నించినా తిరస్కరించి.. మృతువు ఒడికి చేరాడు. వివరాలివీ... పలాస ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న మంచినీళ్ల బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు బావిలో నీళ్లు తోడే బకెట్‌ను అతడికి అందించే ప్రయత్నం చేసినా దాన్ని పట్టుకోలేదు. మృతుడు ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు.
పలాస పురుషోత్తపురం గ్రామానికి చెందిన వ్యక్తి అని కొందరు చెబుతున్నారు. పర్లాకిమిడి నుంచి వలస వచ్చి పలాసలో స్థిరపడ్డాడని, అతనికి ఒక భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని అంటున్నారు. కొంతకాలగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు, జబ్బు తగ్గకపోవడంతో మనస్థాపానికి గురై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చి బావిలో దూకేశాడని చెబుతున్నారు. పలాస అగ్ని మాపక సిబ్బంది అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఫిర్యాదు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. కాశీబుగ్గ పోలీసులు కూడా అక్కడకు వెళ్లారు.
ఇంకా ఫిర్యాదు రాలేదని కాశీబుగ్గ ఎస్‌ఐ కె.వి సురేష్ చెప్పారు. బావిలో నీరు ఎక్కువగా ఉందని, కిందిభాగంలో బురద ఉందని చెప్పారు. మృత దేహంపైకి తేలలేదని అందు వల్లే దాన్ని తీయలే కపోయామన్నారు. గురువారం బావిలో నుంచి మృత దేహాన్ని తీసిన తర్వాతనే ఆ వ్యక్తి ఎవరన్నది తెలుస్తుందన్నారు. ఈ సంఘటన తెలియడంతో పలాస ప్రజలంతా పెద్ద ఎత్తున బావి వద్దకు వెళ్లి చూశారు.