
సాక్షి, విజయవాడ : నగరంలోని సింగ్‌నగర్ వాంబే కాలనీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. కాలనీలోని బ్లాక్‌లో నివసిస్తున్న అప్పారావు అనే వ్యక్తి భార్యతో గొడవపడి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. మృతుడు అప్పారావు సింగ్‌నగర్ కాలనీలో వ్యాపారం చేస్తుండగా, గత కొంత కాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి సమయంలో భార్యతో మరోసారి గొడవపడిన అప్పారావు, పథకం ప్రకారం బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ని భార్యపై పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. భార్య కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి అప్పారావుని తీవ్రస్థాయిలో మందలించారు. ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత తెల్లవారుజామున అప్పారావు తాను ఉండే ప్లాటులోనే మిగిలిన పెట్రోల్ తనమీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకొని చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పగా, అప్పటికే కాలిన గాయాలతో అప్పారావు మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న గ్రామీణ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment