మరియమ్మకు విరాళాలు అందించిన ఆర్టీసీ డీఎం సీతారామస్వామినాయుడు, సిబ్బంది, ప్రయాణికులు ఆర్టీసీ డీఎం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో మృతదేహంతో గుంటూరు ప్రయాణమైన మరియమ్మ
రామచంద్రపురం: ఎవరో ఏమిటో తెలియదు.. కానీ రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తుది శ్వాస విడిచాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది చలించిపోయారు. వివరాల్లోకి వెళితే రామచంద్రపురం ఆర్టీసీ బస్ డిపోలో ఒక వ్యక్తి అనారోగ్యంతో తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. ఇది గమనించిన తపాలా శాఖకు చెందిన ఆర్.శ్రీనివాస్, వాసు 108కి ఫోన్ చేశారు. హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది అతనిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీనితో మృతి చెందిన వ్యక్తికి తోడుగా వచ్చిన అత్తగారు బోరున విలపించింది. తమది గుంటూరని, తన అల్లుడు నేలటూరి శ్రీను(45) కొంతకాలంగా పచ్చకామెర్లతో బాధపడుతున్నాడని, వెల్ల కామెర్ల మందు కోసం వచ్చిన తాము మందు తీసుకుని తిరుగు ప్రయాణం నిమిత్తం ఇక్కడకు చేరుకున్నట్లు తెలిపింది.
ఇది విన్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల్లో మానవత్వం మేలుకొంది. ఆర్టీసీ డీఎం సీతారామస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్‌వీ రమణ, ఆర్టీసీ సిబ్బంది, కాంప్లెక్స్‌లో ఉన్న ఇతర ప్రయాణికులు ఎలాగైనా మృతదేహాన్ని గుంటూరు కుటుంబం చెంతకు చేర్చాలని తలచారు. దీనితో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛందంగా సుమారు రూ. 11 వేలు విరాళాలు అందజేశారు. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది అందజేసిన సొమ్మును మృతుడు శ్రీను అత్తగారు అంకాల మరయమ్మకు డీఎం సీతారామస్వామినాయుడు చేతుల మీదుగా అందజేసి, అంబులెన్స్‌లో మృతదేహం గుంటూరుకు చేరేవిధంగా ఏర్పాటు చేశారు. మరియమ్మ వారి మానవత్వానికి చేతులెత్తి నమస్కరించి తన అల్లుడి మృతదేహంతో గుంటూరుకు ప్రయాణమైంది. ఇది చూసినవారి గుండెలు బరువెక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment