తాను కనిపెట్టిన ఆటో మేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం పనితీరు వివరిస్తున్న రహీం
మనం ప్రతి రోజూ పేపర్లు, టీవీల్లో రోడ్డు ప్రమాదాల వార్తలు చూసి అయ్యో పాపం అనుకుని సాయంత్రానికి మర్చిపోతాం. కానీ అతను మాత్రం అలా ఊరుకోలేదు. రోడ్డు ప్రమాదాల నివారణ అనే అంశంపై ఆలోచన చేశాడు. రాష్ట్రంలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు సరైన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ లేక పోవడం వల్లనే అని గుర్తించాడు. అంతే తనకున్న పరిజ్ఞానంతో నెలలు కష్టపడి ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అనే అధునాతన వ్యవస్థను రూపొందించాడు. అంతేకాదు అంతకుముందు ఇలాంటివి ఎన్నో నూతన ఆవిష్కరణలు చేశాడు. అతనే చింతలపూడికి చెందిన ఎండీ అబ్దుల్ రహీం.
సాక్షి, పశ్చిమగోదావరి : వస్తువులతో ప్రయోగాలు చేయడం రహీంకి ఇష్టం. ఆ ఇష్టమే ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమా పూర్తి చేయించింది. ఖాళీ సమయాల్లో తన ప్రతిభకు పదును పెట్టి వినూత్న రీతిలో ప్రయోగాలు చేస్తున్నాడు. ఆధునిక పద్ధతుల్లో పని చేసే సిగ్నల్ లైట్ల ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ అతను రూపొందించిన ప్రాజెక్టు ప్రస్తుతం ఆలోచింపజేస్తోంది. ఈ ట్రాఫిక్ వ్యవస్థలో అత్యవసర సర్వీసు వాహనాలైన అంబులెన్స్, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేయవచ్చు. ముందుగానే ఫీడ్ చేసి ఉండటం వల్ల అత్యవసర సర్వీసు వాహనాలు వచ్చినపుడు సిగ్నల్ లైట్లు, సైరన్ ఎలర్ట్, వాయిస్ అనౌన్స్‌మెంట్ ద్వార అంతరాయాలను నివారించవచ్చు. అలాగే మెయిన్ సెంటర్లో అమర్చిన ట్రాఫిక్ జామ్ డిటెక్టర్ సెన్సార్ యూనిట్ నిత్యం వాహనాల కదలికలను గమనిస్తుంది. అవసరమైనప్పుడు సైరన్ అలర్ట్ చేయడమే కాకుండా వాయిస్ అనౌన్స్‌మెంట్ ద్వారా వాహనాల యజమానులను హెచ్చరిస్తుంది.
అలాగే ఇందులో హై జూమ్డ్ కెమేరా యూనిట్ ఉంది. ఇది కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై ఉంటుంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వాహనాల ఇమేజ్‌లను సంకేతాల ద్వారా కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. ఇది ప్రధాన కూడలి నుంచి నాలుగు దిక్కులా పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు దోహద పడుతుంది. మనుష్యుల ప్రమేయం లేకుండా ఈ సిస్టం పని చేయడం విశేషం. ప్రభుత్వం తన ప్రయోగాలను గుర్తించి చేయూతనిస్తే సమాజానికి ఉపయోగపడే పరికరాలు మరిన్ని తయారు చేస్తానని రహీం తెలిపారు. గతంలో తాను భూకంపాన్ని ముందుగానే గుర్తించే పరికరాన్ని, అలాగే దొంగతనాలను పసిగట్టి తెలియ చేసే సెక్యూరిటీ అలారం, రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు ఆటో మేటిక్ సెన్సార్ లాకింగ్ సిస్టమ్ తయారు చేశానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment