automative technology
-
Huwaie Driverless Car: హువాయ్ విప్లవాత్మక ప్రకటన
షెంజెన్: ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ హువాయ్ విప్లవాత్మక ప్రకటన చేసింది. వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఆపకుండా.. డ్రైవర్ లెస్ కార్ల టెక్నాలజీకి శరవేగంగా పావులు కదుపుతోంది. 2025 నాటికల్లా డ్రైవర్‌లెస్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, చైనీస్ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయ్ టెక్నాలజీస్ ఆటోమోటివ్ స్పేస్‌లో అడుగుపెట్టబోతున్నట్లు కొంతకాలంగా మీడియాకు హింట్ అందుతూనే వస్తోంది. అయితే ఏకంగా డ్రైవర్‌లెస్ కార్లను తయారు చేస్తామనే ప్రకటనతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చోంగ్క్వింగ్ ఛాంగన్ ఆటోమొబైల్ కో లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్ వెహికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రెండు కంపెనీలతో హువాయ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీగా పేరున్న హువాయ్.. స్మార్ట్ఫోన్ల అమ్మకం ద్వారా హవా చాటేది. అయితే ట్రంప్ హయాంలో ఆంక్షలు, ప్రత్యేకించి హువాయ్‌తో అమెరికా వర్తకానికి పెనుముప్పు ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో హువాయ్ దూకుడు మొదలుపెట్టింది. ఇక హువాయ్‌తో పాటు జియోమి, ఒప్పో కూడా వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు యాపిల్ కూడా ఈ రంగం తీరుతెన్నులపై ఒక అంచనాకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: స్మార్ట్ వాచ్.. 54 శాతం భారీ తగ్గింపు -
ఈ 'రూటే' సపరేటు!
మనం ప్రతి రోజూ పేపర్లు, టీవీల్లో రోడ్డు ప్రమాదాల వార్తలు చూసి అయ్యో పాపం అనుకుని సాయంత్రానికి మర్చిపోతాం. కానీ అతను మాత్రం అలా ఊరుకోలేదు. రోడ్డు ప్రమాదాల నివారణ అనే అంశంపై ఆలోచన చేశాడు. రాష్ట్రంలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు సరైన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ లేక పోవడం వల్లనే అని గుర్తించాడు. అంతే తనకున్న పరిజ్ఞానంతో నెలలు కష్టపడి ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అనే అధునాతన వ్యవస్థను రూపొందించాడు. అంతేకాదు అంతకుముందు ఇలాంటివి ఎన్నో నూతన ఆవిష్కరణలు చేశాడు. అతనే చింతలపూడికి చెందిన ఎండీ అబ్దుల్ రహీం. సాక్షి, పశ్చిమగోదావరి : వస్తువులతో ప్రయోగాలు చేయడం రహీంకి ఇష్టం. ఆ ఇష్టమే ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమా పూర్తి చేయించింది. ఖాళీ సమయాల్లో తన ప్రతిభకు పదును పెట్టి వినూత్న రీతిలో ప్రయోగాలు చేస్తున్నాడు. ఆధునిక పద్ధతుల్లో పని చేసే సిగ్నల్ లైట్ల ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ అతను రూపొందించిన ప్రాజెక్టు ప్రస్తుతం ఆలోచింపజేస్తోంది. ఈ ట్రాఫిక్ వ్యవస్థలో అత్యవసర సర్వీసు వాహనాలైన అంబులెన్స్, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేయవచ్చు. ముందుగానే ఫీడ్ చేసి ఉండటం వల్ల అత్యవసర సర్వీసు వాహనాలు వచ్చినపుడు సిగ్నల్ లైట్లు, సైరన్ ఎలర్ట్, వాయిస్ అనౌన్స్మెంట్ ద్వార అంతరాయాలను నివారించవచ్చు. అలాగే మెయిన్ సెంటర్లో అమర్చిన ట్రాఫిక్ జామ్ డిటెక్టర్ సెన్సార్ యూనిట్ నిత్యం వాహనాల కదలికలను గమనిస్తుంది. అవసరమైనప్పుడు సైరన్ అలర్ట్ చేయడమే కాకుండా వాయిస్ అనౌన్స్మెంట్ ద్వారా వాహనాల యజమానులను హెచ్చరిస్తుంది. అలాగే ఇందులో హై జూమ్డ్ కెమేరా యూనిట్ ఉంది. ఇది కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై ఉంటుంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వాహనాల ఇమేజ్‌లను సంకేతాల ద్వారా కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. ఇది ప్రధాన కూడలి నుంచి నాలుగు దిక్కులా పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు దోహద పడుతుంది. మనుష్యుల ప్రమేయం లేకుండా ఈ సిస్టం పని చేయడం విశేషం. ప్రభుత్వం తన ప్రయోగాలను గుర్తించి చేయూతనిస్తే సమాజానికి ఉపయోగపడే పరికరాలు మరిన్ని తయారు చేస్తానని రహీం తెలిపారు. గతంలో తాను భూకంపాన్ని ముందుగానే గుర్తించే పరికరాన్ని, అలాగే దొంగతనాలను పసిగట్టి తెలియ చేసే సెక్యూరిటీ అలారం, రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు ఆటో మేటిక్ సెన్సార్ లాకింగ్ సిస్టమ్ తయారు చేశానని తెలిపారు. -
దొనకొండలో స్పెయిన్ ప్రతినిధుల పర్యటన
► ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ ఏర్పాటుకు స్థల పరిశీలన దొనకొండ (దర్శి): దొనకొండ ప్రాంతంలో స్పెయిన్ దేశ ప్రతినిధుల బృందం గురువారం పర్యటించింది. ఏపీఐఐసీ దొనకొండను పారిశ్రామిక ప్రాంతంగా ప్రకటించడంతో ఇడియాడ ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్పెయిన్ ప్రతినిధులు మన్దీప్ టాక్, లూయీస్ అయించిల్ బృందం, సచివాలయం ఓఎస్డీ సాగర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి స్థలాలను పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో భూములను సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం ఇండ్లచెరువు, పోచమక్కపల్లి, పి.వెంకటాపురం, రుద్రసముద్రం, భూమనపల్లి, రాగమక్కపల్లి పొలాలను చూశారు. రుద్రసముద్రం, భూమనపల్లి, రాగమక్కపల్లి ప్రాంతంలోని 262,292–305 సర్వే నంబర్లలో 1105 ఎకరాలను, ఇండ్లచెరువు, పోచమక్కపల్లి, పి.వెంకటాపురంలో 325–346లో 1400 ఎకరాలు పరిశీలించారు. వాహనాల విడి భాగాలు జతపరిచినప్పుడు వాటిని పరీక్షించడం, క్రాష్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, సేఫ్టీ టెస్ట్‌లు ఈ కంపెనిలో నిర్వహిస్తారన్నారు. దీనికి సంబంధించి సుమారు 2500 ఎకరాలు భూమి అవసరం ఉందన్నారు. ప్రపంచంలో స్పెయిన్, చైనాలో ఈ కంపెనీ కొనసాగుతుందన్నారు. ఆర్కిటెక్ట్ డిజైనర్లు నిఖిల్, వీరేంద్ర, ఆంటోనియో, ప్రాజెక్ట్ ఇంజినీర్ కుమార్, హబ్ లైజనింగ్ అధికారి సి.హెచ్.ఆశీర్వాదం, ఆర్ఐ రాజేష్, లైసెన్స్ సర్వేయర్ వెంకట్రావు పాల్గొన్నారు.