ఏమారితే ప్రమాదమే !
ప్రధాన పట్టణాల్లో చాలా చోట్ల మూతలు లేని మ్యాన్‌హోల్స్
పొంగిపొర్లుతున్న డ్రైన్లు
గేట్లు లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద {పయాణికుల పాట్లు
{పమాద కేంద్రాలను పట్టించుకోని పాలకులు, అధికారులు
జిల్లా వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో కప్పుల్లేని మ్యాన్‌హోల్స్ .. మూతల్లేని డ్రయినేజీ కాలువలు ప్రమాదాలకు నిలయాలుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలక్ష్యం కారణంగా ప్రయాణికులు కాస్త ఏమారితే అవస్థలు పడాల్సి వస్తోంది. నోళ్లు తెరుచుకున్న కాలువలు, రహదారుల పక్కనున్న బావులు పాదచారులు, వాహనదారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. కాపలాదారులు, గేట్లు లేని రైల్వే క్రాసింగ్‌లు ప్రమాద కేంద్రాలుగా ఉన్నా పట్టించుకునేవారు లేరు.
తిరుపతి: జిల్లాలో మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె తదితర ప్రధాన ప్రాంతాల్లో సైతం నోర్లు తెరుచుకుని మనుషులను మింగేస్తున్నాయి. వీటిలో విద్యార్థులు, స్థానికులు పడి ప్రమాదాలకు గురవుతున్నా కార్పొరేషన్, మున్సిపాలిటీ అధికారులు తమకు పట్టనట్లు వ్యవ హరిస్తున్నారు. వర్షం పడితే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మోకాలు లోతుకు పైగా నీళ్లలో రోడ్లపైన నడవాల్సిన దుస్థితి నెలకొంది. రో డ్లు సెలయేర్లను తలపిస్తున్నాయి. కాలనీ లు చెరువులుగా మారుతున్నాయి. ప్రధానకారణం కాలువలు, మ్యాన్ హోల్స్ పూడిపోవడమే. మురుగు నీరు రోడ్లవైనే ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు పలుచోట్ల అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారి, ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న ప్రధాన మార్గాల్లో పెద్ద కాలువలపైన శ్లాబ్ వేసి వాటిని పాదచారులకు ఫుట్‌పాత్‌లుగా అందుబాటులోకి తెచ్చారు.
కొన్ని చోట్ల పనులు నాసిరకంగా చేయడమేగాక బిల్లులు అందలేదనే సాకుతో కొందరు కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలివేశారు. అవే పాదచారుల పాలిట శాపంగా మారుతున్నాయి. తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ నుంచి పాస్‌పోర్ట్ కార్యాలయం మీదుగా లక్ష్మీపురం సర్కిల్ వరకు, రామానుజ సర్కిల్ నుంచి పద్మావతీ కల్యాణ మండపాల వరకు నిర్మించిన పెద్ద కాలువలే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో కొద్ది వర్షానికే పల్లపు ప్రాంతంలోని కాలనీలు మునుగుతున్నాయి.
చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో జిల్లా కలెక్టర్, కమిషనర్ నిత్యం ప్రయాణించే ప్రధాన మార్గంలో మ్యాన్ హోల్స్ తెరుచుకునే ఉన్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇప్పటికే వీటిలో పడి పలువురికి గాయాలయ్యాయి. కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. నగరమంతా ఓపెన్ డ్రైన్లు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే ఇళ్ల మధ్యలోకి మురుగు నీరు చేరుతోంది.
మదనపల్లెలో పరిస్థితి అధ్వానంగా ఉంది. టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి పలువురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. స్థానికులే వాటిపై కంపచెట్లను వేసి కప్పి వేయడం గమనార్హం. ఆర్టీసీ బస్టాండుతో పాటు పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ తెరుచుకునే ఉన్నాయి. పలమనేరు బస్టాండు సమీపంలో రోడ్డు పక్కనే కాలువ ప్రమాదకరంగా ఉంది. అక్కడ ఇటీవలే ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. అయినా మున్సిపాలిటీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. సీఎం సొంత ఇలాకా కుప్పంలో సైతం ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, ప్యాలెస్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ తెరుచుకుని ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
రైల్వే గేట్ల వద్ద ప్రజలకు తిప్పలే..
జిల్లాలో రేణిగుంట అవుటర్ నుంచి పాకాల వరకు 25 గేట్లు ఉన్నాయి. ఇందులో పాకాల సమీపంలోని బాలినేనిపల్లె, గుడిపల్లె, మొరవవల్లె ప్రాంతాల్లో కాపలాదారులు లేని గేట్లు ఉన్నాయి. గేట్లు ఉన్న ప్రాంతాలు తిరుపతి నగరంలోని ఆర్‌సీ రోడ్డు, తుమ్మల గుంట సమీపంలోని చిత్తూరు జాతీయ రహదారి, చదలవాడ కాలేజీ, పద్మావతి డిగ్రీ కాలేజీ ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె ప్రాంతంలోని సీటీఎం, కాశీరావుపేట ప్రాంతాల్లో కాపలాలేని రైల్వేగేట్లు ఉన్నాయి.