డెంకాడ(నెల్లిమర్ల): ఆ కుమార్తె అంటే ఆయనకు పంచ ప్రాణం. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆమె ఆటపాటలు చూసి మురిసిపోయాడు. ఆమెకు అనారోగ్యం అయితే తానే దగ్గరుండి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాడు. నిరంతరం ఆమే జీవితం అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను ఆరోగ్యవంతురాలిని చేయాలనుకున్నా డు. కానీ విధి వక్రీకరించింది. ఆ చిన్నారి వాంతులు, విరేచనాలతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. తన ముద్దుల కూతురు చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు... స్నేహితులకు ఫోన్‌లో చెప్పి బోరున ఏడ్చాడు. ఇంక తాను బతకడం వృథా అని... ఆమె వద్దకే వెళ్లిపోతున్నాననీ, ఎవరూ బాధపడవద్దని చెప్పాడు. అనుకున్నట్టుగానే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన డెంకాడ మండలం మోదవలసలో సంచలనం సృష్టించింది.
ప్రేమ వివాహం చేసుకుని...
తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కానూరి సత్యశ్రీధర్(33) డెంకాడ మండలంలోని మోదవలస గ్రామానికి చెందిన సుజాతను పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఉదయశ్రీ, గౌతమిశ్రీ(7) అనే ఇద్దరు కుమార్తెలు. వీరు కొంత కాలం విశాఖలో ఉండేవారు. మూడేళ్ల క్రితమే మోదవలసకు వచ్చేసి, చిన్నచిన్న సివిల్ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూæ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సత్యశ్రీధర్ పనినిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వెళ్లారు. శనివారం ఉదయం చిన్నకుమార్తె గౌతమిశ్రీ మరణించిందన్న విషయం కుటుంబ సభ్యులద్వారా తెలుసుకున్నారు. హుటాహుటిన బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు.
చిన్న కూతురిపై వల్లమాలిన అభిమానం
గౌతమిశ్రీ అంటే సత్యశ్రీధర్‌కు విపరీతమైన అభిమానం. ఆమె మరణం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. మండపేటలో ఉంటున్న తన కుటుంబ సభ్యులకు కుమార్తె మరణ సమాచారాన్ని అందించారు. తన స్నేహితుడికి ఫోన్ చేసి తన ముద్దుల కుమార్తె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందనీ, ఆమెతోనే నేనూ వెళ్లిపోతాను బాధపడవద్దు అంటూ బాధపడుతూ చెప్పాడు. మార్గ మధ్యలో విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట వద్ద జాతీయ రహదారి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీధర్ ఫోన్లో చెప్పిన చివరి మాటలతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు, స్నేహితులు సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా నెట్‌వర్క్ సెర్చ్ చేస్తూ ఒడ్డిమెట్ట సమీపంలో సిగ్నల్ చూపించడంతో అక్కడకు చేరుకుని వెతికారు. జాతీయరహదారి సమీపంలో శ్రీధర్ పురుగుల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించారు. విషయం స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సింహాచలం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి రాకకోసం ఎదురుచూసి...
ఎంతో గారాబంగా చూసుకుంటున్న కుమార్తె గౌతమిశ్రీ మృతదేహం వద్దకు ఆందోళనతో, ఆవేదనతో సత్యశ్రీధర్ వస్తాడని మోదవలసలో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు సమయం దాటినా రాకపోవడంతో ఆందోళన మొదలైంది. తీరా చూస్తే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీధర్ చనిపోయాడంటూ పిడుగులాంటి వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఒకపక్క చిన్నారి మృతదేహం... మరో పక్క కుటుంబ పెద్ద మృతి చెందాడన్న వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు గొల్లుమన్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. ఈ సంఘటనతో గౌతమిశ్రీ అంత్యక్రియలూ నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment