పకడ్బందీగా ఉప ఎన్నిక నిర్వహించండి
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
చిలకలపూడి (మచిలీపట్నం) : నందిగామ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన గురువారం సాయంత్రం కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారం ముగిసిన అనంతరం ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పోలింగ్ ప్రక్రియలో ప్రతి ఓటరు సంతకంతో పాటు వేలిముద్రను సేకరించాలని చెప్పారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు ఓటర్ స్లిప్‌లు 88శాతం పంపిణీ చేశారని, మిగిలిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాలోని అన్ని మద్యం షాపులను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించాలని చెప్పారు. అలాగే నియోజకవర్గ సరిహద్దు జిల్లాల్లో కూడా మద్యం షాపులు తెరవకూడదన్నారు.
పోలింగ్, ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ఎక్కువశాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జి.విజయకుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.