ఉందిలే మంచికాలం.. | Mancikalam is .. | Sakshi
Sakshi News home page

ఉందిలే మంచికాలం..

Published Thu, Nov 27 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

ఉందిలే మంచికాలం..

ఉందిలే మంచికాలం..

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా ముఖచిత్రం మారిపోతోంది. పారిశ్రామిక కేంద్రంగా జిల్లా ఆవిర్భవించనుంది. 33వేలకు పైగా ఎకరాల్లో మెగా పారిశ్రామిక హబ్ ఏర్పాటు కానుంది. ఏకంగా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తరలివస్తాయని అంచనా. భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు, మిడుతూరు, గడివేముల మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధమయింది.

హబ్‌లో రీజనల్ ఇండస్ట్రీయల్ మానుఫ్యాక్చరింగ్ జోన్(రిమ్జ్)తో పాటు విమానాశ్రయం, సోలార్, పవన విద్యుత్ పార్కులు, డీఆర్‌డీవో పరిశోధన ల్యాబ్, టౌన్‌షిప్, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, మార్కెట్ యార్డు, విత్తన శుద్ధి కేంద్రం తదితరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఇన్ఫాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్(ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంస్థ ప్రభుత్వానికి ఒక డీపీఆర్‌ను సమర్పించింది. ఇందుకు ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసింది.

 నాలుగు బ్లాకులుగా విభజన
 మెగా పారిశ్రామిక హబ్‌ను నాలుగు బ్లాక్‌లుగా విభజించారు. ఒక్కో బ్లాకులో ఒక్కో తరహా సంస్థలను నెలకొల్పాలని ప్రణాళిక రూపొందించారు.

మొదటి బ్లాక్‌లో రిమ్జ్‌తో పాటు విమానాశ్రయం ఏర్పాటు.

రెండో బ్లాకులో బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు, ప్లాస్టిక్ పార్కు తదితరాలు.

మూడో బ్లాక్‌లో టౌన్‌షిప్, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, 500 మెగావాట్ల సోలార్, 500 మెగావాట్ల పవన్ విద్యుత్ కేంద్రాలు.

నాలుగో బ్లాక్‌లో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు విత్తనశుద్ధి కేంద్రం.

 అన్ని మౌలిక సదుపాయాల కల్పన
 హబ్‌కు 33,567 ఎకరాల భూమి అవసరం కాగా... ఇందులో 29,394 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మరో 4,173 ఎకరాలు... పట్టా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ మొత్తం హబ్ ఏర్పాటయ్యే విస్తీర్ణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏకంగా రూ.1250 కోట్లు అవసరమని అంచనా వేశారు.
 
 పారిశ్రామిక పార్కు ముఖచిత్రం
 
 సంస్థలు                        విస్తీర్ణం(ఎకరాల్లో)
 రిమ్జ్                                 9,340
 టౌన్‌షిప్                             8200
 విమానాశ్రయం                    2700
 లాజిస్టిక్ హబ్                       175
 ఎన్‌ఎఫ్‌సీ                          2200        
డీఆర్‌డీవో                          2000    
 బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు    1700
 వ్యవసాయ మార్కెట్ యార్డు              150
 విత్తనశుద్ధి కర్మాగారం                  150
 మెగా ఫుడ్ పార్కు                  100
 రైస్ హబ్                            380
 సోలార్ పవర్ పార్కు                2500
 పవన విద్యుత్ కేంద్రం                  300
 ప్లాస్టిక్ పార్కు                      668
 ఈహెచ్‌ఎం క్లస్టరు                  500
 సాంకేతిక మౌలిక సదుపాయాలు        1300
 ఆర్టిరియల్ రోడ్లు                    1200
 మొత్తం                        33,567

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement