ఏ పరిశ్రమ ఏర్పాటు కావాలన్నా అనుకూల వాతావరణంతోపాటు రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. ఇవన్నీ పుష్కలంగా ఉన్నచోట పరిశ్రమల ఏర్పాటుకు ఢోకా ఉండదు. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా దొరుకుతాయి. పై అంశాలన్నీ సమృద్ధిగా ఉన్న జిల్లాలోని మనుబోలు మండలంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది.
మనుబోలు: గత కొన్నేళ్లుగా మనుబోలు మండలంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. దీంతో స్థానికంగా ఉండే వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మండల పరిధిలో 10 కిలోమీటర్లకు పైగా విస్తరించిన జాతీయ రహదారి, 15 కిలోమీటర్ల దూరంలో కృష్టపట్నం పోర్టు, స్థానికంగా రైల్వేస్టేషన్, 140 కిలోమీటర్ల దూరంలో చైన్నె మహానగరం ఉన్నాయి. దీంతో రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా రవాణా సౌకర్యాలకు అనువుగా ఉండడంతో పలు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో బయట నుంచి వచ్చి చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పే వారిని మనుబోలు మండలం విశేషంగా ఆకర్షిస్తోంది.
70 శాతానికి పైగా స్థానికులే..
మనుబోలు మండల పరిధిలో పల్లవ గ్రానైట్ ఫ్యాక్టరీ, 765 కేవీ, 400 కేవీ పవర్ గ్రిడ్స్, ట్రాన్స్‌కో 400 కేవీ సబ్ స్టేషన్, జీడిపప్పు ఫ్యాక్టరీ, ఎస్‌వీఎస్ మినరల్స్, అట్టపెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీ, మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ ఉన్నాయి. అలాగే హైవేకు ఇరువైపులా 5 పెట్రోల్ బంకులు, 4 దాబా హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. పవర్ గ్రిడ్ మినహా మిగిలిన పరిశ్రమల్లో 70 శాతానికి పైగా స్థానికులే పనిచేస్తున్నారు. వీటితోపాటు త్వరలో శ్రీచక్ర ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద పాలిస్టర్ పరిశ్రమ, ఎ టూ బి రెస్టారెంట్స్, ఎలక్ట్రిక్ కార్ చార్జింగ్ సెంటర్, స్టార్ బగ్స్‌లతోపాటు మరికొన్ని ఫ్రాంచైజీలు మండలంలో ఏర్పాటు కానున్నాయి. తద్వారా వందలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.
అన్నివిధాలా అనుకూలం
మూడేళ్ల క్రితం మనుబోలు మండలంలోని అక్కంపేట సమీపంలో రోడ్డు పక్కన అకాజు ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించాం. ముడి జీడి గింజలను దక్షణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటాం. హైవేకు దగ్గరగా ఉండడంతోపాటు కృష్ణపట్నం పోర్టు, చైన్నె పోర్ట్‌లకు కూడా రవాణా సౌకర్యం సులభతరంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. మా పరిశ్రమలో ప్రస్తుతం 60 మంది పనిచేస్తున్నారు. అందరూ స్థానికులే. భవిష్యత్‌లో యూనిట్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నాం.
– ఆర్.శివాజీ, మేనేజింగ్ పార్టనర్, అకాజు ప్రాసెసింగ్ (ప్ర) లిమిటెడ్
మా కళ్ల ముందే ఎంతో మారిపోయింది
మనుబోలు మండలం ఇటీవల కాలంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో వ్యవసాయ భూముల ధరలు కూడా బాగా పెరిగాయి. ఇతర దేశాలు, రాష్టాల నుంచి ముడి సరుకులు దిగుమతి చేసుకోవాలన్నా, ఇక్కడ తయారైన ఉత్పత్తులను వాటిని ఎగుమతి చేయాలన్నా రవాణా సౌకర్యం ఎంతో ముఖ్యం. మనుబోలుకు హైవే, కృష్ణపట్నం, చైన్నై పోర్టులు, రైల్వేస్టేషన్ అనుకూలంగా ఉండడంతో పరిశ్రమలు అధికంగా ఏర్పాటవుతున్నాయి.
– వెందోటి భాస్కర్‌రెడ్డి, రైతు,జట్ల కొండూరు
అనుకూల వాతావరణం
మనుబోలు మండలంలో అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉండడంతోనే పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయని తెలుస్తోంది. రవాణా సౌకర్యాలతోపాటు పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, స్థానిక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహాయ సహకారాలు ఉండడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతోమంది ముందుకొస్తున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment