Industrial center
-
మహిళలకు భారీగా కాంట్రాక్టు ఉద్యోగాలు
ముంబై: మహిళలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా కాంట్రాక్టు పనులు మెట్రోల్లో, పారిశ్రామిక కేంద్రాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయని.. భవిష్యత్తులో టైర్ 2, 3 పట్టణాల్లో విస్తరణకు అపార అవకాశాలున్నాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 28.7 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు 14.2 శాతం, కర్ణాటక 14.1 శాతం మేర అవకాశాలను అందిస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలో 7.8 శాతం, గుజరాత్లో 7.2 శాతం, యూపీలో 6.6 శాతం చొప్పున మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాలు లభిస్తున్నట్టు వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరింత మందికి ఈ అవకాశాల కల్పనకు గణనీయమైన అవకాశాలున్నట్టు గుర్తు చేసింది. టీమ్‌లీజ్ సర్వీసెస్ తన అంతర్గత డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. రిటైల్‌లోనే ఎక్కువ మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 29.8 శాతం ఒక్క రిటైల్ రంగమే కల్పిస్తోందని టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగంలో 20.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో 18.9 శాతం చొప్పున ఉద్యోగాలు లభిస్తున్నట్టు తెలిపింది. తయారీలో 10.8 శాతం, విద్యుత్, ఇంధన రంగంలో 5 శాతం, టెలికంలో 4 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఉన్నట్టు పేర్కొంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌తో కూడిన స్టెమ్ విద్యలో ఎక్కువ మంది మహిళలు చేరడం అన్నది ఐటీ, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మరింత మందికి అవకాశాలను చేరువ చేస్తుందని తెలిపింది. కాంట్రాక్టు మహిళా ఉద్యోగుల్లో 62.2 శాతం మంది వయసు 18–27 ఏళ్ల మధ్యలో ఉంటే.. 29.4 శాతం మంది 28–37 ఏళ్ల వయసులో ఉండడం అన్నది యువ ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. 38–47 ఏళ్ల వయసులోని మహిళలు 6.6 శాతం, 48 ఏళ్లకుపైన వయసున్న మహిళలు 1.9 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
పారిశ్రామిక ప్రగతి పరుగులు
ఏ పరిశ్రమ ఏర్పాటు కావాలన్నా అనుకూల వాతావరణంతోపాటు రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. ఇవన్నీ పుష్కలంగా ఉన్నచోట పరిశ్రమల ఏర్పాటుకు ఢోకా ఉండదు. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా దొరుకుతాయి. పై అంశాలన్నీ సమృద్ధిగా ఉన్న జిల్లాలోని మనుబోలు మండలంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. మనుబోలు: గత కొన్నేళ్లుగా మనుబోలు మండలంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. దీంతో స్థానికంగా ఉండే వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మండల పరిధిలో 10 కిలోమీటర్లకు పైగా విస్తరించిన జాతీయ రహదారి, 15 కిలోమీటర్ల దూరంలో కృష్టపట్నం పోర్టు, స్థానికంగా రైల్వేస్టేషన్, 140 కిలోమీటర్ల దూరంలో చైన్నె మహానగరం ఉన్నాయి. దీంతో రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా రవాణా సౌకర్యాలకు అనువుగా ఉండడంతో పలు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో బయట నుంచి వచ్చి చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పే వారిని మనుబోలు మండలం విశేషంగా ఆకర్షిస్తోంది. 70 శాతానికి పైగా స్థానికులే.. మనుబోలు మండల పరిధిలో పల్లవ గ్రానైట్ ఫ్యాక్టరీ, 765 కేవీ, 400 కేవీ పవర్ గ్రిడ్స్, ట్రాన్స్‌కో 400 కేవీ సబ్ స్టేషన్, జీడిపప్పు ఫ్యాక్టరీ, ఎస్వీఎస్ మినరల్స్, అట్టపెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీ, మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ ఉన్నాయి. అలాగే హైవేకు ఇరువైపులా 5 పెట్రోల్ బంకులు, 4 దాబా హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. పవర్ గ్రిడ్ మినహా మిగిలిన పరిశ్రమల్లో 70 శాతానికి పైగా స్థానికులే పనిచేస్తున్నారు. వీటితోపాటు త్వరలో శ్రీచక్ర ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద పాలిస్టర్ పరిశ్రమ, ఎ టూ బి రెస్టారెంట్స్, ఎలక్ట్రిక్ కార్ చార్జింగ్ సెంటర్, స్టార్ బగ్స్లతోపాటు మరికొన్ని ఫ్రాంచైజీలు మండలంలో ఏర్పాటు కానున్నాయి. తద్వారా వందలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. అన్నివిధాలా అనుకూలం మూడేళ్ల క్రితం మనుబోలు మండలంలోని అక్కంపేట సమీపంలో రోడ్డు పక్కన అకాజు ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించాం. ముడి జీడి గింజలను దక్షణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటాం. హైవేకు దగ్గరగా ఉండడంతోపాటు కృష్ణపట్నం పోర్టు, చైన్నె పోర్ట్‌లకు కూడా రవాణా సౌకర్యం సులభతరంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. మా పరిశ్రమలో ప్రస్తుతం 60 మంది పనిచేస్తున్నారు. అందరూ స్థానికులే. భవిష్యత్‌లో యూనిట్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నాం. – ఆర్.శివాజీ, మేనేజింగ్ పార్టనర్, అకాజు ప్రాసెసింగ్ (ప్ర) లిమిటెడ్ మా కళ్ల ముందే ఎంతో మారిపోయింది మనుబోలు మండలం ఇటీవల కాలంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో వ్యవసాయ భూముల ధరలు కూడా బాగా పెరిగాయి. ఇతర దేశాలు, రాష్టాల నుంచి ముడి సరుకులు దిగుమతి చేసుకోవాలన్నా, ఇక్కడ తయారైన ఉత్పత్తులను వాటిని ఎగుమతి చేయాలన్నా రవాణా సౌకర్యం ఎంతో ముఖ్యం. మనుబోలుకు హైవే, కృష్ణపట్నం, చైన్నై పోర్టులు, రైల్వేస్టేషన్ అనుకూలంగా ఉండడంతో పరిశ్రమలు అధికంగా ఏర్పాటవుతున్నాయి. – వెందోటి భాస్కర్‌రెడ్డి, రైతు,జట్ల కొండూరు అనుకూల వాతావరణం మనుబోలు మండలంలో అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉండడంతోనే పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయని తెలుస్తోంది. రవాణా సౌకర్యాలతోపాటు పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, స్థానిక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహాయ సహకారాలు ఉండడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతోమంది ముందుకొస్తున్నారని తెలుస్తోంది. -
ఉందిలే మంచికాలం..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా ముఖచిత్రం మారిపోతోంది. పారిశ్రామిక కేంద్రంగా జిల్లా ఆవిర్భవించనుంది. 33వేలకు పైగా ఎకరాల్లో మెగా పారిశ్రామిక హబ్ ఏర్పాటు కానుంది. ఏకంగా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తరలివస్తాయని అంచనా. భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు, మిడుతూరు, గడివేముల మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధమయింది. హబ్‌లో రీజనల్ ఇండస్ట్రీయల్ మానుఫ్యాక్చరింగ్ జోన్(రిమ్జ్)తో పాటు విమానాశ్రయం, సోలార్, పవన విద్యుత్ పార్కులు, డీఆర్డీవో పరిశోధన ల్యాబ్, టౌన్షిప్, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, మార్కెట్ యార్డు, విత్తన శుద్ధి కేంద్రం తదితరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఇన్ఫాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంస్థ ప్రభుత్వానికి ఒక డీపీఆర్‌ను సమర్పించింది. ఇందుకు ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసింది. నాలుగు బ్లాకులుగా విభజన మెగా పారిశ్రామిక హబ్‌ను నాలుగు బ్లాక్‌లుగా విభజించారు. ఒక్కో బ్లాకులో ఒక్కో తరహా సంస్థలను నెలకొల్పాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి బ్లాక్‌లో రిమ్జ్తో పాటు విమానాశ్రయం ఏర్పాటు. రెండో బ్లాకులో బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు, ప్లాస్టిక్ పార్కు తదితరాలు. మూడో బ్లాక్‌లో టౌన్షిప్, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, 500 మెగావాట్ల సోలార్, 500 మెగావాట్ల పవన్ విద్యుత్ కేంద్రాలు. నాలుగో బ్లాక్‌లో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు విత్తనశుద్ధి కేంద్రం. అన్ని మౌలిక సదుపాయాల కల్పన హబ్‌కు 33,567 ఎకరాల భూమి అవసరం కాగా... ఇందులో 29,394 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మరో 4,173 ఎకరాలు... పట్టా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ మొత్తం హబ్ ఏర్పాటయ్యే విస్తీర్ణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏకంగా రూ.1250 కోట్లు అవసరమని అంచనా వేశారు. పారిశ్రామిక పార్కు ముఖచిత్రం సంస్థలు విస్తీర్ణం(ఎకరాల్లో) రిమ్జ్ 9,340 టౌన్షిప్ 8200 విమానాశ్రయం 2700 లాజిస్టిక్ హబ్ 175 ఎన్ఎఫ్సీ 2200 డీఆర్డీవో 2000 బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు 1700 వ్యవసాయ మార్కెట్ యార్డు 150 విత్తనశుద్ధి కర్మాగారం 150 మెగా ఫుడ్ పార్కు 100 రైస్ హబ్ 380 సోలార్ పవర్ పార్కు 2500 పవన విద్యుత్ కేంద్రం 300 ప్లాస్టిక్ పార్కు 668 ఈహెచ్ఎం క్లస్టరు 500 సాంకేతిక మౌలిక సదుపాయాలు 1300 ఆర్టిరియల్ రోడ్లు 1200 మొత్తం 33,567