CM YS Jagan: విప్లవం సృష్టిస్తున్నాం
సాక్షి, కడప/బద్వేలు/గోపవరం/అట్లూరు: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక విప్లవం సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 75 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాయలసీమ రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు గురువారం ఆయన ప్రొద్దుటూరు, గోపవరం, కొప్పర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత రూ.515.90 కోట్లతో ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గోపవరం మండలంలో రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం కడప సమీపంలోని కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, మరో 3,167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండింటిలో రూ.1,580 కోట్లతో వసతులు కల్పిస్తున్నామన్నారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇక్కడ నిర్మించిన నాలుగు షెడ్లలో ఇప్పటికే ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ ఏర్పాటైందని, ఏప్రిల్ నాటికి 1800 మందికి ఉపాధి కల్పిస్తుందని స్పష్టం చేశారు. 50 మంది అక్క చెల్లెమ్మలకు జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చామని, వాళ్లంతా శిక్షణ పూర్తయ్యాక ఇక్కడే పని చేస్తారని చెప్పారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
మరెన్నో సంస్థలు
► మరో ఆరు ఎలక్ట్రానిక్ సంస్థలు గ్రౌండ్ బ్రేకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్. రెండవది డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ. మూడవది సెలకాన్ రెజుల్యూట్ సంస్థ. నాలుగవది చంద్రహాస్ ఎంటర్ప్రైజెస్, ఐదవది యూటీఎస్‌పీఎల్. ఆరవది డిక్సన్ రెండవ ప్లాంట్.
► ఈ ఆరు సంస్థలు దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించాం. ఈ పరిశ్రమల ద్వారా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో దాదాపు 7,500 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది.
► వీవీడీఎన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ రూ.365 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఈ ఒక్క సంస్థ ద్వారానే 6,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే ఇది కార్యరూపం దాలుస్తుంది. బ్లాక్ పెప్పర్, హార్మోనిసిటీ అనే మరో రెండు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఐఏటీ డివైజ్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ ఈ పార్కులోనే జరగబోతోంది.
కార్బన్ మెగా టౌన్షిప్ మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు వివరిస్తున్న కంపెనీ ప్రతినిధులు
రాయలసీమ రూపురేఖలు మార్చేలా..
► వీవీడీఎన్ సంస్థ 5జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్‌డేటా, ఎనలిటిక్, ఒరిజినల్ డిజైన్, మ్యానిఫ్యాక్చరింగ్ చేయబోతోంది. ఇదే పార్కులో మరో 18 ఎంఎస్ఎంఈల ప్రారంభానికి కూడా శిలాఫలకాలు వేస్తున్నాం.
► రాయలసీమ ఎన్విరాన్‌కేర్, బీఎస్ ల్యాబొరేటరీ, స్వర్ణముఖి కాంక్రీట్ రూ.84 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా మరో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.
► చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు రావాలని, మొత్తం రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుందని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒకవైపు కొప్పర్తి, మరొకవైపు నెల్లూరు, చిత్తూరు సరిహద్దుల్లోని శ్రీసిటీ.. రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు ఉపయోగపడతాయి. వీటి వల్ల ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా.
మీ అందరికీ అందుబాటులో ఉంటాం
► ఎలక్ట్రానిక్స్ ఎంఎస్ఎంఈ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కొప్పర్తిని ఎంచుకున్నందుకు పారిశ్రామిక వేత్తలందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ మద్దతుగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తాం. పరిశ్రమలు ఇక్కడికి రావడానికి పరిశ్రమల శాఖ నుంచి సుబ్రమణ్యం, నందకుమార్, జయలక్ష్మి చాలా కృషి చేశారు. వీరంతా మీకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
► సీఎంఓ నుంచి సోలోమన్ కూడా మీతో ప్రారంభం నుంచి సంప్రదింపులు చేస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది, కష్టం వచ్చినా ఒక్క ఫోన్‌కాల్ ద్వారా అందుబాటులో ఉంటాం. పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి ఇస్తామని చెప్పిన ఇన్సెంటివ్స్ ఇచ్చాం. పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఇన్సెంటివ్‌ల గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రజలు
సెంచురీ ఫ్లై వుడ్‌తో 6 వేల మందికి ఉపాధి
► వెనుకబడిన ప్రాంతమైన బద్వేలు నియోజకవర్గంలోని గోపవరంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమతో యువతకు ఉపాధి, రైతుల ప్లాంటేషన్‌కు గిట్టుబాటు ధర లభిస్తుంది. దేశంలోనే అతి పెద్దదైన వుడ్ పరిశ్రమ బద్వేలులో ఏర్పాటు చేయడం చాలా సంతోషించ దగ్గ విషయం.
► దీంతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు జిల్లా రైతులు సాగు చేస్తున్న సుబాబుల్ కర్రలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వ్యవసాయ హబ్‌తో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముంది. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగు పడతాయి.
► రైతులు సైతం తమ భూములు ఇచ్చి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సెంచురీ ఫ్లై బోర్డ్స్ లిమిటెడ్ (పీసీఐఎల్) యాజమానులు సజ్జన్ భజాంక, సంజయ్ అగర్వాల్‌కు కృతజ్ఞతలు.
► బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం రూ.6 కోట్లతో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. కాశినాయన మండల కేంద్రంలో నూతనంగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బద్వేలు ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుంది.
లక్షాధికారులుగా రైతులు
► గోపవరం జాయింట్ ఫార్మింగ్ కో ఆపరేటివ్ సోసైటీ ప్రాజెక్టు భూముల్లో కొంత భాగాన్ని వ్యవసాయ–పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు తీసుకున్నారు. ఇందులో లీజు ద్వారా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రస్తుతం రెండు ఎకరాల వంతున 201 మందికి పట్టాలు అందజేశారు.
► ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న ఎస్సీ రైతులు దేవదాసు, మాతంగి పుట్టి, రవీంద్రబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు పెద్ద పీట వేశారని సంతోషం వ్యక్తం చేశారు. భారీ పరిశ్రమకు సమీపంలో తమకు రెండు ఎకరాలకు పట్టా ఇచ్చి లక్షాధికారులుగా చేస్తున్నారన్నారు.
► ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, శాసన మండలి వైస్ ఛైర్మన్ జకియాఖానం, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సీఎం విజన్‌తోనే ముందుకు వచ్చాం
సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికత కలిగిన నాయకుడు. మేము మొదట సెంచురీ ప్లై్లౖవుడ్ కంపెనీని తమిళనాడు లేదా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్నాం. అయితే సీఎం జగన్ మమ్మల్ని ఒప్పించి, అనువైన ప్రాంతాన్ని చూపించి అన్ని రకాలుగా అండగా నిలుస్తుండటంతో గోపవరంలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,600 కోట్లు కాగా, మొదటి విడతలో రూ.800 కోట్లు పెడుతున్నాం. ప్రత్యక్షంగా 2 వేలమందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రైతులకు కనీసం 50 శాతం ఆదాయం పెరిగే అవకాశముంది.మొదటి దశలో ఎండీఎఫ్ వుడ్స్ తయారీ పరిశ్రమను రూ.600 కోట్లతో, లామినేటెడ్ వుడ్స్ పరిశ్రమను రూ.200 కోట్లతో చేపడతాం. ఎండీఎఫ్ను 18 నెలల్లో, లామినేటెడ్ వుడ్స్‌ను 15 నెలల్లో పూర్తి చేస్తాం. రెండో విడతలో రూ.200 కోట్లతో ప్లైవుడ్స్, రూ.600 కోట్లతో పార్టికల్ బోర్డ్ వ్యాపారాన్ని చేపడతాం. ఇవి 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి.
– సజ్జన్ భజాంక, సంజయ్ అగర్వాల్, సెంచురీ ప్లైవుడ్ కంపెనీ యజమానులు