ఎంత క్షేమం? | Mandatory Swine flu awareness | Sakshi
Sakshi News home page

ఎంత క్షేమం?

Published Fri, Jan 23 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఎంత క్షేమం?

ఎంత క్షేమం?

ఏపీ, తెలంగాణలను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
జిల్లాలో ఒక్క నిర్ధారణ కిట్టుంటే ఒట్టు
{పభుత్వం నుంచి అందని వ్యాక్సిన్లు
ఐసోలేటెడ్ వార్డు ఏర్పాటు ఏదీ?

 
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి కొందరు చనిపోగా వందలాదిమంది ఇప్పటికే ఆస్పత్రుల్లో ఉన్నారు. దీంతో జిల్లా వాసుల్ని సైతం ఈ పరిణామాలు అప్రమత్తం చేస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం స్వైన్‌ఫ్లూను ఎదుర్కోవడానికి ఎలాంటి మందులు, ప్రత్యేక వార్డులు, కనీసం రోగ నిర్ధారణ పరికరాలు కూడా అందుబాటులోవు.
 
 తిరుమల/ చిత్తూరు(అర్బన్): రెండేళ్ల కిందట ప్రపంచాన్నే వణికించిన వ్యాధి స్వైన్‌ఫ్లూ. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి ముఖానికి మాస్కులు వేసుకుని వెళ్లడం, చేతి రుమాలులో యూకలిప్టస్ తైలం వేసుకోవడం లాంటివిచేశారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే స్వైన్‌ఫ్లూ వస్తుందనే ప్రచారం ఉన్నా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ చ్చేవారిలో ఎవరికైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉంటే ఇతరులకు ఇది సుల భంగా వ్యాపిస్తుంది.
 
పుణ్యక్షేత్రాల్లో టెన్షన్

 
జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో స్వైన్‌ఫ్లూ టెన్షన్ పట్టుకుంది. దేశవ్యాప్తంగా వేలాదిగా భక్తులు సందర్శించే తిరుమలతోపాటు  శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాల్లో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 80 వేల పైబడి వచ్చే తిరుమలలో స్వైన్ ఫ్లూ విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో నాలుగోవంతు సంఖ్యలో భక్తులు వచ్చే శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభలే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు అలాంటి కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ ముందస్తు చర్యలు అవసరమని వారు హెచ్చరిస్తున్నారు.

టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టేనా?

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా స్వైన్‌ఫ్లూ వ్యాధి మరో నెలన్నర రోజులపాటు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే క్షణాల్లోనే మరికొందరికి సోకే అవకాశం ఉంది. 2009లో ఏర్పడిన పరిస్థితులతో తిరుమలలోని అశ్విశి ఆస్పత్రిలో ప్రత్యేకంగా స్వైన్‌ఫ్లూ వార్డు ఏర్పాటు చేశారు. ఎన్ 95 మాస్క్‌లు, అధునాతన మందులు సిద్ధం చేశారు. తాజా పరిస్థితులతో మరోసారి టీటీడీ అలాంటి ఏర్పాట్లే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆమేరకు టీటీడీ వైద్య విభాగం కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వ్యాధి నిర్ధారణ ఎలా..

జిల్లాలో చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల, తిరుపతిలోని ఎస్వీ రుయా ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వ్యాధికి చికిత్స అందచేయడానికి అన్ని సౌకర్యాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వారికి కనీసం వ్యాధి సోకిందా, లేదా అని చెప్పడానికి నిర్ధారణ కిట్లు కూడా లేవు. వ్యాధిసోకిన వాళ్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్లు సైతం జిల్లాలో అందుబాటులో లేదు. ఎక్కడైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే పక్క జిల్లాలోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఆశ్రయించడం తప్ప ప్రజలకు మరోమార్గం లేదు. పేద ప్రజలు సర్కారు వైద్యశాలల్లో సేవలు అందక, ప్రైవేటు వైద్యం కొనలేక ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. వ్యాధి సోకిన వాళ్లను ఐసోలేటెడ్ వార్డులో (పూర్తిగా సమశీతోష్ణ స్థితి ఉన్న గది) ఉంచాలి. స్వైన్‌ఫ్లూ వార్డును మిగిలిన వార్డులకు కాస్త దూరంగా ఉంచడంతో పాటు ఆరు పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఉంచాలి. ఇవేమి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపించడం లేదు. చిత్తూరులోని జిల్లా ప్రధాన వైద్యశాలలో జనరేటర్ వేసే ఓ వార్డుకు స్వైన్‌ఫ్లూ వార్డు అని పేపర్ అతికించి అధికారులు చేతులు దులుపుకున్నారు.
 
వ్యాధి లక్షణాలు..

 దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, విరేచనాలు, గొంతునొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి.

వ్యాప్తి ఇలా..

స్వైన్‌ప్లూ అనే వ్యాధి ఇన్ ప్లూయాంజా ఏ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపించి, ఊపిరితిత్తుల అంతర్భాగానికి సోకడం ద్వారా ప్రమాకరంగా మారి మృత్యువాత పడే అవకాశముంది. పక్షుల ఫారాలు, పందులకు దగ్గరగా పనిచేసే వారికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

నివారణ..

 దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడేటప్పుడు నోటికి అడ్డుగా పెట్టుకోవడం,  తరుచుగా చేతులను శుభ్రపరుచుకుంటూ ఉండటం, పక్షుల ఫారాలు, పందులకు దగ్గరగా నివాసముండే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement