మంగళగిరి మున్సిపాలిటీ ఏరియల్ వ్యూ
సాక్షి, మంగళగిరి : రాజధాని అమరావతిలో కీలకంగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీలను రాష్ట్రంలోనే మోడల్ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) కృషి చేస్తున్నారు. రెండు మున్సిపాలిటీలను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందుకు నిధులు మంజూరు చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. ఈ మేరకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్లు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. రెండు పట్టణాల్లో ఇళ్లు లేని పేదలతో పాటు ప్రభుత్వ భూముల్లో ఉంటున్న పేదలందరికీ 27 వేలకు పైగా గృహాలు నిర్మించి అందించనున్నారు. తాడేపల్లిలో కాల్వగట్లు, ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్వాసితులకు అవసరమైన 15 వేల ఇళ్ల నిర్మాణంతో మంగళగిరి మున్సిపాలిటీలో మరో 12 వేల ఇళ్లు నిర్మించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆయా పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మురుగునీటి శుద్ధి, విద్యుత్, వీధిలైట్లు, కాలువల అభివృద్ధి, పార్కులు, బరియల్ గ్రౌండ్, రోడ్ల విస్తరణలకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
చేనేత బజారు ఏర్పాటు దిశగా చర్యలు..
చేనేత పరిశ్రమకు నెలవైన మంగళగిరి పట్టణంలో చేనేత బజార్ ఏర్పాటు, కమ్యూనిటీ హాలు నిర్మాణాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.670 కోట్లతో తాడేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసిన అధికారులు మంగళగిరి మున్సిపాలిటీకి రూ.800 కోట్ల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదముద్ర వేశారు.
ఐదేళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గం నిరాదరణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున తాను గెలిచాననే అక్కసుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లు నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారు. అందుకే ఈ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు నమ్మకం లేక నన్నే గెలిపించారు. ఐదేళ్లుగా ఉండవల్లిలో నివాసముంటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు ఏ ఒక్క రోజు మున్సిపాలిటీల అభివృద్ధిపై కనీసం సమీక్ష చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే రెండు సార్లు మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష చేశారు. రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు సైతం ఆమోదం తెలిపారు. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో పాటు నిధులు మంజూరుకు సీఎం అంగీకరించడం అభినందనీయం. రూ.670 కోట్లతో తాడేపల్లి, రూ.800 కోట్లతో మంగళగిరిని అభివృద్ధిపర్చేందుకు తయారు చేసిన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారంటే నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment