సాక్షి ప్రతినిధి,ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రధాన నేతల చేరికల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీలో చేరికకు సిద్ధమవగా తాజాగా మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ నెల 11న మానుగుంట పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని శనివారం తిరుపతిలో ఆయనే స్వయంగా వెల్లడించారు. మహీధర్‌రెడ్డి తిరుపతిలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పార్టీనేత భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను కలిశారు. వారితో కలిసి స్థానిక సాయిబాబా గుడిని సందర్శించారు.
అనంతరం అందరి సమక్షంలో తాను వైఎస్సార్ సీపీఈ లో చేరుతున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన మహీధరరెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి ఆదినారాయణరెడ్డి కందుకూరు నుంచి శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం ఉన్నారు. 1972 ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి పోటీచేసిన ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చెంచు రామనాయుడుపై గెలుపొందాడు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండయ్య చౌదరిపై ఓటమి చెందారు. ఆ తరువాత 1983లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి గుత్తా వెంకటసుబ్బయ్యపై గెలుపొందారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి మరోమారు గుత్తా పై గెలిచారు.
ఆ తరువాత 1989 మహీధరరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. కందుకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాలకొండయ్యపై విజయం సాధించారు. 1994లో స్వతంత్య్ర అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాం చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాంను రెండు మార్లు వరుసగా ఓడించి సత్తా చాటారు మానుగుంట. వైఎస్ మృతి అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో మున్సిపల్ శాఖామంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.
ఇప్పటి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. చాలా కాలంగా మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు ఈ నెల 11వ తేదీన జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరవర్గం పెద్ద ఎత్తున పార్టీలో చేరనుంది. పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి తదితర నియోజకవర్గాల్లో మహీధరరెడ్డి ప్రభావం ఉంది. ఇది వైఎస్సార్ సీపీకి కలిసి వచ్చే అంశం. దీంతో జిల్లాలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment