మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
టీడీపీ హయాంలో కుంభకోణాల నెలవుగా మారిన విశాఖ వికాసానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన విజన్ చార్ట్ నెలరోజుల్లో సిద్ధమవుతుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. విశాఖతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. విశాఖను సాంస్కృతికి, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అత్యంత విలువైన భూములను తీసుకున్న లులూ గ్రూప్ మూడేళ్లవుతున్నా ఒక్క ఇటుకైనా పెట్టనందునే ఆ కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. వాల్తేర్ డివిజన్‌తో కూడా రైల్వేజోన్ వస్తుందని.. దీనికి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. భూకుంభకోణాలపై విచారణను గత ప్రభుత్వం ఆంక్షలతో కుదించేసినందునే.. పరిధి పెంచి మళ్లీ సిట్ వేయాల్సి వచ్చిందని వివరించారు.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందో నెలరోజుల్లోనే ప్రజలందరికీ తెలుస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. మెట్రో రైలుతో పాటు, తాగు సాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలతో రాష్ట్రంలో విశాఖ నగరం అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారనుందని వివరించారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు. విశాఖలో ఫిల్మ్‌సిటీ, పరిశ్రమలు, ఐటీ, బీఆర్‌టీఎస్.. ఇలా ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లేనన్నారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్ల కాలంలో విశాఖ అభివృద్ధి శూన్యమని, టీడీపీ హయాంలో విశాఖ కుంభకోణాలకు కేంద్రంగా మారిపోయిందనీ.. ఆ మచ్చ చెరిపేందుకు సీఎం ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. సాంస్కృతిక పరంగా, వాణిజ్య పరంగా, ఉద్యోగ, ఉపాధికి రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.
బహిరంగ సవాల్‌కి సిద్ధమేనా ?: మంత్రి ముత్తంశెట్టి
వైఎస్సార్‌సీపీ నేతలు ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వారందరికీ తాను బహిరంగ సవాల్ విసురుతున్నా.. ఎక్కడైనా వారి వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే వారిని అలాంటి వ్యాపారం చేస్తున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తా.. లేని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో అమలు చేయాల్సిన మ్యానిఫెస్టోని 5 నెలల్లో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. అదే చంద్రబాబు ఐదేళ్లు నిద్రపోయి ఎన్నికల ముందు హడావిడి చేశారని విమర్శించారు. తెలంగాణ ఆర్టీసీ సమస్యకు, ఏపీ ఇసుక సమస్యతో ముడిపెట్టడం చూస్తుంటే వయసు, స్థాయి మరిచిన చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. టీడీపీ పాలన నచ్చకపోవడం వల్లే.. ప్రజలు 23 స్థానాలకు ఆ పార్టీని పరిమితం చేశారనీ, అదే పార్టీకి వంతపాడటం వల్లే.. పవన్ కల్యాణ్‌ని భీమవరం, గాజువాకలో ఓడించారనీ.. ఈ విషయం కూడా తెలుసుకోలేని చంద్రబాబు ఇసుక పోరాటమంటూ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. గాజువాకలో రెండో స్థానానికి పరిమితమైన పవన్‌కల్యాణ్.. ఇంతవరకూ ఆ నియోజకవర్గ ప్రజల ముఖం కూడా చూడకపోవడం సిగ్గు చేటన్నారు. అదేవిధంగా గెలిపించిన ఉత్తర నియోజకవర్గ ప్రజలను గంటా పట్టించుకోవడం లేదన్నారు.
విలేకరుల సమావేశంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, కన్నబాబు రాజు, గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, రూరల్ అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ ముఖ్య నేతలు దాడి వీరభద్రరావు, సాగి దుర్గాప్రసాదరాజు, కేకేరాజు, మళ్ల విజయప్రసాద్, సనపల చంద్రమౌళి, కొయ్య ప్రసాదరెడ్డి, జాన్ వెస్లీ, రవిరెడ్డి, పక్కి దివాకర్, గరికిన గౌరి, మంత్రి రాజశేఖర్, శ్రీదేవి వర్మ, పీలా వెంకటలక్ష్మి, వెంపాడ శ్రీనివాసరెడ్డి, బోనె శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సిట్ పరిధి పెంచేలా..
విశాఖ భూ కుంభకోణాలపై గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక అసంపూర్తిగా ఉందన్నారు. టీడీపీ నేతల భూదందాల్ని కప్పిపుచ్చేలా నివేదిక ఉందని.. అందుకే ప్రభుత్వం కొత్తగా దర్యాప్తు ప్రారంభించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. సిట్ పరిధి ప్రస్తుతం విశాఖ నగరం చుట్టు పక్కల మండలాల్లోనే ఉందని, అయితే యలమంచిలి, పాయకరావు పేట, పెందుర్తి.. ఇలా ప్రతి చోటా ఆక్రమణలు జరిగాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు సిట్ పరిధి పెంచాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో చర్చిస్తామని తెలిపారు. సిట్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు ఈ నెల 7 వరకు ఉన్న గడువు పెంచాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. భూ కుంభకోణాల్లో ఏ పార్టీ వ్యక్తి ఉన్నా.. చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వెయ్యబోదని స్పష్టం చేశారు.
వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్
వాల్తేరు డివిజన్ విభజన జరగదని, ఈ డివిజన్‌తో కూడిన విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందని విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. డివిజన్ విభజించొద్దన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన బోగస్ భూ కేటాయింపుల్ని రద్దు చేస్తున్నామన్నారు. లూలూ గ్రూప్ హైదరాబాద్‌లో భూమి తీసుకొని 90 శాతం పనులు పూర్తి చేసేసిందని.. విశాఖలో మాత్రం ఇటుక కూడా పెట్టలేదని. ఈ కారణంగానే ఆ కేటాయింపులు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. జర్నలిస్టులంటే ముఖ్యమంత్రి జగన్‌కు ప్రేమ, అభిమానం అని అన్నారు. ప్రభుత్వం చేసే ఏ పనినైనా విమర్శించే అధికారం ఫోర్త్ ఎస్టేట్‌కు, ప్రతిపక్షాలకు ఉందని.. అయితే.. అవి సహేతుకంగా ఉండాలే తప్ప ఇష్టారాజ్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు ఒక తొత్తు మాత్రమేనని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment