రామలింగేశ్వరాలయం వెనుక రోడ్డులో నిర్మించిన అనుమతి లేని బహుళ అంతస్తు
సాక్షి, విశాఖపట్నం: నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న అక్రమ భవనాల నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లూ పట్టణ ప్రణాళికా అధికారుల్ని ప్రసన్నం చేసుకుని అక్రమ నిర్మాణాలు చేసేవారు. కానీ ప్రభుత్వం ఈ తరహా నిర్మాణాల సంగతి తేలుస్తామని హెచ్చరించడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల నోట్ల పచ్చి వెలక్కాయ పడ్డటైంది. గత ప్రభుత్వం జారీ చేసిన బీపీఎస్‌లో భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ఈ మధ్యనే వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న తీరు చూస్తుంటే నిబంధనలను ఏమేర తుంగలో తొక్కుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
పట్టణాలు క్రమబద్ధంగా నిర్మితమైన ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానిది. రహదారులు, కాలువలు తదతర నిర్మాణాలను పర్యవేక్షించాలి. క్షేత్రాస్థాయికి వస్తే ఈ నిబంధనలు అడ్డుపెట్టుకొని సిబ్బంది యథేచ్ఛగా ముడుపులు దండుకుంటున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్లు విడిచిపెట్టేశారు. దీంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు రహదారులు, కాలువలు ఆక్రమించుకుని భవనాలు నిర్మించారు. మహా విశాఖ నగర పాలక సంస్థతో పాటు నర్సీపట్నం, యలమంచలి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఎవరినడిగినా చెబుతారు. వీటిని నియంత్రించాల్సిన టౌన్‌ప్లానింగ్ విభాగం సిబ్బంది అందుకు విరుద్ధంగా అక్రమ కట్టడాల యజమానులతో అంతర్గతంగా కుమ్మకై భారీ ఎత్తున తాయిలాలు అందుకోవడం ద్వారా అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనుమతులు లేని నిర్మాణాలు కూడా పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
అనధికార లే అవుట్లు
గతంలో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్‌లు పుట్టుకొచ్చాయి. ముందుగా లేఅవుట్‌లు క్రమబద్ధీకరించిన తరువాత ప్లాన్‌కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్ద మొత్తం అవుతుండడంతో ఎటువంటి ప్లాన్‌లు మున్సిపాలిటీకి సమర్పించకుండానే అన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకు సూచనలు, సలహాలు సైతం టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే అక్రమ నిర్మాణదారులకు అందుతుండడంతో మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడుతోంది. మరోవైపు ప్రభుత్వ స్థలాలు, పంట కాలువలు, రిజర్వ్ స్థలాలను సైతం దర్జాగా ఆక్రమించుకుని నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకుని ప్రభుత్వ స్థలాలను సంరక్షించాల్సిన బాధ్యత ఈ విభాగానికి ఉన్నప్పటికీ మనదేమిపోయిందన్న రీతిలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.
ఇబ్బడి ముబ్బడిగా....
ప్రతి వీధిలోనూ ఒకట్రెండు అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియకుండా జరుగుతున్నాయంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే చైన్‌మేన్లు ప్రతి వార్డును నిత్యం పర్యవేక్షించి ఎక్కడ అనుమతిలేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు, ఎక్కడ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. ఎక్కడ గెడ్డలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారు.. ఇలాంటివన్నీ పరిశీలించి సంబంధిత జోన్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియజేయాలి. వారు ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. కానీ తమకేమీ పట్టనట్లుగా, తామేమీ చూడనట్లుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. పలు సందర్భాల్లో అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుంటూ జీవీఎంసీ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, చైన్‌మెన్లు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
క్రమబద్ధీకరణకు వేలాది దరఖాస్తులు...
ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో బీపీఎస్ కోసం వచ్చిన దరఖాస్తులే నిదర్శనం. ఒక సీసీపీ, ఇద్దరు సీపీలు, ఒక డీసీపీ, 8 మంది వర్కింగ్ సూపర్ వైజర్లు, 10 మంది టెంపరరీ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, 32 మంది చైన్‌మేన్లు ఉన్న జీవీఎంసీలో వేలాది బీపీఎస్ దరఖాస్తులు వస్తున్నాయంటే.. వాటిని గుర్తించడంలో లోపమెవరిదన్న విషయం ప్రశ్నార్థకమే. 2007లో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్)కు 23,101 దరఖాస్తులు వచ్చా యి. 2015లో 13,979 అక్రమ అదనపు అంతస్తు నిర్మాణదారుల నుంచి దరఖాస్తులొచ్చాయి. తాజాగా విడుదల చేసిన 2019 బీపీఎస్‌కు జూన్ 30 వరకూ గడువు ఉండగా...ఇప్పటివరకూ 4,233 దరఖాస్తులు వచ్చాయంటే అక్రమ నిర్మాణాలు ఏమేర జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని మిగిలిన మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
తూర్పులో ‘పెట్రేగిన వెలగపూడి’
తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కనుసన్నల్లో గత పదేళ్లలో భూదందాలు పెట్రేగిపోయాయి. ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా... అన్నీ అనుకూలిస్తే అక్రమ నిర్మాణం. ఈ తరహాల్లో గత పదేళ్లలో అక్రమ కట్టడాలకు, భూ కబ్జాలకు తూర్పును కేంద్రంగా వెలగపూడి భూ దందా సాగించారు. అక్కడితో ఆగకుండా ఆయా దందాల అవినీతి మరకలను జీవీఎంసీ, వుడా అధికారులకూ ఆయన అంటించారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎక్సైజ్ విభాగాల్లోని కొందరి అధికారులను ఆయన దందాలకు కాపలాదారులుగా మార్చేశారు. ఇలా వెలగపూడికి దాసోహమై వ్యవస్థను భ్రష్టుపట్టించిన విభాగాల్లో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఒకటి. జోన్–2 టౌన్ ప్లానింగ్ అధికారులైతో రెండు అడుగులు ముందుకేసి ఏకంగా వెలగపూడి అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను భుజన వేసుకోవడం కొసమెరుపు. దీంతో నగరంలోని జరిగిన అక్రమ నిర్మాణాల్లో తూర్పు అగ్రభాగాన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ నిర్మాణ తొలగింపు ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం వెలగపూడి త్రయంలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
వందల సంఖ్యలో బినామీ భవనాలు
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు బినామీల పేరిట వందకు పైగా భవనాలు నిర్మాణం జరిగినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. వీటిలో అధికశాతం తూర్పు నియోజకవర్గంలో ఉండగా 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి మధ్యలో నిర్మాణ పనులు జరిగినవే అధికంగా ఉన్నట్లు అంచనా. ఆరిలోవ, ఎంవీపీ కాలనీ సెక్టార్–2, సెక్టార్–9, సెక్టార్–10, వాల్తేర్, లాసెన్స్ బే, అప్పుఘర్, వెంకోజిపాలెం, ఆదర్శనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా వెలగపూడి తన బినామీలు, అనుచరులతో భవన నిర్మాణాలు చేయించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే అనుచరులు, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ వార్డు అధ్యక్షులు ప్రాంతాల వారిగా పంచుకొని మరీ అక్రమ కట్టడాలకు పూనుకున్నారు. ఆరిలోవ, ఎంవీపీకాలనీ టీడీపీ నాయకులు పట్టాభిరామ్, సత్తిబాబు, కాళ్ల శంకర్ కనుసన్నల్లో సెక్టార్–2, సెక్టార–6, (ఆదర్శనగర్) సెక్టార్–10 లలో పెద్ద ఎత్తున వెలగపూడి బినామీలు, అనుచరులు అడ్డగోలు నిర్మాణాలు చే«శారు. (అప్పుఘర్) సెక్టార్–9లో 7వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోలారావు, పేర్ల మషేన్ కనుసన్నల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు నిర్మాణాలు జరిగాయి. దీంతో పాటు 17వ వార్డు పరిధిలోని పెదవాల్తేర్, చినవాల్తేర్ టీడీపీ నాయకుడు పొతన్న రెడ్డి, మూర్తి, అమరేంద్రల పర్యవేక్షణలో అడ్డగోలు నిర్మాణ దందాలు జరిగినట్లు సమాచారం. విశాలాక్షినగర్, లాసెన్స్‌బే ప్రాంతాల్లో సైతం వెలగపూడి బీనామీలు పెద్ద ఎత్తున అడ్డగోలు నిర్మాలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న అనుచరుల ద్వారా ల్యాండ్ కబ్జాలు, అక్రమ కట్టడాలు చేసినట్లు సమాచారం.
సీఆర్‌జడ్ నిబంధనలు పట్టవిక్కడ...!
చారిత్రాత్మక నేపథ్యం కలిగిన భీమిలిలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించుకున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో టీడీపీ నాయకుల అండదండలంతో నిర్మించుకున్నవే ఎక్కువ. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి 159 ఏళ్ల చరిత్ర కలిగిన భీమిలి మున్సిపాల్టీ కార్యాలయాన్ని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి అనుమతుల గురించి టౌన్ ప్లానింగ్, జీవీఎంసీ అధికారులను అడిగితే నవ్వేసి ఊరుకుంటారు. వీటితో పాటు బీచ్‌రోడ్‌లోని నిడిగట్టు, చేపలుప్పాడ, కె.నగరపాలెం పంచాయతీలలో అయితే తీరాన్ని ఆనుకుని లెక్కలేనన్ని హేచరీలు, హోటళ్లు సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు.
భీమిలి జోన్ 1 పరిధిలోకి వస్తుంది..
చారిత్రాత్మక కట్టడాలు, నదీ ముఖద్వారాలు ఉన్న ప్రాంతాలను సీఆర్‌జడ్ నిబంధనల ప్రకారం జోన్ 1గా పరిగణిస్తారు. ఈ కోవలోనే భీమిలి ప్రాంతాన్ని కూడా జోన్ 1లోకే వస్తుంది. ఇలాంటి ప్రాంతాలలో తీరం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకూడదని డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ విభాగం నిర్థారించింది. ఒకవేళ ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా షోర్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(సాడా)తో పాటు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. మున్సిపాల్టీ, జీవీఎంసీలకు అనుమతులు ఇచ్చే అధికారం లేదు. దీని ఆధారంగా భీమిలి పట్టణంలో గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయం నుంచి నిడిగట్టు పంచాయతీలో నేరెళ్లవలస, కె.నగరపాలెంలో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాలలో లెక్కలేనన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇందులో పలువురు పోలీసు,రెవెన్యూ అధికారులు ఉన్నారు.
మరీ ఇంత దారుణమా?
జీవీఎంసీ జోన్ 2 పరిధిలో 12వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. శంకరమఠం రోడ్డులో రామలింగేశ్వరాలయం వెనుక ఉన్న ఐదు అడుగుల రోడ్డులో అనుమతి లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ద్విచక్రవాహనం కూడా వెళ్లే వీలులేని ఐదు అడుగుల రహదారిలో జీప్లస్3, జీప్లస్4 తరహాలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఐదు అడుగుల రోడ్డులో గ్రౌండ్, మొదటి అంతస్తుకు మాత్రమే అనుమతులు లభిస్తాయి. ఇక్కడ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు, నాలుగు అంతస్తులు నిర్మించారు. ఇదే రోడ్డులో మరో వ్యక్తి జీప్లస్4 తరహాలో అనుమతి లేకుండా బహుళ అంతస్తు నిర్మించారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఫైరింజన్ కానీ, అంబులెన్స్ గానీ వెళ్లే మార్గమే లేదు. ఇటువంటి ఇరుకు సందుల్లో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
లలితానగర్‌లో అక్రమ నిర్మాణం
రామకృష్ణానగర్ సాయిబాబా ఆలయం ఎదురుగా ఉన్న లలితానగర్ రోడ్డులో మారుతి క్లినిక్ పక్కన ఓ వ్యక్తి పాత బిల్డింగ్‌పై అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మిస్తున్నారు. గ్రౌండ్ మొదటి అంతస్తు ఉన్న పాత బిల్డింగ్‌పై రెండో అంతస్తు నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని..అదనంగా మరో అంతస్తును నిర్మిస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్నట్టు స్థానికులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
గాజువాకలో అడ్డూ అదుపూ లేకుండా...
గాజువాక ప్రాంతంలో అనధికార నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా నిర్మాణదారులు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని సిఫార్సులు చేసుకోవడంద్వారా తమ జోలికి రాకుండా చేసుకోగలుగుతున్నారు. కింది అంతస్తులకు అనుమతులు తీసుకొని అదనపు అంతస్తులను నిర్మిస్తున్న పరిస్థితులు అధికంగా చోటుచేసుకొంటున్నాయి. గాజువాక పట్ణణ ప్రాంతంలో ఏకంగా కమర్షియల్ భవనాలను సైతం నిర్మిస్తుండటం గమనార్హం. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో ఇలాంటి నిర్మాణాలకు అడ్డూ, అయిపూ లేకుండా పోయింది.
► పెదగంట్యాడలోని శీరవానిపాలెం మసీదు పక్కన గెడ్డను ఆనుకొని ఉన్న వెయ్యి గజాల స్టీల్‌ప్లాంట్ స్థలాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించి నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. దీనిపై స్టీల్‌ప్లాంట్ భూసేకరణ అధికారులనుంచి ఒత్తిడి లేకపోవడం, అక్కడ ఓ మాజీ కార్పొరేటర్ సిఫార్సులు చేస్తుండటంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టలేకపోతున్నారు.
► గాజువాక సర్వే నంబర్ 87లోని కొత్తగాజువాక జంక్షన్‌లో మెయిన్ రోడ్డుకు, హైస్కూల్ రోడ్డుకు కార్నర్‌లో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆక్రమించింది. 20 ఏళ్ల క్రితంనుంచి వివాదం కొనసాగుతున్న ఈ స్థలాన్ని పల్లా కుటుంబం అధికారం చేతిలోకి రాగానే ఆక్రమించి తాత్కాలిక దుకాణాలను నిర్మించింది. వివాదం తలెత్తినప్పట్నుంచీ ఈ స్థలాన్ని కాపాడుతూ వచ్చిన రెవెన్యూ అధికారులు పల్లా ఒత్తిడితో పట్టించుకోవడం మానేశారు. రూ.20 కోట్ల విలువైన ఈ స్థలానికి అధికారులు పట్టాలను కూడా జారీ చేసేశారు.
► గాజువాక కణితి రోడ్డులో ఓ వ్యక్తి ఏకంగా ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా కింది అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేసిన సదరు వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ఏకంగా నాలుగో అంతస్తు నిర్మాణాన్ని కూడా పూర్తి చేశాడు. దీనిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా అధికారులు అటువైపు చూడటం మానేశారు. పంతులుగారి మేడవద్ద విద్యుత్ తీగల కింద ఒక వ్యక్తి భారీ భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. రాజకీయ ఒత్తిళ్లవల్ల అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అక్కడక్కడా అనధికార అంతస్తులను తొలగిస్తున్నప్పటికీ తరువాత కాలంలో పూర్తయిపోతున్నాయి.
► ప్రభుత్వ నిర్మాణం ముసుగులో టీడీపీ కార్యకర్త ప్రాథమిక పాఠశాల స్థలాన్ని కబ్జా చేశాడు. అంగన్‌వాడీ భవనం పేరుతో ఏకంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. శంకుస్థాపన చేసిన స్థలంలో అంగన్‌వాడీ కేంద్రానికి భవనాన్ని నిర్మిస్తున్నట్టు అందరిన్నీ నమ్మించి స్థలం కబ్జాకు ప్రయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఆగింది. మిగిలిన నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేసి అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించాలని వారు కోరుతున్నారు.
సర్కారు నిర్ణయంతో ఉలికిపాటు
గత ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై అనుమతులు లేకుండా నిర్మించిన ప్రజా వేదికను కూల్చేయ్యాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముడుపులకు అలవాటు పడిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ఆయా పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్న బిల్డర్లు, యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే చాలామంది తమ తమ నిర్మాణాల్ని అర్థాతరంగా నిలిపేశారు. మరోవైపు బీపీఎస్‌కు ఈనెల 30 వరకూ గడువు ఉండడంతో చకచకా నిర్మాణాలు సాగించి దరఖాస్తు చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు.
నిబంధనలు మీరితే సహించం
అక్రమ నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా జరుగుతున్న అదనపు అంతస్తుల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగితే సహించే ప్రసక్తే లేదు. ఎక్కడ నిబంధనలు అతిక్రమించినా వెంటనే నివేదిక ఇవ్వాలని జోనల్ సిబ్బందిని ఆదేశించాం. ప్రతి వార్డులోనూ నిశిత పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం.
– ఆర్‌జే విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్
Comments
Please login to add a commentAdd a comment