సాక్షి ప్రతినిధి,కడప: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ధిక్కార స్వరం వినిపించేందుకు పలువురు నేతలు సన్నద్ధమవుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని ఎమ్మెల్యేలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన అంశమే అందుకు కారణం కానుంది. ఇప్పటికే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆ విషయాన్ని తెటతెల్లం చేశారు.
అదే విధమైన వైఖరిని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వ్యక్తం చేయాలని సమైక్యవాదులు అభిప్రాయపడుతున్నారు. ఓట్లు-సీట్లు లక్ష్యంగా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పూనుకుంది. ప్రజా వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయానికి తెరలేపింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సమర్థిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్‌పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ధిక్కార స్వరం విన్పిస్తున్న వీరశివా...
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులను ఓడించి తీరుతామని ఎమ్మెల్యే వీరశివారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఒక విధంగా సమైక్యవాదులకు కొంత ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశించిన మేరకు ఆచరణలో చూపెట్టడంలేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
చిత్తశుద్ధితో సమైక్యరాష్ట్రం కోరే వారే అయితే, ప్రస్తుతం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చతోబాటు ఓటింగ్ కూడా జరపాలని కోరి ఉండేవారని, లేదంటే సమైక్యం కోసం తీర్మానానికి పట్టుబట్టి ఉండేవారని పలువురు పేర్కొంటున్నారు. ఇవేవి పట్టించుకోకుండా కేవలం సమైక్య ముసుగు తగిలించుకోవడం సహేతుకం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ఆపార్టీ ఎమ్మెల్యేలపై ఉందని పలువురు చెబుతున్నారు.
ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రకటనతో సరిపెట్టకుండా ఆచరణలో చూపెట్టాలని పలువురు ఆశిస్తున్నారు. తనతోబాటు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలని చిత్తశుద్ధితో సమైక్యరాష్ట్రం కోసం రాజ్యసభ ఎన్నికలను వాడుకోవాలని సమైక్యవాదులు పేర్కొంటున్నారు. ఆమేరకు జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్యేలు కమలమ్మ, డీఎల్ రవీంద్రారెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి అందుకు కట్టుబడి ఉండాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
ఝలక్!
Published Wed, Jan 22 2014 2:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement