- మన్యంలో మావోయిస్టుల బీభత్సం
- గుల్లేలులో పట్టపగలు పొక్లెనర్ దగ్ధం
- రోడ్డు మిల్లర్, సిమెంట్ పైపులు ధ్వంసం
- పనులు ఆపేయాలంటూ బ్యానర్లు
- బిక్కు బిక్కుమంటున్న ప్రజాప్రతినిధులు
పెదబయలు, న్యూస్‌లైన్: మన్యం వాసులు మరోసారి ఉలిక్కి పడ్డారు. మావోయిస్టులు మళ్లీ ఉనికిని చాటుకోవడంతో మారుమూల పంచాయతీల సర్పంచ్‌లు, ఇతర ముఖ్య నా యకులు ఎప్పడేమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పెదబయలు, జి.మాడుగుల,ముంచంగిపుట్టు మండలాల్లో భయాం దోళనలు నెలకొన్నాయి. పెదబయలు మండ లం మారుమూల గుల్లేలు గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయం లో పట్టపగలు బీభత్సం సృష్టించారు.
సాయుధులైన 30 మంది దళసభ్యులు రోడ్డు పనికి ఉపయోగించిన పొక్లెనర్‌ను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అలాగే మిల్లర్‌ను, కల్వర్టులకు ఉపయోగించే సిమెంటు పైపులను ధ్వంసం చేశారు. పొక్లెనర్‌తో పనులు నిర్వహిస్తుం డగా డ్రైవర్‌ను దింపి, దానిపై పెట్రోలు పోసి దగ్ధం చేశారు. పనులు నిలిపివేయాలని కూలీలను హెచ్చరించారు. ‘అభివృద్ధి అంటే అందరికీ అన్నం పెట్టేదిగా ఉండాలని, కాంట్రాక్టర్లు, దళారులకు ఉపయోగపడేదిగా ఉండకూడద ని, బాక్సయిట్ కంపెనీలకు ఉపయోగపడే రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటాం’ అంటూ కోరుకొండ ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు కట్టారు.
రోడ్డు నిర్మాణానికి సహాకరిస్తున్న నాయకులు, దళారులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సుమారు గంటపాటు సంఘటనా స్థలంలో దళసభ్యులు చెలరేగిపోయినట్టు కూలీలు తెలిపారు. మూడేళ్లుగా మావోయిస్టులు ఈ మండలంలో రోడ్డు పనులకు ఎటువంటి ఆటంకం కల్పించలేదు. శుక్రవారం నాటి సంఘటనతో కాంట్రాక్టర్లు బిక్కు బిక్కు మంటున్నారు. గుల్లేలు పంచాయతీ కేంద్రం మినహా దాని పరిధిలోని మిగిలిన 11 గ్రామాలకు ఎంతో కాలంగా రోడ్డు సదుపాయం లేదు. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే అన్ని గ్రామాలకు రహదారి సదుపాయం కలిగేది. మావోయిస్టుల చర్యలతో ప్రారంభంలోనే రోడ్డు పనులు నిలిచిపోయాయని పంచాయతీ ప్రజలు వాపోతున్నారు.
మావోయిస్టుల చెరలో ఇద్దరు గిరిజనులు?
పాడేరు: ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు అధికమవ్వడంతో గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి దళసభ్యులు ప్రజాకోర్టు నిర్వహించినట్టు ఆలస్యంగా తెలిసింది. ముఖ్యనేతలు ఈ ప్రజాకోర్టు నిర్వహించి,పలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. దీనికి హజరైన ముగ్గురు గిరిజనులను తమ వెంట తీసుకుపోయారు. వారిలో ఒకరయిన మాజీ సర్పంచ్‌ను హెచ్చరించి గురువారం విడిచిపెట్టారు.
ఇంజరి పంచాయతీ సర్పంచ్ భర్త పూజారి సత్యారావు,అతని అనుచరుడు గెమ్మెలి మోహనరావులను తమ అధీనంలో ఉంచుకున్నట్టు తెలిసింది. మూడు రోజులుగా ఇద్దరినీ విడిచిపెట్టక పోవడంతో ఈ పంచాయతీలోని గిరిజనులంతా ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల క్రితం కిల్లంకోట ప్రాంతంలోనూ మావోయిస్టుల ప్రజాకోర్టు నిర్వహించి మాజీ సర్పంచ్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.