అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
ఓటు నమోదు చేసుకున్న వారిలో 43% ఇండిపెండెంట్ ఓటర్లే
ఏ పార్టీకి చెందనివారే స్వతంత్రులు
ప్రస్తుత ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్‌లో వీరే కీలకం
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్‌లు ఇటు రిపబ్లికన్‌లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్‌కు కానీ ఇటు ట్రంప్‌కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్‌లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు.
పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్య
ప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
7 రాష్ట్రాల్లో కీలకం
⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్‌లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్‌లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.
అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్‌గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్‌గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.
కొత్త తరం ఓటర్లే ఎక్కువ..
అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్‌జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.
ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్‌లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.
పేరుకే స్వతంత్ర ఓటర్లు
⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్‌గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో
ట్రంప్‌కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్‌కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.
⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు.
⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు.
⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు.
⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు
⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment