కాకినాడ క్రైం: 27 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మావోయిస్టు నేత కిరణ్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. సోమవారం రాత్రి కాకినాడ పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం. రవిప్రకాష్ వివరాలు వెల్లడించారు.
'మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి, స్టేట్‌కమిటీ సభ్యుడైన శివారెడ్డి అలియాస్ కిరణ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలోని నందిగామలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. అతనికి వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీ వైద్యుడు నరేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కిరణ్‌పై ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డును ప్రకటించింది. ఆ సొమ్మును అతనిని అరెస్టుకు సహకరించినవారికి అందజేస్తాం' అని ఎస్పీ చెప్పారు.