నెల్లిపాక: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురంలో గత నెల 30న మావోరుుస్టులు అపహరించిన చర్చి పాస్టర్ కన్నయ్య కుమారుడు ఇస్సాక్‌కు ఇంకా విముక్తి లభించలేదు. కన్నయ్య కోసం సాయుధ మావోయిస్టులు గ్రామానికి వచ్చి, ఆయన లేకపోవటంతో పెద్ద కుమారుడు ఇస్సాక్‌ను తీసుకెళ్లారు. కన్నయ్య తమ వద్దకు వస్తేనే ఇస్సాక్‌ను విడిచి పెడతామని హెచ్చరించారు. కాగా పాస్టర్ కన్నయ్య ఆ రోజు నుంచి ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకోవటంతో ఇస్సాక్‌కు మావోయిస్టులు ఏదైనా ఆపద తలపెట్టి ఉంటారేమోనని అతడి కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.
మత బోధన చేసుకునే తమ కుటుంబానికి అపకారం తలపెట్టడం మావోయిస్టులకు ధర్మం కాదని, ఇస్సాక్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని వేడుకుంటున్నారు. ఇస్సాక్ను విడిచి పెట్టేలా చూడాలని ప్రభుత్వ అధికారులను, పోలీసులను, మానవహక్కుల సంఘాల నేతలను అభ్యర్థిస్తున్నారు. కాగా పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలతో అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.