issac
-
తండ్రి వస్తేనే తనయుడి విడుదల!
చింతూరు: తమ చెరలో ఉన్న ఇస్సాక్ను విడుదల చేయాలంటే అతడి తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఇస్సాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టులకు దొరికిన పాస్టర్లను ఆదివారం రాత్రి విడిచి పెట్టారు. అయితే చెర వీడిన పాస్టర్లు అటవీ ప్రాంతంలో అసలేం జరిగిందనే దానిపై నోరు మెదపడం లేదు. ఇస్సాక్ఆచూకీ కోసం వెళ్లినపుడు మావోయిస్టులు ఎలా తారసపడ్డారు? ఇస్సాక్ను చూపించారా? ఎలాంటి హెచ్చరికలు చేశారు? లాంటి ప్రశ్నలపై వారు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ముందు నుంచీ బందీ చేసిన ఇస్సాక్ను, పాస్టర్లను మావోయిస్టులు విడివిడిగా ఉంచినట్టు తెలిసింది. కాగా, కన్నయ్య వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి కొడుకును విడుదల చేస్తామని, మరోసారి ఇస్సాక్విడుదల కోసం ఎవరూ మధ్యవర్తులుగా రావద్దని మావోయిస్టులు హెచ్చరించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. మరోవైపు మావోయిస్టులు కన్నయ్యకు అల్టిమేటం జారీచేస్తూ ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇస్సాక్ను అపహరించిన నాటి నుంచి కన్నయ్య ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు లేఖలో ఏం రాశారనేది స్పష్టంగా తెలియరాలేదు. -
ఏడు రోజులుగా మావోయిస్టుల చెరలోనే..
నెల్లిపాక: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురంలో గత నెల 30న మావోరుుస్టులు అపహరించిన చర్చి పాస్టర్ కన్నయ్య కుమారుడు ఇస్సాక్కు ఇంకా విముక్తి లభించలేదు. కన్నయ్య కోసం సాయుధ మావోయిస్టులు గ్రామానికి వచ్చి, ఆయన లేకపోవటంతో పెద్ద కుమారుడు ఇస్సాక్ను తీసుకెళ్లారు. కన్నయ్య తమ వద్దకు వస్తేనే ఇస్సాక్ను విడిచి పెడతామని హెచ్చరించారు. కాగా పాస్టర్ కన్నయ్య ఆ రోజు నుంచి ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకోవటంతో ఇస్సాక్కు మావోయిస్టులు ఏదైనా ఆపద తలపెట్టి ఉంటారేమోనని అతడి కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మత బోధన చేసుకునే తమ కుటుంబానికి అపకారం తలపెట్టడం మావోయిస్టులకు ధర్మం కాదని, ఇస్సాక్ను క్షేమంగా విడిచిపెట్టాలని వేడుకుంటున్నారు. ఇస్సాక్ను విడిచి పెట్టేలా చూడాలని ప్రభుత్వ అధికారులను, పోలీసులను, మానవహక్కుల సంఘాల నేతలను అభ్యర్థిస్తున్నారు. కాగా పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలతో అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.