తూర్పుగోదావరి, వై.రామవరం: మన్యంలో(ఏఓబీలో) మరలా మావోయిస్టు పోస్టర్ల కలకలం చెలరేగింది. గతనెల 12న వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ, పలకజీడి గ్రామంలో సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఒక హెచ్చరిక పోస్టరు వెలసిన విషయం విదితమే. అయితే తిరిగి శుక్రవారం అదే గ్రామ శివారులో సీపీఐ(మావోయిస్టు) ఎంకేవీబీ డివిజన్ కమిటీ పేరున కొన్ని డిమాండ్లతో కూడిన పోస్టర్లు చింతచెట్లకు అతికించి దర్శనమిచ్చాయి. శుక్రవారం ఆ గ్రామంలో వారపు సంత కావడంతో, వాటిని చూసిన సంత నిర్వాహకులైన వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. గతనెలలో, ఈనెలలో రెండుసార్లు కూడా వారపు సంత రోజు శుక్రవారమే పోస్టర్లు దర్శనమివ్వడంతో వారపుసంత నిర్వహించే వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. చింత చెట్టుకు అతికించిన ఆ పోస్టర్ల ద్వా్డరా బాక్సైటు తవ్వకాలు, కాఫీతోటల సమస్యలు తదితర డిమాండ్లను ప్రభుత్వానికి అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 ఎన్నికల హామీలతో ప్రజలను అనేక విధాలుగా మోసగించాయని దుయ్యబట్టారు.
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న సీఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అదనపు బలగాల పోలీసులకు, స్టేషన్ సిబ్బందికి అడ్డతీగల సీఐ ఎ.మురళీ కృష్ణ సూచించారు. మండల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయన్న సమాచారం అందగానే శుక్రవారం ఉదయం సీఐమురళీకృష్ణ స్థానిక పోలీసుస్టేషన్‌కు చేరుకుని, సిబ్బందిని అప్రమతం చేశారు. స్టేషన్ భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారం మేరకు, అనుమానాస్పద ప్రదేశాల్లో, ప్రధాన రహదారిలో వచ్చిపోయే వాహనాలను సీఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో విస్తృతంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం మండల లోతట్టు గ్రామాలను సందర్శించి, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ క్లారెన్స్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment