మీరు మునిసిపాలిటీకి ఆస్తి పన్ను బాకీ ఉన్నారా? అయితే వీలైనంత త్వరగా చెల్లించండి. లేదంటే అధికారులు, సిబ్బంది మీ ఇంటి ముందుకు వచ్చి బైఠాయిస్తారు. మీరు రూల్స్ మాట్లాడితే ‘గంట’ కొడతారు. చీవాట్లు పెట్టి, భౌతిక దాడులకు దిగితే ‘డప్పు’ వాయిస్తారు. ఎక్కువమాట్లాడితే డబ్బు చెల్లించేదాకా ఇంటి వద్ద నుంచి కదలరు. ‘ఇదేంటి...డబ్బు బాకీ ఉంటే ఇలాంటి పనులు చేస్తారా? అనుకుంటున్నారా?’ మునిసిపాలిటీలలోని ఆస్తి పన్ను వసూళ్లకు అధికారులు రూపొందించుకున్న కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి మరి. మార్చిలోపు వంద శాతం వసూళ్లే లక్ష్యంగా అధికారులు ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
సాక్షిప్రతినిధి, అనంతపురం : మునిసిపాలిటీలలో ఆస్తి పన్ను వందశాతం సాధించాలని ఆశాఖ రాష్ట్ర కమిషనర్ మునిసిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది వందశాతం లక్ష్యం సాధించలేదని, ఈ ఏడాది గతేడాది బాకీలతో కలిపి పూర్తిగా బకాయిలు రాబట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈక్రమంలో రాయలసీమ రీజియన్ పరిధిలోని మునిసిపాలిటీలలో లక్ష్యసాధనకు అధికారులు వినూత్న చర్యలు అవలంభించనున్నారు. తద్వారా వందశాతం వసూళ్లు లక్ష్యంగా స్పెషల్ డ్రై వ్ చేపట్టారు.
రాయలసీమలో 5 నగరపాలక సంస్థలు, 33 మునిసిపాలిటీలు ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 142.76కోకోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయి. గతేడాది పాత బకాయిలు 24.95కోట్లు కలిపి మొత్తం 167.72కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గడిచిన 9 నెలల్లో కేవలం 87.55 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టారు.
రాబోయే మూన్నెళ్లలో 80.16కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేయాలి. 9 నెలల్లో 52.20శాతం వసూళ్లు చేసిన అధికారులు, ఉన్న తక్కువ సమయంలో 47.40శాతం వసూళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ డబ్బు వసూలు చేసేందుకు అధికారులు తీసుకోబోతున్న చర్యలు గమ్మత్తుగా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో రూ.35.89 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.20.44 కోట్లు మాత్రమే వసూలైంది. మిగతా రూ.15.45 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. ఈఏడాది బాకీ ఉన్న ప్రజల ఆస్తులు, వాహనాలను జప్తు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఈమేరకు ఆశాఖ రాష్ట్ర కమిషనర్ నుంచి పురపాలక కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆస్తి పన్ను వందశాతం పూర్తి చేయాలని నిర్దేశించుకోవడం, చాలా మునిసిపాలిటీల్లో 40 శాతం కూడా వసూళ్లు పూర్తి కాకపోవడం, గడువు మరో మూన్నెళ్లు మాత్రమే ఉండటంతో అధికారులు పన్ను వసూళ్లకు నడుంబిగించారు. ప్రత్యేక అధికారులతో ప్రతీ మునిసిపాలిటీకి మూడు బృందాలను నియమించనున్నారు. వీరు ప్రతీ బకాయిదారుడి ఇంటికి వెళతారు.
బకాయిదారుడు సున్నిత మనస్కుడై ఉంటే వారి ఇంటి ముందు సిబ్బంది బైఠాయిస్తారు. బకాయి చెల్లించేదాకా కదలరు.
బకాయిదారుడు రూల్స్ మాట్లాడి విసిగించే వ్యక్తి అయితే బకాయి చెల్లించేదాకా ఇంటి ముందు గంట వాయిస్తారు.
డబ్బు చెల్లించని మొండి ఘటాలు, చీవాట్లు పెట్టడం, భౌతిక దాడులకు దిగే వారి ఇంటి ఎదుట పన్ను వసూలయ్యేదాకా నాన్‌స్టాప్‌గా డప్పు వాయిస్తారు.
మునిసిపాలిటీలు పెరిగినా...ఆదాయం పెరగలేదు:
రెండేళ్ల కిందట 12 కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. పురపాలక సంఘాలు వే గంగా విస్తరిస్తున్నా అందుకు తగ్గ ఆదాయం పెరగడం లేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కొత్త నిర్మాణాల ఆస్తి పన్ను ముదింపు(అసెస్‌మెంట్) సక్రమంగా జరగకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. ఇళ్లకు తక్కువ ఆస్తి పన్ను ముదింపు చేసి ఇంటి యజమానుల నుంచి మునిసిపల్ సిబ్బంది ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
వందశాతం లక్ష్యసాధనకు ప్రజలు సహకరించాలి : మురళీకష్ణ గౌడ్, ఆర్డీ, మునిసిపల్ కార్పొరేషన్. మార్చిలోపు ఆస్తి పన్ను వందశాతం సాధించాలి. దీనికి ప్రజలు సహకరించాలి. మునిసిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం అవసరం. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించబోతున్నాం.. ప్రతీ బృందానికి సెక్షన్ ఆఫీసర్‌ను లీడర్‌గా నియమించాం.
మార్చి ఫాస్ట్!
Published Sun, Jan 4 2015 2:35 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement