సాక్షి, అనంతపురం : ప్రతి పేదవానికీ సొంతిల్లు ఉండాలన్నది మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కల. అయితే.. ఆయన మరణానంతరం సీఎంలుగా పగ్గాలు చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఇళ్ల నిర్మాణం పెద్దగా ముందుకు సాగలేదు. దీనిపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధ్యయనం ప్రారంభించింది. జిల్లాలో ఎన్ని ఇళ్లు మంజూరు చేశారు? పూర్తయినవి ఎన్ని? వీటికి ఎంత ఖర్చు చేశారు? మిగిలిన వాటికి ఎంత ఖర్చు అవుతుంది? అనే అంశాలపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నుంచి ప్రభుత్వం వివరాలు కోరింది.
ఇప్పటికే జిల్లాల వారీగా వివరాలు పంపిన అధికారులు అక్కడి నుంచి వచ్చే తాజా మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్‌తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుకూ ఆధార్‌కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధన పెడుతోంది. వివిధ దశల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ఏ సంవత్సరానికి ఇచ్చిన లక్ష్యాలు ఆ ఏడాదే పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలనే ఆదేశాలు కూడా జిల్లాకు అందినట్లు సమాచారం. గృహ నిర్మాణాలపై గురువారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల పీడీలతో ఆ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శి ఆధ్వర్యంలో సమీక్ష జరగనుంది.
ప్రారంభం కాని ఇళ్లు 16,500
జిల్లాలో 2005-06 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకం మూడు విడతలతో పాటు రచ్చబండల్లో వచ్చిన అర్జీల మేరకు 4,07,779 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 1,90,510 నిర్మించారు. మరో 76,869 వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికీ 16,500 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. బ్యాంకు ఖాతాలు లేక ఆన్‌లైన్‌లో పేర్లు నమోదుకాని వారు 21,034 మంది ఉన్నారు.
రూ.1,067.04 కోట్ల వ్యయం
పూర్తి చేసిన, వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం 1,067 కోట్ల 4 లక్షల 90 వేల 704 రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో లబ్ధిదారులకు ఆన్‌లైన్ ద్వారా జమ చేసిన మొత్తం 806 కోట్ల 56 లక్షల 60 వేల 487 రూపాయలు. అలాగే 1,05,40,577 సిమెంటు బ్యాగులు అందించేందుకు 156 కోట్ల 97 లక్షల 66 వేల 338 రూపాయలు వ్యయం చేశారు. స్టీలు తదితర మెటీరియల్ కోసం 51 కోట్ల 70లక్షల 49 వేల 60 రూపాయలు, కార్యాలయ ఖర్చుల కింద 51 కోట్ల 80 లక్షల 14 వేల 819 రూపాయలు ఖర్చు చేశారు.
నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదంటే..
గృహ నిర్మాణ శాఖకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరైనా ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా ముందుకు సాగకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంజూరు చేసిన పట్టాలకు ఇళ్ల స్థలాలు చూపకపోవడంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టలేకపోయారు. స్థలాలు చదును చేయడానికి నిధుల కొరత ఏర్పడటంతో మరికొందరు పొజిషన్ తెలియక నిర్మాణాలు చేపట్టలేదు.
ఇళ్లపై నీలినీడలు
Published Wed, Jul 30 2014 2:46 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement