రాజన్న యజ్ఞం .. జలాసురులతో విఘ్నం
- సాకారం కాని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి
- భారీ ప్రాజెక్టును పట్టించుకోని కిరణ్ ప్రభుత్వం
- కేటాయించినా మంజూరు కాని నిధులు
నర్సీపట్నం, న్యూస్‌లైన్: రైతే దేశానికి వెన్నెముక... కర్షకులు సుభిక్షంగా ఉంటేనే అందరికీ మేలు జరుగుతుం ది... అనేవారు వైఎస్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జలయజ్ఞం చేపట్టి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశా రు. ఆయన దివంగతులయ్యాక రైతును విస్మరించిన ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిర్లక్ష్యం చేసింది. ఆ ప్రాజెక్టును పక్కనపెట్టడంతో మూడు జిల్లాల రైతులు వరుణ దేవుడి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.
చంద్రబాబు పాలనలో..
తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రైతును నిర్లక్ష్యం చేశారు. రైతు అభివృద్ధిని పక్కనపెట్టి వ్యవసాయం దండగంటూ ప్రసంగాలిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఉత్తరాంధ్రలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు సైతం కృషి చేయలేదు. గతంలో ఏర్పాటు చేసిన మేజర్, మైనర్ నీటివనరులను సైతం నిర్లక్ష్యం చేసి, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు విషయాన్ని పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేయడంతో ప్రతి ఏటా నష్టపోతూ అప్పులపాలయ్యారు.
వైఎస్సార్ హయాంలో..
ఇలాంటి పరిస్థితుల్లో మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చి జలయజ్ఞం ప్రారంభించి, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2008లో సుజల స్రవంతి ప్రాజెక్టుకు నర్సీపట్నంలో తొలి అడుగు పడింది. ఆ రోజున వైఎస్సార్ ప్రాజెక్టును ప్రకటించి 2009 జనవరి 2న పరిపాలన ఆమోదంతో ప్రత్యేక జీవో విడుదల చేశారు. ఈ ప్రాజెక్టునకు రూ. 7,214.10 కోట్లు ఖర్చు కానున్నట్టు అంచనా వేశారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది సుజల స్రవంతి ఉద్దేశం. మూడు జిల్లాల్లో 1037 గ్రామాల్లోని 32 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. విశాఖ జిల్లాలోని రావికమతం, కె.కోటపాడు, విజయనగరం జిల్లాలో వేపాడ, బొండపల్లి ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి మెట్ట భూములకు సాగునీరు అందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. వీటి నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను కేటాయించేందుకు అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు విశాఖ నగరంలోని పరిశ్రమలకు 4.74 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని భావించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే మూడు జిల్లాల్లో 12.32 మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని నిర్ధారించారు.
మహానేత మరణంతో నిర్లక్ష్యం
రాజన్న బతికి వుంటే ఈసరికే ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరేవి. ఏటా సముద్రం పాలవుతున్న 400 టీఎంసీల గోదావరి జలాలు సద్వినియోగమయ్యేవి. ఈ వృధా నీటిని మళ్లిస్తే బీడు భూముల్లో సిరులు పండించుకోవచ్చని భావించి ఈ పథకానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ఆయన దివంగతుడయ్యాక ప్రాజెక్టు నిర్మాణంపై కిరణ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడు దఫాలుగా రూ. 50 కోట్లు, రూ. 70 కోట్లు, రూ.10 కోట్లు కేటాయించినా, నిధుల మంజూరును పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇదేకాకుండా ప్రాజెక్టునే రద్దు చేస్తామని 2013 బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపిందంటే దీనిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది. అప్పట్లో కాగ్ నివేదిక సైతం ఈ విషయంలో ప్రభుత్వ నిర్వాకాన్ని తీవ్రంగా విమర్శించింది. సాగు భూములు సస్యశ్యామలం అవుతాయని కలలుగన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను ప్రస్తుత పాలకులు అడియాసలు చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇటీవల అమల్లోకి వచ్చిన ఈపీసీ విధానంలో ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఈ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పనులు ప్రారంభిస్తామంటూ డాంబికాలు పలుకుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమ కలలు నెరవేరుతాయని రైతులు ఆశిస్తున్నారు.