మగ్గం.. ఛిద్రం
చేనేత రంగం కుదేలు అవుతున్న రోజులవి. ఎందరో కార్మికులు మగ్గాన్ని వదిలి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లారు. మరి కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవన్ని చూస్తూనే ఉన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నలకు బతుకుపై భరోసా కల్పించలేకపోయారు. అలాంటి నేత మళ్లీ తానే ముఖ్యమంత్రినైతే చేనేత రంగం రూపు రేఖలు మారుస్తానని, చేనేతల రుణాలను మాఫీ చేస్తానని ప్రకటిస్తున్నారు. మళ్లీ అధికారం మాట ఓటరు దేవుళ్లకెరుకుగానీ.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి చేనేత రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా బాబూ అంటూ.. నేతన్న ప్రశ్నిస్తున్నాడు.
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: ఎమ్మిగనూరుకు చేనేత పురిగా కూడా మరో పేరు. ఇక్కడ వ్యవసాయ తర్వాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చేనేత. కుర్ణి, సాలే, దూదేకుల, రజక, మైనార్టీ కులాల్లో ప్రధానంగా చేనేత వృత్తినే మెజార్టీ కుటుంబాలు ఎంచుకున్నాయి. ఎమ్మిగనూరు పరిసర ప్రాంతంలోని గుడేకల్, గోనెగండ్ల, నందవరం, నాగులదిన్నె, కోడుమూరు మరో నాలుగు వేల కుటుంబాలు నేడు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో నేతన్న బతుకులు మరింత దిగజారాయి. చేయూత నివ్వాల్సిన చేనేత సొసైటీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉపాధిని చూపే స్పిన్నింగ్ మిల్లు మూతపడింది. ఆదుకోవాల్సిన సర్కార్ అలసత్వం ప్రదర్శించడంతో చేనేత రంగం జవసత్వాలు కోల్పోయింది.
బాబు జమానాలో ఐదుగురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా 38 మంది స్పిన్నింగ్ మిల్లు కార్మికులు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందారు. ఆదరణ పథకం కింద బాబు జమానాలో కొంతమందికి చేనేత మగ్గాలను పంపిణి చేసినా అవి కూడా దళారుల దోపిడీకి గురైయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి, నమ్ముకున్న వృత్తిలో గట్టెక్కలేక సుమారు 3వేల మంది కార్మికులు ప్రత్యాన్మయ రంగంలోకి వెళ్లారు. మహిళా కార్మికులు హోటళ్లల్లో, ఇళ్లలో పని మనుషులుగా, పురుషులు లాడ్జిలలో రూం బాయ్‌లుగా హోటళ్లలో సర్వర్లుగా, పరిశ్రమలలో వాచ్‌మెన్‌లుగా కొంతమంది చేరితే ఎక్కువ మంది బెంగళూరు, ముంబాయి, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు.
చేయూతనిచ్చిన వైఎస్ సర్కార్: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగానికి వైఎస్ పాలన వరమైంది. వృద్ధాప్య పెన్షన్‌ను చేనేత కార్మికులకు 50 ఏళ్లకే ఇచ్చేలా జీవో జారీ చేసింది. టీడీపీ హయాంలో ఎమ్మిగనూరుకు చెందిన 298 మంది 60 సంవత్సరాలు పైబడిన కార్మికులు పెన్షన్లు పొందితే వైఎస్ హయాంలో నెలకు రూ. 200 చొప్పున 50 ఏళ్లు దాటిన 1586 మంది చేనేతలకు పెన్షన్ సదుపాయం దొరికింది. క్లస్టర్ స్కీంలను ఏర్పాటు చేసి కార్మికులకు అవసరమైన నూలు, ముడి సరుకులను క్లస్టర్ ద్వారా ప్రభుత్వం పంపిణి చేసింది. ఆర్టీజన్ కార్డు, రుణ అర్హత కార్డులను జారీ చేసి కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు రుణ సదుపాయాలను కూడా కల్పించింది. వైఎస్ చొరవతో ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీకి చెందిన రూ. 3.5కోట్లు రుణాలు, చేనేతలకు చెందిన 16.78లక్షల వ్యక్తిగత రుణాలు మాఫీ అయ్యాయి. మహానేత వైఎస్ మరణాంతరం చేనేతల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. బాబు పాలనకు బ్లూ ప్రింట్‌గా కొనసాగిన కిరణ్ సర్కార్ సంక్షేమాన్ని, సంస్థల్ని నిర్వీర్యం చేేసిందనీ నేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.