ఎవరైనా మరణిస్తేనే కొత్తవారికి పింఛన్ !
వృద్ధులు, వికలాంగులు, వితంతు పింఛన్లలో ‘సంతృప్త’తకు చెల్లుచీటీ
మానవత్వం మరిచిన సర్కారు.. చంద్రబాబు బాటలో పయనం..
సాక్షి, హైదరాబాద్: వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్‌కోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే మీ ఆశ నెరవేరాలంటే.. ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారిలో ఎవరైనా మరణించాల్సిందే. ఇది వింటే.. చంద్రబాబు పాలన గుర్తుకొస్తుందా? మీరనుకునేది కరెక్టే. ప్రస్తుతం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు అక్షరాలా చంద్రబాబు ఆచరించిన నాటి పాలసీనే అనుసరిస్తోంది. ఈ విషయంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పట్ల చూపాల్సిన కనీస మానవత్వాన్ని కూడా మరచిపోయింది. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు, ఈ విషయంలో ఆయన అనుసరించిన ‘సంతృప్త’ విధానానికి చెల్లుచిటీ ఇచ్చేసింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్యాచురేషన్(సంతృప్త) విధానంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా.. 2004లో తాను అధికారంలో వచ్చేసరికి 18 లక్షలమందికి మాత్రమే పింఛన్లు అందుతుండగా.. ఆ తరువాత ఆయన 72 లక్షల మందికి పింఛన్లను మంజూరు చేశారు. ఎప్పటికప్పుడు అర్హులైన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలనేది వైఎస్ విధానంగా ఉండేది.
ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. వైఎస్ హయాంలోని 72 లక్షల పింఛన్ల సంఖ్య పెరగకుండా.. అందులో ఎవరైనా మృతి చెందితేనే కొత్తవారికి పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తోంది.
ప్రతినెలా 23 వేల నుంచి 25 వేల మంది వృద్ధులు మృతిచెందుతూ ఉంటారు. కనీసం ఒక నెలలో మృతి చెందినవారి స్థానంలో అంతమందికి కూడా కొత్తగా పింఛన్లను మంజూరు చేయట్లేదు.
2011 సంవత్సరం నవంబర్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో 8.67 లక్షల మంది అర్హులని తేల్చారు.
గత నవంబర్ నాటికి పింఛన్లు పొందుతూ మృతి చెందినవారి సంఖ్య 8.50 లక్షలకు చేరింది. దీంతో ఆ మేరకు అదే నెలలో నిర్వహించిన రచ్చబండలో 8.34 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశారు. అంటే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రెండేళ్లపాటు ఆగాల్సి వచ్చింది.
అయితే గత నవంబర్‌లో నిర్వహించిన రచ్చబండలో కొత్తగా పింఛన్లకోసం 9.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు పింఛన్లు పొందుతున్న వారిలో కొంతమంది మృతి చెందేవరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.