కదం తొక్కిన రైతులు
నూతన మద్యం విధానంపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం
‘ఇంటికో బీరు-ఊరికో బారు’ అనే చందంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకు వచ్చిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదని, ఆయన బెల్టుషాపుల అధ్యక్షుడని విమర్శించారు. రైతు సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న సర్కార్‌కు పుట్టగతులుండవని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్‌లకు చెక్కుపవర్ ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు.
పట్నంబజారు : రాష్ట్ర సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రైతులు కదం తొక్కారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ చేపట్టకపోవడంపై మండి పడ్డారు. వేరుశెనగ, పత్తి, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం కృషి చేయకపోవడాన్ని తప్పుపట్టారు. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన రైతు రుణమాఫీ విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం, కృష్ణా జలాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఇలా ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ వైఎస్సార్ సీపీ నిర్వహించిన ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా కేంద్రమైన గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట గురువారం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జిల్లాలోని 17 నియోజకవర్గాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ధర్నా కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు జరింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ నేతలు తమ మాటల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమించాలని నినదించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనటం విశేషం.
ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ధర్నా చేపట్టిన ప్రాంగణం రైతులు, పార్టీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, షేక్ మొహమ్మద్‌ముస్తఫాలతో పాటు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కేంద్ర కార్య నిర్వాహకమండలి సభ్యులు రావి వెంకటరమణ, నగారాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, తెనాలి, వేమూరు, వినుకొండ, సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, మేరుగ నాగార్జున, బొల్లా బ్రహ్మనాయుడుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతులు, నేతలు తరలివచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌వ్వో కె. నాగబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల నేతలు రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), ఆతుకూరి ఆంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, ఎండీ నసీర్‌అహ్మద్, మామిడి రాము, షేక్ ఖాజావలి, శిఖాబెనర్జీ, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, మొగిలి మధు, సయ్యద్‌మాబు, కోవూరి సు నీల్‌కుమార్, ఉత్తమ్ రెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, కేసర వెంకటసుబ్బారెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, మ ర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, పానుగంటి చైతన్య, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, షేక్ జానీ, ఆవుల సుందర్‌రెడ్డి, మండే పూడి పురుషోత్తం, ఝాన్సీరాణి విజయసారథి, చింకా శ్రీనివాసరావు, చందోలో విజయ్‌కుమార్, బడాగిరి నాగరాజు, అత్తోట జోసఫ్, సుజతాపాల్, శారదాలక్ష్మీ, ఆనం రఘురామిరెడ్డి, ఆరుబండ్ల కొండారెడ్డి, డి. ప్రభా కర్‌రావు, పెరికల కాంతారావు, మెహమూద్, కడియాల శ్రీనివాసరావు, యేరువ నర్సిరెడ్డి, బోడపాటి కిషోర్, రాచకొండ ముత్యాలరాజు, సుద్దపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో ఎవరేమన్నారంటే..
► ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు సమస్యలు పట్టకుండా నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసి లేపాల్సిన అవసరం ఉందన్నారు. గత సంవత్సరం రూ. 76లక్షల కోట్లు రుణాలు ఉంటే ప్రస్తుతం అవి రూ .లక్ష కోట్లు అయ్యాయని తెలిపారు.
► నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరావురెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో బీజీపీ సీనియర్ నేత అద్వానీ దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చే ప్రమాదం లేకపోలేదన్నారని, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కచ్చితంగా వచ్చాయని చెప్పారు.
► బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఇప్పటి వరకు ఎరువులు, విత్తనాలు ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు.
► గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు సువర్ణయుగాన్ని అనుభవిస్తే, ప్రస్తుత ప్రభుత్వంలో నరకంలో ఉన్నట్లు భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
► రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభం అయినప్పటికీ రైతుల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించకుండా బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని చెప్పటం చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనమన్నారు.
► పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వానికి మద్దతునిస్తూ అధికారులు సైతం పచ్చచొక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
► పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రజా, రైతు, కార్మిక సమస్యలను పక్కనబెట్టి ఓటుకు కోట్లు కేసులో ఎలా బయటపడాలనే ఆలోచనల్లో చంద్రబాబు తలమునకలవుతున్నారని ఎద్దేవా చేశారు.
► కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు రావి వెంకటరమణ మాట్లాడుతూ రైతుకు బిచ్చం వేసిన విధంగా మద్దతు ధర కల్పించటం సిగ్గుచేటన్నారు.
► గుంటూరు నగర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కనీసం ఖరీఫ్ సీజన్‌పై అధికారులతో సమీక్షించకుండా రేవంత్‌రెడ్డి కేసులో బయట పడాలనే ధ్యాసలోనే టీడీపీ నేతలంతా బతుకుతున్నారని మండిపడ్డారు.
► తెనాలి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడులు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడే రైతులు సుభిక్షంగా ఉంటారన్నారు.
► జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి మాట్లాడుతూ రైతు, మహిళలను చంద్రబాబు పూర్తిగా వంచించారని ఆందోళన వ్యక్తం చేశారు.
► యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ హయాంలో రూ. 72వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.