కామారెడ్డి, న్యూస్‌లైన్ : పెళ్లి పందిరి విప్పకముందే నూతన వధూవరుల మధ్య కలతలు రేగుతున్నాయి. ఇంటికి వేసిన రంగులు వెలసిపోకముందే వైవాహిక బంధాలు బీటలు వారుతున్నాయి. పెళ్లి సందడి తగ్గకముందే ఏడడుగుల బంధాన్ని తెంపేస్తున్నారు. మూడుముళ్ల బంధం గొప్పతనం తెలుసుకోకముందే విడాకులబాట పడుతున్నారు. అయితే పరిష్కారంలేని సమస్యలతో కాకుండా చిన్నచిన్న గొడవలకే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. చాలా మంది పంతాలకు పోయి కోర్టు గడప తొక్కడమో, పెద్దలను ఆశ్రయించి ఇడుపు కాగితం రాయించుకోవడమో చేస్తున్నారు. కొందరు ఆవేశంలో ఆత్మహత్యలకు పా ల్పడడమో, హత్యలకు ఒడిగట్టడమో చేస్తున్నారు. జిల్లాలో 25,51,335 జనాభా ఉండగా, 6.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఏటా ఇరవై వేల వరకు వివాహాలు జరుగుతుండగా అందులో ఐదు వందలకుపైగా జంటలు విడాకులు పొందుతున్నట్లు సమాచారం. పోలీసు స్టేషన్ల ద్వారా కొందరు, కోర్టుల ద్వారా ఇంకొందరు, కుల సంఘాల ద్వారా మరిందరు వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఒక్క కామారెడ్డి కోర్టులోనే ఏడాది కాలంలో 120కి పైగా విడాకుల కేసులు నమోదయ్యాయి.
ఎందుకిలా?
భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం, ఓర్పు, సహనం లోపించడం వంటి కారణాలతో చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు.
యువతీ యువకులు వైవాహిక జీవితంపై పెళ్లికి రకరకాల కలలు కంటారు. తన జీవిత భాగస్వామిని హీరోగానో, హీరోయిన్‌గానో ఊహించుకుంటారు. పెళ్లి తర్వాత పరిస్థితి అలా లేకపోయేసరికి మనసు గాయపడి తరచూ గొడవ పడుతుంటారు.
అనుమానం పెను భూతంగా మారుతోంది. భార్యపై భర్త, భర్తపై భార్య అనుమానం పెంచుకుంటున్నారు. దీంతో అనుబంధం దెబ్బతింటోంది.
వైవాహిక బంధాలు తెగిపోవడంలో గల్ఫ్‌కు వలసబాట పాత్ర ఎంతో ఉంది. పెళ్లయిన వెంటనే ఉపాధి కోసం దేశాలు పట్టిపోతుండడంతో వీరి మధ్య అనుబంధం తగ్గుతోంది. వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి.
భార్యాభర్తలు ఉద్యోగులైన సందర్భంలో మరోరకమైన సమస్య తలెత్తుతోంది. తాను సంపాదిస్తున్నా ఆర్థిక పరమైన స్వేచ్ఛ ఇవ్వడం లేదన్న కారణంతో పలు కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి.
బంధువుల విషయంలోనూ దంపతులు గొడవపడుతున్నారు. తమవారిని నిర్లక్ష్యం చేస్తున్నావని భా ర్యాభర్తలు పరస్పరం వాదులాటకు దిగుతున్నారు.
సర్దుకుపోతే..
దంపతులిద్దరూ మొండి వైఖరిని వీడాలి. ఏ సమస్య వచ్చినా ఇరువురు కూర్చుని సావధానంగా చర్చించుకుంటే గొడవ పెద్దది కాకుండా చూసుకోవచ్చు.
ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడాన్ని మానుకోవాలి. పక్కవారితో పోల్చి కుటుంబంలో కలతలు సృష్టించుకోవద్దు. తమ స్థాయినిబట్టి మసలుకోవాలి.
ఇద్దరూ సంపాదిస్తున్నపుడు ఎవరి సంపాదనైనా ‘తమ కుటుంబానిదే’ అన్న భావనతో వ్యవహరించాలి. ఖర్చుల విషయంలో ఆలోచించుకుని మెదలుకోవాలి. సంపాదనలో కొంతభాగాన్ని ఇరువురి ఇష్టప్రకారంగా పొదుపు చేసే ప్రయత్నం చేయాలి.
భార్యాభర్తల మధ్య ఏవైనా పొరపొచ్చాలు వచ్చినపుడు పెద్దవాళ్లకు చెప్పడమో, ఇరుగుపొరుగు వారి దృష్టికి తీసుకెళ్లడమో చేయొద్దు. ఇద్దరూ ప్ర శాంతంగా వ్యవహరించాలి. గొడవలో తమ తప్పెం తో తెలుసుకుని, సర్దుకుపోయే ప్రయత్నం చేయాలి. కుటుంబ వ్యవహారాల్లో బంధువులు తలదూర్చడం వల్ల వివాదాలు పెరుగుతున్నాయి. అందుకే తమ మధ్య ఏర్పడే చిన్నచిన్న గొడవలు బంధువులకు తెలియకుండా జాగ్రత్త పడాల్సి. లేదంటే వారు వాటిని ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తారు.
పిల్లల ముందే తగవులాడుకుంటే ఆ ప్రభావం వారి మానసిక స్థితిపై పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రుల గొడవలు పిల్లలను కలిచివేస్తాయని గుర్తుంచుకోవాలి. అమ్మానాన్నలు ఎప్పుడూ పోట్లాడుతుంటే వారు చదువుపై దృష్టి పెట్టరు. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని అర్థం చేసుకోవాలి.
అవగాహన పెంచుకుంటే..
భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడంతోనే బంధుత్వాలు తెగిపోతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు పెద్దవారు నచ్చచెప్పేవారు. పెద్దలంటే గౌరవ భావం ఉండడంతో వారూ సర్దుకుపోయేవారు. ఇప్పుడు చిన్నకుటుంబాల్లో పెద్దల మాటకు విలువ లేకుండాపోయింది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం, అవగాహన పెంచుకుంటే సమస్యలు దూరమవుతాయి. వైవాహిక జీవితంలో ఏర్పడిన దూరాన్ని కౌన్సెలింగ్ ద్వారా తగ్గించవచ్చు.
-నిమ్మ దామోదర్‌రెడ్డి,
న్యాయవాది, కామారెడ్డి
అహాన్ని తొలగించుకుంటే..
చిన్న వయసులో పెళ్లిళ్లు చేయ డం ఒక కారణమైతే, పెళ్లైన కొంత కాలానికే వేరు కాపురాలు పెట్టడం వల్ల బంధా లు, బంధుత్వాల గురించి తెలియ డం లేదు. చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. అనుబంధాన్ని పెంచుకోవాల్సినవారు అహంతో వైవాహిక జీవితంలో అగాథాన్ని పెంచుకుంటున్నారు. విడాకుల దాకా వెళుతున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకొంటూ, నేనేం తక్కువ అనే భావనను దూరం చేసుకుంటే బంధం నిలబడుతుంది. పిల్లలకు బంధుత్వాల విలువ తెలిసేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి.
-సురేందర్‌రెడ్డి, డీఎస్పీ, కామారెడ్డి
అర్థం చేసుకుంటే..
ఇష్టం లేని పెళ్లిళ్లు, సినిమా జీవి తాన్ని ఊహించుకోవడం, అ హం, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వైవాహిక బంధం తెగిపోవడానికి కారణాలవుతున్నాయి. సంసార సుఖం పొందలేనివారు ఎక్కువగా విడాకులను ఆశ్రయిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగి న పరిశోధనల్లో తేలింది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పు డు భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే చెప్పుకునేందుకు పెద్దలు ఉండేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రశాంతం గా మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. -కేశవులు, మానసిక వైద్యుడు, ఇందూరు
మూడు‘ముళ్లు’
Published Sun, Oct 20 2013 6:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement