50 ఏళ్లొచ్చాయి మళ్లీ మొగుడ్ని వెతుకు.. నటిపై కంగన ఘాటు వ్యాఖ్యలు | Kangana Ranaut Takes A Dig At Ben Affleck Jennifer Lopez Divorce | Sakshi
Sakshi News home page

50 ఏళ్లొచ్చాయి మళ్లీ మొగుడ్ని వెతుకు.. నటిపై కంగన ఘాటు వ్యాఖ్యలు

Published Thu, Feb 27 2025 2:08 PM | Last Updated on Thu, Feb 27 2025 5:01 PM

Kangana Ranaut Takes A Dig At Ben Affleck Jennifer Lopez Divorce

బాలీవుడ్‌లో కంగనా రనౌత్ (Kangana Ranaut) బాగా స్పెషల్‌. నటనా పరంగా ఎంచుకునే పాత్రలు మాత్రమే కాదు నిజజీవితంలోనూ ఫైర్‌ బ్రాండ్‌గానే కనిపిస్తుంది. తన వాగ్భాణాలతో ఆనేకసార్లు వార్తల్లో నిలిచిన కంగన ఇప్పుడు దేశంలో, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో నడుస్తున్న విడాకుల ట్రెండ్‌ మీద విరుచుకుపడింది. తరచుగా భారతీయతను ప్రస్తుతిస్తూ మాట్లాడే కంగన... ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని వివరించడం విశేషం. మన దగ్గర భార్యాభర్తల బంధాలు ఎంత బలమైనవో చెప్పేందుకు ఆమె పాశ్చాత్య దేశాలతో పోల్చారు. దీని కోసం తాజాగా పాప్‌ స్టార్, హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ (Jennifer Lopez) విడాకులు తీసుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు.

జెన్నిఫర్‌ లోపెజ్‌ మరో హాలీవుడ్‌ (Hollywood) టాప్‌ స్టార్‌ బెన్‌ అఫ్లెక్‌ను 2022లో వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా విడాకులు (Divorce) తీసుకున్నారు. తమ రెండేళ్ల వివాహాన్ని ముగించాలని లోపెజ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత ఫిబ్రవరి 21న విడాకులు అమలులోకి వచ్చాయి. జనవరిలో లాస్ఏంజెలస్‌ కోర్టు ఆమోదించిన తర్వాత జెన్నిఫర్‌ లోపెజ్‌ తన పేరు నుండి ‘అఫ్లెక్‌‘ని తొలగించింది. నిజానికి లోపెజ్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం ముందే వారు విడిపోయారు. అంటే వీరిద్దరూ పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. అఫ్లెక్‌కు మాజీ భార్య జెన్నిఫర్‌ గార్నర్‌ (Jennifer Garner)తో ముగ్గురు పిల్లలు, లోపెజ్‌కు మార్క్‌ ఆంథోనీతో కవల పిల్లలు ఉన్నారు.

వీరి ఉదంతాన్ని కంగన తన ఇన్‌స్ట్రాగామ్‌ పోస్ట్ లో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ పాప్‌ ఐకాన్‌లలో ఒకరైన జెన్నిఫర్‌ లోపెజ్‌– బోలెడంత కీర్తి, పుష్కలంగా సంపద జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్న విషయాన్ని కంగన ఎత్తి చూపింది. ఎందరో మగాళ్లతో సంబంధాలు పెట్టుకుని పలు మార్లు పెళ్లిళ్లు చేసుకున్న లోపెజ్‌ ఇప్పుడు వయసు యాభై దాటాక కూడా సరైన జీవిత భాగస్వామిని వెదుక్కుంటూనే ఉందనే విషయాన్ని కంగన ప్రస్తావించింది. 

ఈ సందర్భంగా ఆమె సాంప్రదాయ భారతీయ వివాహాలను పాశ్చాత్యులు ఎగతాళి చేయడాన్ని తప్పుపట్టిం. 'వారు భారతీయ వివాహాలను ఎగతాళి చేసినప్పుడల్లా ఇది గుర్తుంచుకోవాలి. అత్యంత తెలివైన/మంచిగా కనిపించే నటుడు/చిత్రనిర్మాత/రచయిత, భూమిపై అత్యంత హాటెస్ట్‌ మ్యాన్‌ అని ఎందరో పొగిడే బెన్‌ అఫ్లెక్‌... పిల్లలు పుట్టినా, పెళ్లిళ్లు చేసుకున్నా, ఇప్పటికీ పరిపూర్ణ భార్య కోసం ఎదురుచూస్తున్నాడనీ, అలానే జెన్నిఫర్‌ లోపెజ్‌ కూడా స్వీయ నిర్మిత ధనవంతురాలు, గొప్ప పాప్‌ స్టార్‌లలో ఒకరైనా ఇప్పటికీ ఓ పరిపూర్ణ వ్యక్తి కోసం వెతుకుతున్నారనీ... వీరిద్దరూ ఎవరికి వారే గొప్ప కాబట్టి వారికి ఎవరూ సరిపోరు కాబట్టి కొంతకాలానికే కనపడే లోపాలతో విసిగిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ప్రమాణాలు చేసి, కొన్ని నెలల వ్యవధిలోనే బ్రతుకు జీవుడా అంటూ వ్యతిరేక దిశల్లో పరుగెత్తారు' అంటూ కంగన ఎద్దేవా చేసింది.

ఈ సందర్భంగా కంగన తన వ్యక్తిగత అనుభవాల నుంచి తన పరిశీలనలను కూడా పంచుకుంది, పాశ్చాత్య సమాజం తరచుగా ‘పరిపూర్ణ‘ మ్యాచ్‌ కోసం శాశ్వత అన్వేషణను ఎంచుకుంటుందని  వెల్లడించింది. అక్కడ వ్యక్తులు సాహచర్యాన్ని కనుగొనడానికి డేటింగ్‌ యాప్‌లపై ఆధారపడతారనీ, అయితే భారతీయ ఆచారాలు దీనికి విరుద్ధమని చెప్పింది. మన దేశంలో అపరిచితులను వివాహం చేసుకున్నా కూడా  వృద్ధాప్యంలో  ఒకరినొకరు చేతులు పట్టుకుని కలిసి నడిచే లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారని ఆమె పొగడ్తలు గుప్పించింది. 

చ‌ద‌వండి: నటుడి లవ్‌ మ్యారేజ్‌.. పిల్లల కోసం ఆలోచించేలోపు విడాకుల దిశగా..

‘‘పాశ్చాత్య దేశాలలో సంబంధాలు తరచుగా తాత్కాలికంగా మారతాయనీ అయితే, భారతదేశంలో బలమైన సంప్రదాయాల పునాదులపై నిర్మించిన వివాహాలు జీవితకాలం కొనసాగుతాయనీ అన్నారామె. 80 ఏళ్ల వయస్సులో కూడా వృద్ధ జంటలు చేతులు జోడించి విహరించడాన్ని చూస్తున్న మనం పాశ్చాత్య ఆదర్శాలను ఆరాధించే బదులు, కాలక్రమేణా కొంత బలహీనపడినా మన స్వంత సాంస్కృతిక విలువలను పునరుద్ధరించుకోవాలనీ పాశ్చాత్య దేశాల నుంచి మార్గదర్శకత్వం పొందడం మానుకోవాలనీ హితవు చెప్పింది. గతంలో కూడా కంగన బాలీవుడ్‌ సినిమాల్లో వివాహ చిత్రణ గురించి తన ఆందోళనలను వ్యక్తం చేసింది. వివాహ సంబంధాల సారాంశాన్ని బాలీవుడ్‌ ప్రేమకథలు తప్పుగా సూచిస్తున్నాయని ఆమె విమర్శించింది.

చ‌ద‌వండి: కొన్నేళ్లుగా మాటల్లేవ్.. విడాకులకు కారణం ఇదేనా?

కంగన చివరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ చిత్రం చలనచిత్ర విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలను దక్కించుకుని బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆమె తన తదుపరి చిత్రంలో మాధవన్‌తో కలిసి నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement