
వివాహిత ఆత్మహత్య
కొంతేరు (యలమంచిలి), న్యూస్‌లైన్ : అత్త ఆరళ్లు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతేరు గ్రామానికి చెందిన త్సవటపల్లి బాలకృష్ణకు భీమవరం మండలం గునుపూడికి చెందిన గీత(27)తో మూడే ళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసు కుమార్తె ఉంది. వివాహమైన నాటి నుంచి గీతను ఆమె అత్త పద్మావతి అదనపు కట్నం కోసం వేధించేది. అమ్మ మాటలు విని భర్త కూడా ఆమెను వేధించేవాడు. శనివారం వారి కుమార్తె సునంద పుట్టినరోజు కావడంతో బాలకృష్ణ కేక్, బిస్కట్స్, చాక్‌లెట్స్ తీసుకువచ్చాడు.
అయితే ఇల్లు కడిగే విషయంలో అత్తాకోడళ్లకు శుక్రవారం రాత్రి తగాదా జరిగింది. దీంతో గీత తన భర్త మోటార్‌సైకిల్‌లో వేసుకునేందుకు బాటిల్‌తో తీసుకువచ్చి ఇంట్లో ఉంచిన పెట్రోల్‌ను శనివారం వేకువ జామున వంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే ఆమెను పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మేజిస్ట్రేట్‌కు ఆమె వాగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళుతుండగా మార్టేరు వద్ద ఆమె మరణించింది. తహసిల్దార్ చాగలకొండు గురుప్రసాదరావు, డీఎస్పీ రఘువీర్‌రెడ్డి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు