
కర్నూలు / రాంకొండ(తుగ్గలి): నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని బాస చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. రెండోసారి ఆడబిడ్డకు జన్మినిచ్చిందని వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ అబల ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన సోమవారం తుగ్గలి మండలం రాంకొండ గ్రామంలో చోటు చేసుకుంది. తుగ్గలి ఎస్‌ఐ కేశవ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రాంకొండకు చెందిన కాశీం కూతురు చామంతి అలియాస్ లావణ్యను (22) మూడేళ్ల క్రితం డోన్ మండలం కొచ్చెర్వుకు చెందిన రామాంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు.
వీరికి మొదట సంతానం కూతురు. అప్పటి వరకు దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. మూడు నెలల క్రితం పుట్టింట్లో చామంతి రెండో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మినిచ్చింది. దీంతో జీర్ణించుకోలని భర్త రామాంజనేయులు భార్యను వేధింపులకు గురి చేశాడు. సోమవారం ఊరికి వచ్చిన భర్త ఇంటికి కూడా రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురై ఎవరూ లేని సమయంలో తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన ఇంటి చుట్టు పçక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతురాలి తండ్రి కాశీం ఫిర్యాదు మేరకు రామాంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment