
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాధ
కర్నూలు, చాగలమర్రి: క్షణికావేశం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. తెలిసీతెలియని ఇద్దరి చిన్నారులూ అందులో పావులు కావడం పలువురిని కలిచివేసింది. మండల పరిధిలోని డి.వనిపెంట గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన చిన్నసుబ్బరాయుడికి తిరుపాల్, భైరవ, కొండయ్య కుమారులు. పెద్ద కుమారుడు తిరుపాల్‌కు మొదటి భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో ఆరేళ్ల క్రితం రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆకుల రాధ(25)ను రెండో వివాహం చేసుకున్నాడు.
వీరికి కూతురు తేజ(5), కుమారుడు ఈశ్వర్(3) ఉన్నారు. ఉమ్మడి కుటుంబం కావడంతో రాధ ఇమడలేక కొంతకాలంగా వేరుకాపురం పెడదామని కోరుతున్నా భర్త సర్దిచెబుతూ వస్తున్నాడు. ఇదే విషయమై బుధవారం తెల్లవారుజామున భార్య, భర్తల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. మనస్తాపం చెందిన రాధ కూతురు తేజకు, కుమారుడు ఈశ్వర్‌కు గడ్డి మందు తాపి తానూ తాగింది. ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చాగలమర్రి కేరళా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment