
చికిత్స పొందుతున్న మీసమ్మ
బొమ్మలసత్రం: ముగ్గురు ఆడపిల్లలకు జన్మనివ్వటమే ఆమె పాలిట శాపమైంది.. మూడు రోజులుగా ఆమెకు అన్నం, నీళ్లు ఇవ్వకుండా భర్త గృహ నిర్బంధంలో ఉంచాడు. చివరికి బంధువుల రాకతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలుకు చెందిన మీసమ్మకు, బేతంచర్ల మండలం సిమెంట్‌నగర్‌కు చెందిన సుధాకర్‌తో 18 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురూ ఆడపిల్లలు పుట్టడంతో భార్యను భర్త వేధింపసాగాడు. పదేళ్ల కిందట సుధాకర్.. భార్య, పిల్లలతో కాపురాన్ని నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రానికి మార్చి ఓ టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. పిల్లలకు, తనకు మాత్రమే భోజనం వండుకుని భార్యను పస్తులుంచేవాడు.
విషయం తెలుసుకున్న మీసమ్మ తండ్రి.. సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో ఆమెను పనిలో పెట్టాడు. మీసమ్మ కూడా తన అన్నం తానే వండుకు తినేది. ఈ క్రమంలో మీసమ్మ మానసిక పరిస్థితి దెబ్బతింది. ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని ఆమె తల్లిదండ్రులను వేధించసాగాడు. మంగళవారం భార్యను ఇంట్లో నిర్బంధించి పిల్లలను బడికి పంపి తానూ టైలర్‌షాప్‌నకు వెళ్లిపోయాడు. మీసమ్మ గట్టిగా కేకలు వేసినా తలుపులు తీయకుండా అలాగే ఉంచాడు. గురువారం మీసమ్మ బంధువులు ఇంటికి రావడంతో విషయం వెలుగులోకొచ్చింది. కూడూనీళ్లూ లేకుండా పడి ఉన్న మీసమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment