గాజువాక, న్యూస్‌లైన్: విశాఖ గాజువాక పరిధిలోని ఇందిరా కాలనీలో ఓ గృహిణి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లిమర్లకు చెందిన మాణిక్యం లక్ష్మణరావు కూర్మన్నపాలెం ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకులో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. విజయనగరంలోని బాబామెట్టకు చెందిన సుశీల(26)ను ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ఈ దంపతులు ఉపాధి వెతుక్కుంటూ విశాఖ వచ్చేశారు. లక్ష్మణరావు శుక్రవారం ఉదయం విధుల్లోకి వెళ్లాడు. ఆయన విధుల్లో ఉండగా తన ఆరోగ్యం బాగులేదని, ఆస్పత్రికి వెళ్లాల్సి ఉన్నందున రావాలని భార్య ఫోన్ చేసింది.
తాను డ్యూటీలో ఉన్నందున వెంటనే రాలేనని, మధ్యాహ్న భోజన సమయంలో వస్తానని భర్త బదులిచ్చాడు. ఆ తర్వాత కూడా సుశీల రెండుమూడు సార్లు భర్తకు ఫోన్ చేసింది. అనంతరం కొద్దిసేపటికి వంటగదిలోని ఫ్యాన్‌హుక్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు లక్ష్మణరావుకు, గాజువాక పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్‌ఐ దాలిబాబు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని లక్ష్మణరావును విచారణ చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
విశాఖలో వివాహిత ఆత్మహత్య
Published Sat, Dec 14 2013 4:17 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement