భర్త ఇంటి ముందు ఉమామహేశ్వరి నిరసన దీక్ష
కొవ్వూరు రూరల్ : ప్రేమించానన్నాడు.. నాలుగేళ్లకు పైగా కలిసి జీవించాడు... ఇప్పుడు నువ్వు నాకొద్దు అంటున్నాడంటూ ఓ యువతి భర్త ఇంటి ముందు నిరసన దీక్షకు దిగింది. భర్త తనను కాపురానికి తీసుకువెళ్లాలని వేడుకుంటోంది. ఈ సంఘటన కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత మహిళ, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన ఈలి నెహ్రూకు నలుగురు కుమార్తెలు. మూడో కుమార్తె ఉమామహేశ్వరిని కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఉన్న తోడల్లుడు పోలిశెట్టి వెంకట్రావుకు పెంపకానికి ఇచ్చారు. అదే విధంగా చాగల్లు మండలం చంద్రవరానికి చెందిన బండి చంద్రరావు తన కుమారుడు పూర్ణ సుబ్బారావును మద్దూరు గ్రామంలోని తన తోడల్లుడు కుసులూరి చంద్రరావుకు పెంపకానికి ఇచ్చారు. ఈ క్రమంలో డిగ్రీ చదువుతున్న ఉమా మహేశ్వరి, పూర్ణ సుబ్బారావులకు పరిచయం ఏర్పడింది. అనంతరం పరిచయం ప్రేమగా మారడం, యువకుడి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో గొడవ కొవ్వూరు రూరల్ పోలీసు స్టేషన్‌కు చేరింది.
పోలీసుల సాక్షిగా వివాహం
ఇరువర్గాల పెద్దలతో చర్చించిన అనంతరం ఉమామహేశ్వరి, పూర్ణ సుబ్బారావులు ఒకరికొకరు ఇష్టపడడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లోనే ఇరువురికి పోలీసుల సాక్షిగా దండలు మార్పించారు. అనంతరం కొవ్వూరులోని ఓ దేవాలయంలో వివాహం జరిపించారు. వీరి వివాహాన్ని చట్టబద్దంగా నమోదు చేయించారు. అనంతరం భార్య, భర్తలు ఇరువురు ఉద్యోగం నిమిత్తం ఢిల్లీలో కాపురం పెట్టారు. పూర్ణ సుబ్బారావు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఉమా మహేశ్వరి ఇంటి వద్దనే ఉంటోంది. వీరి సంసారం 2017 మార్చి వరకు సజావుగానే సాగింది.
అదే నెలలో దుబాయ్‌లో తనకు ఉద్యోగం వచ్చిందని, ఓ నాలుగు నెలల్లో వీసా చూసి నిన్ను తీసుకువెళతానని నమ్మించి ఉమా మహేశ్వరిని ఓ హాస్టల్‌లో ఉంచి పూర్ణ సుబ్బారావు వెళ్లిపోయాడు. అయితే నాలుగు నెలల్లో తీసుకు వెళతానన్న వ్యక్తి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చిన ఉమా మహేశ్వరి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి గత ఏడాది జులైలో ఢిల్లీ నుంచి కడియపులంక చేరుకుంది. ఈ క్రమంలో మధ్యవర్తుల ద్వారా భర్తతో చర్చలు జరపగా తాను వస్తున్నానని, నువ్వు మద్దూరులోని తమ ఇంటికి రావాలని భర్త చెప్పడంతో ఆగస్టులో ఉమామహేశ్వరి మద్దూరులో భర్త ఇంటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మద్దూరు వచ్చిన పూర్ణ సుబ్బారావు నిన్ను దుబాయ్ తీసుకువెళ్లాలంటే ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్ కావాల్సి ఉందని, అది తనకు ఇవ్వాలని తీసుకుని, తన పెంపుడు తండ్రి అయిన చంద్రరావు ఇంటిలో ఉండాలని చెప్పి దుబాయ్ వెళ్లిపోయాడు.
అయితే అత్త వారి ఇంట్లో వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో పెద్దల సమక్షంలో భర్త వచ్చే వరకూ తల్లిదండ్రుల వద్ద ఉండాలని తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. గత ఏడాది నవంబర్‌లో ఇండియా వచ్చిన పూర్ణ సుబ్బారావు తనను భార్య విడాకులు ఇమ్మంటోందని, రూ.25 లక్షలు డిమాండు చేస్తోందని, తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ డిసెంబర్ నెలాఖరున లాయర్ నోటీస్ పంపడంతో విస్మయానికి గురైన ఉమామహేశ్వరి తల్లి దండ్రులు తమ కూతురు కాపురం సరిదిద్దాలని కోరుతూ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఆమెను కాపురానికి తీసుకు వెళ్లడానికి భర్త పూర్ణ సుబ్బారావు, అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో న్యాయాన్ని కోరుతూ భర్త ఇంటి ముందు నిరసన దీక్షతో పోరాటానికి సిద్ధం అయ్యింది. ఆమెకు మద్దతుగా స్థానికులు, బంధువులు భర్త ఇంటి ముందు భైఠాయించారు.
అందుబాటులో లేని పూర్ణ సుబ్బారావు కుటుంబ సభ్యులు
మద్దూరులో పూర్ణ సుబ్బారావు కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేరు. తాను ఇంటికి వస్తున్నానని తెలియడంతో ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారని బాధితురాలు ఉమా మహేశ్వరి ఆరోపిస్తోంది. పూర్ణ సుబ్బారావును ఫోన్‌లో వివరణ కోరడానికి సాక్షి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.
Comments
Please login to add a commentAdd a comment