
ఫిరోజ్‌ఖాన్‌కు అశ్రునివాళి
జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ అంత్యక్రియలు ముగిశాయి.
అధికార లాంఛనాల నడుమ ముగిసిన అంత్యక్రియలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం పాతబస్తీ ఫలక్‌నుమాలోని సంజయ్‌గాంధీ నగర్‌లో మధ్యాహ్నం పోలీసు లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. మొదట ఫిరోజ్ భౌతికకాయాన్ని స్థానిక మసీదుకు తరలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆర్మీ సిబ్బంది ఫిరోజ్‌ఖాన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లెఫ్టినెంట్ జనరల్ సీఏ పితాలా ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్లు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ లాంఛనాలు ముగిసిన వెంటనే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమయాత్రలో రాజకీయ నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొని, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జగన్ నివాళి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ఫిరోజ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌ఖాన్ సహోద్యోగి అయిన ఎన్.వి.రావుతో సరిహద్దుల వద్ద జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిరోజ్‌ఖాన్ కుటుంబీకులను పరామర్శించారు. జవాను తల్లి, భార్య, పిల్లలను అప్యాయంగా పలకరించారు. ధైర్యంగా ఉండాలని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు.
తరలివచ్చిన ప్రముఖులు
ఫిరోజ్‌ఖాన్‌కు నివాళులర్పించేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. నివాళులు అర్పించిన ప్రముఖుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రెహ్మాన్, మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మోజంఖాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, పార్టీ నేత బండారు దత్తాత్రేయ, మంత్రి దానం నాగేందర్, వైఎస్సార్‌సీపీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, యువజన విభాగం గ్రేటర్ అధ్యక్షులు లింగాల హరిగౌడ్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా తదితరులున్నారు.