కర్నూలు(కల్చరల్)/ఓల్డ్‌సిటీ: మానవ సమాజ పరివర్తన కోసం మహమ్మద్ ప్రవక్త తన జీవితాన్ని అంకితం చేసి ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారని, ఆ ధర్మాన్ని ముస్లింలు తమ జీవన గమనంలో పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని మౌలానా (మతపెద్ద) జంషెద్ తెలిపారు. కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద తబ్లీగ్ జమాత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇస్తెమా రెండో రోజున మధ్యాహ్నం జోహర్ నమాజ్ అనంతరం మౌలానా జంషెద్ ప్రవచనాన్ని బోధిస్తూ ఇస్లాం ధర్మ విశిష్టతను తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త సూచించిన విధానంలో నిఖా చేయడం మేలైన మార్గమని, అనవసర ఖర్చులు ఆయన విధానం కాదని తబ్లీగ్ జమాత్ ప్రముఖుడు హజరత్‌జీ సాద్‌సాహబ్ ముస్లింలకు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆయన సమక్షంలో సామూహిక వివాహాలు జరిగాయి.
రెండో రోజున భారీగా తరిలి వచ్చిన జనం
కర్నూలులో జరుగుతున్న ఇస్తెమాకు దేశం నలుమూల నుంచి ఉప్పెనలా జనం కదిలి వచ్చారు. ఇస్తెమా ప్రాంగణంలో భక్తులే కాకుండా రాజస్తాన్, బిహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు సైతం తరిలి వచ్చి అరుదైన వస్తులు విక్రయిస్తున్నారు. రెండో రోజు ఇస్తెమా.. హజ్ యాత్రను తలపించిందని పలువురు భక్తులు తెలిపారు. సోమవారం హజ్రత్‌జీ ప్రసంగం తరువాత దువా కార్యక్రమంతో ఇస్తెమా ముగుస్తుంది.
ఇస్తెమాలో వైఎస్సార్‌సీపీ నాయకులు
ఇస్తెమాకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు భారీ సంఖ్యలో ఆదివారం హాజరయ్యారు. విజయవాడ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్‌బాషా, షఫీ పాల్గొన్నారు.
సమాజ పరివర్తన కోసం ఇస్లాం ధర్మం
Published Mon, Dec 10 2018 6:06 AM | Last Updated on Mon, Dec 10 2018 6:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment