ఇంటి తలుపు గడియను పగలుగొట్టిన దొంగలు లోనికి ప్రవేశించి బీరువాలోని సుమారు 60 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయూరు.
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : ఇంటి తలుపు గడియను పగలుగొట్టిన దొంగలు లోనికి ప్రవేశించి బీరువాలోని సుమారు 60 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయూరు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం ఏఎస్‌ఆర్ నగర్‌లోని గోకరాజు రంగరాజు వీధిలో నివాసముంటున్న గోకరాజు విశ్వనాథరాజు మొదటి అంతస్థులోని తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పెళ్లికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు తలుపు గడియను పగలగొట్టి లోనికి ప్రవేశించారు. గదిలోని బీరువాను తెరచి 23 బంగారు వస్తువులను అపహరించుకుపోయూరు. సోమవారం ఇంటికి చేరుకున్న విశ్వనాథరాజు, అతని కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై విష్ణుమూర్తి, ఏఎస్సై రమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఏలూరు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చి పరిశీలన చేశారు. చోరీకి గురైన 23 బంగారు వస్తువులు సుమారు 60 కాసులు ఉంటాయని బాధితులు చెబుతున్నారు.