మాస్టర్ ‘ప్లాన్’ | Master Plan | Sakshi
Sakshi News home page

మాస్టర్ ‘ప్లాన్’

Nov 14 2014 3:34 AM | Updated on Sep 2 2017 4:24 PM

మాస్టర్ ‘ప్లాన్’

మాస్టర్ ‘ప్లాన్’

‘భారతరత్న సచిన్ టెండుల్కర్’ క్రీడల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి. ఎంతో బిజీ షెడ్యూల్‌తో ఉండే సచిన్ మరో రెండు రోజుల్లో జిల్లాకు రానున్నారు.

రెండు రోజుల్లో పుట్టంరాజు వారి కండ్రిగకు రానున్న సచిన్
పర్యటన సింపుల్‌గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
అభిమానులకు అనుమతి లేదు, మీడియాకు ఆంక్షలు తప్పవు
సిగరెట్, మందు మానేస్తామని సచిన్‌కు చెప్పనున్న గ్రామస్తులు

 
నెల్లూరు(అర్బన్): ‘భారతరత్న సచిన్ టెండుల్కర్’ క్రీడల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి. ఎంతో బిజీ షెడ్యూల్‌తో ఉండే సచిన్ మరో రెండు రోజుల్లో జిల్లాకు రానున్నారు. జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో ఉన్న పుట్టంరాజు వారి కండ్రిగను దత్తత తీసుకున్న సచిన్ ఆ గ్రామాన్ని సందర్శించేందుకు ఈనెల 16వ తేదీన వస్తున్నారు. మాస్టర్ రానున్న నేపథ్యంలో ఆ గ్రామంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గురువారం సచిన్ ప్రతినిధులైన మనోజ్, నారాయణ ఆ గ్రామానికి వచ్చారు. సచిన్ గ్రామంలో  ఏం చేయాలి? ఎవరిని కలవాలి? అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి?, షెడ్యూల్ ఎలా ఉండాలి? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
 
అంతా సింపుల్‌గా...


మాస్టర్ పర్యటన మొత్తం సింపుల్‌గా జరగనుంది. ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా సాధారణంగా జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సచిన్ కేవలం దత్తత తీసుకున్న గ్రామాన్ని పరిశీలించేందుకు మాత్రమే వస్తున్నారని, మిగతా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనరని ఆయన ప్రతినిధులు తేల్చి చెప్పేశారు. సచిన్ కోసం అభిమానులు వేలల్లో వచ్చే అవకాశం ఉన్నందున వారందర్నీ కంట్రోల్ చేసేందుకు, ఎవ్వరూ అటువైపు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా తోపులాటలు, ఆయన్ను తాకేందుకు ఆస్కారం ఇవ్వరు. వీఐపీలు ఆయన్ను కలిసే ప్రయత్నం చేయకూడదు. కార్యక్రమం ముగింపు సమయంలో ఓ 10 నిమిషాలు గ్రామస్తులు ఆయనతో ఫొటోలు దిగేందుకు అవకాశం కల్పించవచ్చు. సచిన్ రాక నేపథ్యంలో ఆయన తిరిగే అన్నిచోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బ్యారికేడ్ల మధ్యలో సచిన్, మరికొంత మంది మాత్రమే ఉండనున్నారు.
 
ఊరంతా కాలినడకనే తిరిగే అవకాశం

పుట్టంరాజువారికండ్రిగలో సచిన్ కాలినడకనే ఊరంతా పర్యటించే అవకాశం ఉంది. గ్రామం మొదట్లో శంకుస్థాపన కార్యక్రమం తర్వాత నూతనంగా నిర్మితమవుతున్న కంపోస్టు యార్డు, ఆటస్థలం, చెరువును పరిశీలిస్తారు. సచిన్‌ను కలిసే గ్రామస్తులను జేసీ ఆయన ప్రతినిధులకు చూపారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న ఒక కుటుంబాన్ని, ప్రహరీ గోడ కట్టుకున్న మరో కుటుంబాన్ని ఆయన కలుస్తారు. వీళ్లలా ప్రతి కుటుంబం ఉండాలని అవగాహన కల్పించడంలో భాగంగా ఇలా చేస్తారు. ఇంకా పాఠశాలను ప్రారంభించడం, డ్వాక్రా మహిళలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకుంటారు. విద్యార్థులతో కొంతసేపు క్రికెట్ ఆడే అవకాశం కూడా ఉంది. రచ్చబండ వద్ద స్టేజి ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి సచిన్ గ్రామస్తులతో నేరుగా మాట్లాడుతారు. కాగా మాస్టర్ కలిసే కుటుంబాలను, తిరిగే ప్రాంతాలను ఆయన ప్రతినిధులు ఫొటోలు తీసుకుని మరీ వెళ్లారు.

సచిన్‌కు గ్రామస్తుల కానుక

తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ టెండుల్కర్‌కు గ్రామస్తులు మంచి కానుక ఇవ్వనున్నారు. చెడు అలవాట్లు ఉన్న గ్రామస్తులు వాటిని మానేస్తున్నట్లు ఆయన ముందు ప్రకటించనున్నారు. ఇప్పటికే జేసీ, గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ గ్రామస్తులతో ఈ విషయంపై చర్చించారు. పొగాకు, మద్యపానాన్ని వ్యతిరేకించే సచిన్‌కు వాటిని మానతామనడమే గ్రామస్తులు ఇచ్చే కానుక అవుతుందని, ఆయన వచ్చినప్పుడు చెప్పాలని వాళ్లు గ్రామస్తులను కోరారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, సచిన్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని జేసీ గ్రామస్తులకు సూచనలు ఇచ్చారు.

మీడియాకు ఆంక్షలు తప్పవు

సచిన్ పర్యటనలో అభిమానులకే కాదు మీడియాకు ఆంక్షలు తప్పేలా లేవు. మీడియా హడావుడి లేకుండా ఆయన ప్రతినిధులు జేసీని కోరారు. దీంతో సచిన్ వెళ్లే ప్రతి చోటుకు మీడియా ప్రతినిధులను అనుమతించరు. ఒక్కొ దగ్గర కొంతమంది మాత్రమే ఉండేందుకు అనుమతి ఇస్తారు. చానల్స్ ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేందుకు అవకాశం లేదు. స్థానికంగా ఒక చానల్‌కు అనుమతి ఇచ్చి వారి నుంచి అందరూ ప్రసారం తీసుకునేలా ఏర్పాటు చేయనున్నారు. సచిన్‌కు ట్రాన్స్‌లేటర్‌గా జేసీ రేఖారాణి వ్యవహరించనున్నారు.
 
సచిన్ శంకుస్థాపన చేసే పనులు ఇవే..


గూడూరు రూరల్ : రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఆదర్శ గ్రామమైన పుట్టంరాజువారి కండ్రిగలో మొదటి విడతలో రూ.2.79 కోట్లతో ఈనెల 16న శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి పనులు ఇవే...

 1.గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు  2. క్రీడా మైదానం 3. షాపింగ్ కాంప్లెక్స్‌తో కూడిన కమ్యూనిటీ సెంటర్ 4. ఆడియో విజువల్ లైబ్రరీ 5. వైఫైతో కూడిన ఇంటర్‌నెట్ సదుపాయం 6. అంగన్‌వాడీ కేంద్రం అప్‌గ్రేడ్ 7. పశువైద్యశాల 8. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం  9. సీవరేజ్ లైన్‌తో కూడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ 10. కంపోస్టు యార్డు 11. డంపింగ్ యార్డు  12. అధునాతన శ్మశాన వాటిక
 ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement